సుమోటోగా మరియమ్మ మృతి కేసు

సుమోటోగా మరియమ్మ మృతి కేసు
  • మానవ హక్కుల కమిషన్ ​చైర్మన్ జస్టిస్​ జి.చంద్రయ్య
  • ఆస్పత్రిలో మరియమ్మ కుటుంబ సభ్యులకు పరామర్శ

ఖమ్మం, వెలుగు: మరియమ్మ మృతి కేసును సుమోటోగా స్వీకరించి విచారణ చేస్తున్నామని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ​జస్టిస్ ​జి.చంద్రయ్య అన్నారు. ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరియమ్మ కొడుకు ఉదయ్​ కిరణ్ ను బుధవారం హెచ్ఆర్సీ బృందం జిల్లా కలెక్టర్​ఆర్వీ కర్ణన్, పోలీస్​ కమిషనర్​ విష్ణు ఎస్. వారియర్​తో కలిసి పరామర్శించారు. ఉదయ్​కిరణ్​కు అందిస్తున్న చికిత్స వివరాలపై డాక్టర్లతో మాట్లాడారు. మరియమ్మ మృతి ఘటన దురదృష్టకరమని, ఇలాంటివి పునరావృతం కాకుండా కమిషన్​తగు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. కోల్పోయిన ప్రాణాలను తిరిగి తేలేమని, ఆపదలో ఉన్నవారికి మనోధైర్యం కల్పించేందుకు తాము వచ్చినట్టు చెప్పారు. ఉదయ్​కిరణ్​పూర్తిగా కోలుకున్న తర్వాత కేసు విచారణను వేగవంతంగా కొనసాగించి కమిషన్​ చర్యలు తీసుకుంటుందని చెప్పారు. తర్వాత జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో హెచ్ఆర్సీ బృందం పర్యటించింది. ఆస్పత్రిలో వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు, సిబ్బందిని అభినందించారు. అనంతరం నగరంలోని జీవన సంధ్య వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హెచ్ఆర్సీ బృందానికి పలువురు వినతిపత్రాలు అందజేశారు. భూ సమస్యలకు సంబంధించి హెచ్ఆర్సీ పలు ఆదేశాలు ఇచ్చినా వాటిని జిల్లా అధికారులు అమలు చేయడం లేదంటూ తెలంగాణ జనవేదిక ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చారు. హార్వెస్ట్ స్కూల్​సమీపంలో ఎన్ఎస్పీ భూముల్లో పేదల ఇండ్లను బలవంతంగా పోలీసులు ఖాళీ చేయించారంటూ ఫిర్యాదు చేశారు.