- మరో ఇద్దరికి జీవిత ఖైదు
- కామారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు
కామారెడ్డి/సదాశివనగర్, వెలుగు: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ప్రధాన నిందితుడికి ఉరిశిక్షతో పాటు రూ.8 వేల జరిమానా, మరో ఇద్దరికి జీవిత ఖైదు విధించింది. కేసు నమోదు నుంచి తీర్పు వరకు పోలీసులు చేసిన నిరంతర పర్యవేక్షణ, పకడ్బందీ దర్యాప్తు ఫలితంగా బాధిత కుటుంబానికి న్యాయం జరిగిందని జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు.
ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. 2023 డిసెంబర్ 13న కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూంపల్లి శివారులో గుర్తుతెలియని మహిళ మృతదేహం దహనం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాల ఆధారంగా విచారణ జరిపి నిజామాబాద్ జిల్లా మాక్లూర్‌కు చెందిన మెడిద ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇదే గ్రామానికి చెందిన తన స్నేహితుడు పూర్ణ ప్రసాద్ పేరుపై ఉన్న ఇంటిని మెడిద ప్రశాంత్ తన పేరున రిజిస్ట్రేషన్ చేసుకుని లోన్ ఇప్పిస్తానని చెప్పారు.
ఆ తరువాత లోన్ ఇవ్వకుండా పూర్ణ ప్రసాద్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు. ఈ విషయంలో ప్రసాద్ పలుమార్లు ప్రశాంత్‌ను నిలదీశారు. దీంతో ప్రసాద్ కుటుంబాన్ని అంతమొందించి ఆ ఇంటిని సొంతం చేసుకోవాలని ప్రశాంత్ భావించాడు. తన తమ్ముడు మెడిద తేజకిరణ్, గుగులోత్ విష్ణుతో కలిసి పూర్ణ ప్రసాద్ కుటుంబంలో ఆరుగురిని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.
వరుస హత్యలు..
2023 నవంబర్ 29న పూర్ణ ప్రసాద్‌ను హత్య చేసి పూడ్చిపెట్టారు. ఇదే నెల 30న పూర్ణ ప్రసాద్ భార్య రమణిని హత్య చేసి నీటిలో పడేశారు. అదే రోజు చెల్లెలు శ్రావణిని హత్య చేసి దహనం చేశారు. డిసెంబర్ 5న కవల పిల్లలను, 13న పెద్ద చెల్లెలు స్వప్నను హత్య చేశారు.
ఈ కేసులో ప్రశాంత్, తేజ కిరణ్, గుగులోత్ విష్ణు, మెడిద ఒడ్డెమ్మను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కామారెడ్డి జిల్లా కోర్టు శుక్రవారం కేసును విచారించి ప్రధాన నిందితుడు ప్రశాంత్‌కు ఉరిశిక్ష, మరో ఇద్దరు నిందితులు విష్ణు, తేజకిరణ్కు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది.
