
- అమెరికాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు
- పొంగిపొర్లుతున్న నదులు..
- కొనసాగుతున్న సహాయక చర్యలు
కెర్విల్లే (యూఎస్): అమెరికాలోని టెక్సస్‌ను వరదలు ముంచెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరిపిలేని వర్షం కురుస్తుండడంతో ఇక్కడి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. శాన్ ఆంటోనియో, కెర్ విల్లే, శాన్ ఏంజెలో ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. గ్వాడాలూపే నదిలో కేవలం 45 నిమిషాల్లోనే నీటిమట్టం 8 మీటర్ల ఎత్తుకు చేరడంతో భారీగా వరద వచ్చింది. ఇందులో చిక్కుకుని ఇప్పటివరకూ 21 మంది చిన్నారులు సహా 51 మంది మృతిచెందారు. సమీపంలోని కౌంటీల్లో మరో 16 మంది మృతిచెందినట్టు అధికారులు తెలిపారు.
వరదల్లో చెట్లు, కార్లు, ఇల్లు కొట్టుకుపోయాయి. నది చుట్టుపక్కల ప్రాంతమంతా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. 14 హెలికాప్టర్లు, 12 డ్రోన్లతో 9 రక్షణ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. వరదల్లో చిక్కుకున్న 237 మందిని రెస్క్యూ బృందాలు రక్షించాయి. కాగా, చరిత్రలో మొట్టమొదటి అమెరికన్ పోప్ అయిన పోప్ లియో 14.. ఆదివారం మధ్యాహ్నం తమ ప్రార్థనల తర్వాత ఇంగ్లిష్‌లో ప్రసంగించారు. వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
వరదల్లో చిక్కుకున్నవారు క్షేమంగా తిరిగి రావాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇంత తీవ్రమైన వర్షాన్ని తాము ఊహించలేదని, ఇది ఆ ప్రాంతంలో నెలలపాటు కురిసే వర్షానికి సమానమని అధికారులు తెలిపారు. వరదలు వచ్చే అవకాశం ఉన్నదని నేషనల్వెదర్ సర్వీస్ సకాలంలో ప్రజలను అప్రమత్తం చేయలేదని స్థానికులు మండిపడ్డారు.
వరదల వీడియోలు వైరల్
టెక్సస్‌లో సంభవించిన వరదల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒక్కసారిగా వరదలు రావడంతో నదిలో నీటిమట్టం పెరిగి ఉధృతంగా ప్రవహించింది. నది వెంట ఉన్న చెట్లు, ఇండ్లను ముంచెత్తుతూ ప్రవాహం ముందుకుసాగడం వీడియోల్లో కనిపించింది. వరదల్లో కార్లు, ఇతర వెహికల్స్ కొట్టుకుపోయాయి. కొన్ని ఇండ్లు కూలిపోయి శిథిలాల కుప్పగా మారాయి. ఇంటి డాబాపైకి చేరిన, చెట్లపైకి ఎక్కిన వారిని రెస్క్యూ బృందం హెలికాప్టర్లతో కాపాడడం వీడియోలో కనిపించింది. రక్షించిన వారిని రెస్క్యూ బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
36 గంటలు గడిచినా తెలియని ఆచూకీ
కెర్ కౌంటీలోని గ్వాడెలూప్ నదికి ఆకస్మికంగా వచ్చిన వరద మిస్టిక్ క్యాంప్ వేసవి శిక్షణ శిబిరాన్ని ముంచెత్తింది. దీంతో ఇందులోని 27 మంది బాలికలు గల్లంతయ్యారు. వారి కోసం అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. 36 గంటలు గడిచినా వారి ఆచూకీ ఇంకా లభించలేదు. కాగా, ఈ క్యాంప్‌లో ఉంటున్న అలబామాలోని మౌంటేన్ బ్రూక్‌కు చెందిన ఓ 8 ఏండ్ల బాలికతోపాటు మరో క్యాంప్ డైరెక్టర్ మృతి చెందినట్టు అధికారులు ప్రకటించారు.
గల్లంతయిన బాలికల సమాచారాన్ని తెలపాలని వారి కుటుంబాలు సోషల్ మీడియా వేదికల ద్వారా వేడుకుంటున్నారు. రెస్క్యూ సిబ్బందితో కలిసి టెక్సస్ గవర్నర్ జార్జ్ అబాట్ క్యాంప్‌ను సందర్శించారు. సహాయక చర్యలు ముమ్మరం చేశామని, 24 గంటలు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటివరకూ 800 మందిని రక్షించినట్టు తెలిపారు. అలాగే, వరద ప్రభావిత ప్రాంతాన్ని హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయెమ్ సందర్శించారు. వరదల్లో చిక్కుకున్నవారిని రక్షించేందుకు ట్రంప్ సర్కారు అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగిస్తోందని హామీ ఇచ్చారు.