మోడీ తర్వాత నాయకుడెవరు..? బీజేపీ భవిష్యత్తుపై అనిశ్చితి..!

మోడీ తర్వాత నాయకుడెవరు..? బీజేపీ భవిష్యత్తుపై అనిశ్చితి..!

నరేంద్ర మోడీ తొలిసారి ఎంపీగా విజయం సాధించగానే నేరుగా ప్రధానమంత్రి అయ్యారు. ప్రధాని కాకముందు నరేంద్ర మోడీ చాణక్యతను రాజకీయ విశ్లేషకులు, నాయకులు చాలా తక్కువగా అంచనా వేశారు. ఆయనకు ఢిల్లీ రాజకీయాల్లో అనుభవం లేకపోవడం, అంతేకాకుండా మోదీ కంటే ముందు అధికారంలో ఉన్న ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‎లా ఉన్నత  చదువులు లేకపోవడం వల్ల ఆయన విఫలమవుతారని చాలామంది భావించారు. 

కానీ, అత్యున్నత పదవులను చేపట్టడానికి విద్య లేదా విశేష అనుభవం అవసరం లేదని నరేంద్ర మోదీ నిరూపించారు. రాజకీయ రంగంలో రాణించాలంటే సాధారణ జ్ఞానంతోపాటు అదృష్టం కూడా చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ప్రధాని మోదీకి ఈ రెండూ పుష్కలంగా ఉన్నాయి. 200 సంవత్సరాల క్రితం ఫ్రాన్స్ చక్రవర్తి నెపోలియన్‌‌ను యుద్ధాలను గెలవడానికి ఎలాంటి జనరల్స్ అవసరమని అడిగినప్పుడు.. నెపోలియన్  ‘లక్కీ జనరల్స్’ అని సూటిగా సమాధానం ఇచ్చాడు.  

సీఎం, పీఎంగా మోదీ 25 ఏండ్లు

ప్రధానమంత్రిగా మోదీ విజయవంతంగా కొనసాగుతున్నారు.  నరేంద్ర మోదీ ఇప్పుడు ముఖ్యమంత్రి,  ప్రధానమంత్రిగా 25 సంవత్సరాలు విజయవంతంగా  పూర్తి చేసుకున్నారు. ప్రధానమంత్రిగా మోదీ  నిస్సందేహంగా విదేశాంగ వ్యవహారాలు, రక్షణ, అంతర్గత భద్రత, మౌలిక సదుపాయాల వృద్ధి, ఆరోగ్య రంగం తదితర రంగాలలో  తనదైన శైలిలో గొప్ప విజయాన్ని సాధించారు. అయితే, ప్రధానిగా మోదీ పెద్దగా విజయం సాధించని రంగాలు కూడా ఉన్నాయి. 

వ్యవసాయరంగం,  ఉపాధి కల్పన,  భారతదేశంలోకి పొరు గు దేశాల నుంచి అక్రమ వలసలను ఆపడం,  మధ్యతరగతి వర్గాల ఆందోళనను పరిష్కరించడంలో  దేశ ప్రధానిగా మోదీ చాలా తక్కువగా  విజయాన్ని  సాధించారు.  ఆర్థిక వ్యవస్థలో  పెద్ద పెద్ద కార్పొరేట్లు విజయం సాధించారు. కానీ,  అధిక పన్నుల ద్వారా మధ్యతరగతి ప్రజలను దోచుకున్నారు. మునుపటి ప్రభుత్వాల హయాంలో కూడా ఇదే జరిగింది.

మోదీ చేసిన తీవ్రమైన తప్పులు

ప్రధానమంత్రిగా మోదీ చేసిన అతి పెద్ద తప్పు ఏమిటంటే నవంబర్ 8, 2016న పెద్దనోట్లను రద్దు చేయడం.  నోట్ల రద్దు దేశ ఆర్థిక వ్యవస్థను కుంగదీసింది.  స్వయం ఉపాధికి ఎదురుదెబ్బ తగలడం మధ్యతరగతి ప్రజలను దెబ్బతీసింది.  నేటికీ, ఈ వర్గాలు పెద్ద నోట్ల రద్దుతో ఎదురైన విపరిణామాలతో బాధపడుతున్నాయి. అధికంగా వస్తు సేవల పన్ను (జీఎస్టీ),  ఇతర పన్నులు మధ్యతరగతి  ప్రజల ఆర్థికస్థితి,  పొదుపు, కొనుగోలు శక్తిని హరించివేశాయి.  

దేశంలో గణనీయమైన సంఖ్యలో ఉన్న మధ్యతరగతి వర్గాలు సంపదను కోల్పోయినందున ఇది ఒక రకంగా  పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పవచ్చును.  వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం  ప్రధానిగా మోదీ తగినంత శ్రద్ధ ,  నైపుణ్యాన్ని  చూపలేకపోయాడు.  వ్యవసాయాన్ని పునరుద్ధరించడానికి పెద్ద గ్రాంట్లతో కూడిన సాధారణ విధానాలు సరిపోతాయని మోదీ భావిస్తున్నారు. కానీ, ఆ  మందు  వ్యవసాయాభివృద్ధికి పనిచేయడం లేదు.

మోదీ తర్వాత భవిష్యత్తులో అనిశ్చితి

నరేంద్ర మోదీ తర్వాత  ప్రధానమంత్రి పదవిని అధిష్టించేది ఎవరు..?  మోదీ, బీజేపీకి ఎదురవుతున్న అతిపెద్ద సవాలు ఏమిటంటే.. మోదీ తర్వాత ఎవరు బీజీపీ ప్రభుత్వానికి నాయకత్వం వహించగలరు..? నాయకత్వ కమిటీ వ్యవస్థ విఫలమవుతుంది. ప్రధాన సమస్య ఏమిటంటే  మోదీ.. పార్టీతోపాటు ప్రభుత్వంపై కూడా ఆధిపత్యం చెలాయించారు.  వరుసగా మూడు జాతీయ ఎన్నికల్లో  విజయాలను సాధించారు.  

వారసత్వం ఎల్లప్పుడూ కష్టమైన విషయం. మోదీకి దానికోసం ఎటువంటి ప్రణాళిక లేదు. మోదీకి రాజకీయ వారసుడు లేడు.  భారతదేశ వారసత్వ రాజకీయాలను ఆయన నియంత్రించగలిగారు. ఇటీవల  ఒక సందర్భంలో రక్షణమంత్రి రాజ్‌‌నాథ్ సింగ్  ఇలా అన్నారు. 2047 వరకు  ప్రధానమంత్రి పదవి ఖాళీగా లేదు. ఆయన ధైర్యంగా చెప్పిన మాటలు అవి. కానీ, రాజ్‌‌నాథ్ సింగ్ వారసత్వ ప్రణాళికను అభివృద్ధి చేయగలరా..? అనేది ఓ ప్రశ్న. మోదీ సాధించిన విజయం బీజేపీకి 15 సంవత్సరాల జాతీయ ప్రభుత్వాన్ని ఇచ్చింది.  

పవర్​ అండ్​ పాలసీలో వాటా

వాస్తవానికి బీజేపీ, ఆర్‌‌ఎస్‌‌ఎస్ నాయకులు  పవర్​ అండ్​ పాలసీలో  వాటా కోరుకుంటున్నారు.  మోదీ వారు కోరుకుంటున్నది సమకూర్చగలుగుతాడు.  కానీ, అసలు సమస్య ఏమిటంటే బీజేపీ  ఇతర పార్టీల నుంచి కొత్త నాయకులను తీసుకున్నందున మాత్రమే ఉన్నతస్థాయికి ఎదిగింది.  వారు లేకుండా బీజేపీ ఎన్నికలలో  గెలవదు.  ఈక్రమంలో  బీజేపీ సొంత నాయకులకు ప్రాధాన్యత ఇస్తే.. బీజేపీ ఎన్నికల వరుస విజయం దెబ్బతింటుంది. 

అది  మోదీ సారథ్యానికి, బీజేపీకి చాలా పెద్ద ప్రమాదం.  కమలనాథులకు ఎదురవుతున్న ప్రశ్న ఏమిటంటే.. మీరు ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారా లేదా విశ్వాసులను  సంతృప్తి పరచాలనుకుంటున్నారా? దీనికి మోదీ తగిన సమాధానం కనుగొనాలి. చాలాకాలంగా అధికారంలో ఉన్న అందరు నాయకుల మాదిరిగానే, సైకోఫాంట్లు, పరాన్నజీవులు గుమిగూడతారు.  బీజేపీ కాంగ్రెస్ పార్టీని అనుకరిస్తుందా అనేది ఒక ప్రశ్న. 

బ్రిటిష్ మాజీ  ప్రధాన మంత్రి హెరాల్డ్ మెక్​మిలన్ 60 సంవత్సరాల క్రితం ఇలా అన్నాడు.   ‘మంచి ప్రధానమంత్రి మంచి కసాయివాడిగా ఉండాలి’. ప్రధానమంత్రులు తరచుగా మంత్రులను మార్చాలని మెక్​మిలన్​ భావించాడు. కానీ, గత 11 సంవత్సరాలుగా  కేంద్రంలో అదే మంత్రులు ఎక్కువగా కొనసాగుతున్నట్లు మనం చూస్తున్నాం.  ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కోవడానికి మార్పు అనేది అంతిమ ఆయుధం.  కేంద్ర ప్రభుత్వ పాలనలో మోదీ అలా చేయడం లేదు.

అధిక పన్నులు, జీఎస్టీ

అధిక పన్నులు 2024 పార్లమెంటు ఎన్నికలలో తనకు దాదాపు నష్టం కలిగించాయనే వాస్తవాన్ని మోదీ గ్రహించి మేల్కొన్నాడు.  ప్రధాని మోదీ పన్నులను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు.  భారతదేశం 2014 నుంచి అధిక పన్నులను ఎదుర్కొంది.  దీంతో  చాలా మరమ్మతులు చేయాల్సి ఉంది.  ప్రధానిగా మోదీ మధ్యతరగతి, వ్యవసాయంపై దృష్టి పెట్టకపోతే, అపారమైన రాజకీయ సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. 

భవిష్యత్తు అనూహ్యం

160 సంవత్సరాల క్రితం గొప్ప ఫ్రెంచ్ ఆర్థికవేత్త ప్రౌధాన్ ఇలా అన్నాడు ‘భవిష్యత్తు అనూహ్యమైనది’.  మోదీ వర్తమానాన్ని మేనేజ్​ చేయగలడు. కానీ, భవిష్యత్తును మాత్రం మేనేజ్​చేయలేడు. మోదీకి అతిపెద్ద సవాలు ఏమిటంటే  కొత్త నాయకులను తయారుచేయడం. ఆయనలాంటి ప్రజాదరణ ఉన్న వ్యక్తిని కనుగొనడం. కానీ,  నా బీజేపీ స్నేహితులు ‘భారతదేశంలో ఒకే ఒక్క మోదీ ఉన్నాడు. ఆయనలాంటి నాయకుడు ఇంకొకరు లేరు’ అని నాకు చెబుతున్నారు. 

మోదీ విజయవంతమైన ప్రధానమంత్రి అనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. అయితే, ఆయన లేనప్పుడు ఎవరనే అతిపెద్ద సవాలు వస్తుంది. వారసత్వ ప్రణాళికకు ప్రత్యామ్నాయం లేదు. మీ వారసత్వాన్ని మీరే ప్లాన్ చేసుకోవడం బాధాకరం.  కానీ, సామ్రాజ్యాలు పేలవమైన వారసత్వం ద్వారా నాశనమయ్యాయి. మోదీ కొత్త నాయకత్వాన్ని ఎలా తయారు చేసుకుంటాడో చూద్దాం, అదే ఆయన ముందున్న అతిపెద్ద సవాలు.

- డా. పెంటపాటి పుల్లారావు, పొలిటికల్​ ఎనలిస్ట్​