అప్పుల్లో కూరుకుపోయిన వ్యక్తి కష్టాలు తీర్చిన లాటరీ

అప్పుల్లో కూరుకుపోయిన వ్యక్తి కష్టాలు తీర్చిన లాటరీ

కాలం కలిసిరావాలేగానీ పట్టిందల్లా బంగారమవుతుంది. కష్టాలన్నీ కనుమరుగైపోతాయి. కేరళ మంజేశ్వర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి విషయంలోనూ అదే జరిగింది. ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయి అప్పులు తీర్చేందుకు ఇంటిని అమ్మకానికి పెట్టిన ఆయనకు లాటరీ రూపంలో అదృష్టం కలిసి వచ్చింది. ఏకంగా కోటి రూపాయలు సొంతం చేసుకున్నాడు.

కేరళకు చెందిన మొహమ్మద్ బవ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటాడు. వ్యాపారంలో నష్టం రావడం, ఇద్దరు కూతుళ్ల పెళ్లి కోసం భారీగా అప్పు చేయడంతో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాడు. బంధువులు, బ్యాంకు నుంచి తీసుకున్న దాదాపు రూ.50లక్షలు తిరిగిచ్చేందుకు ఇబ్బందులు పడ్డాడు. చివరకు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇంటిని అమ్మకానికి పెట్టాడు. గత ఆదివారం నాడు అగ్రిమెంట్ చేసుకుని టోకెన్ అమౌంట్ తీసుకునేందుకు రెడీ అయ్యాడు. అయితే అంతకు కొన్ని గంటల ముందు  అదృష్టం మొహమ్మద్ ఇంటి తలుపుతట్టింది. 

ఆదివారం నాడు మొహమ్మద్ బవ కేరళ ప్రభుత్వం నిర్వహించే ఫిఫ్టీ ఫిఫ్టీ లాటరీ కొన్నాడు.  మధ్యాహ్నం 3.30గంటల సమయంలో ప్రభుత్వం లాటరీ ఫలితాలు వెల్లడించింది. అందులో మొహమ్మద్ కు కోటి రూపాయల లాటరీ తగిలింది. ఆ విషయం తెలిసి మొహమ్మద్ తో పాటు ఆయన కుటుంబసభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. లాటరీలో జాక్ పాట్ తగలడంతో ఇక ఇల్లు అమ్మాల్సిన అవసరం లేకుండా పోయిందని మొహమ్మద్ అంటున్నాడు. ఆ మొత్తంతో తన కష్టాలన్నీ తీరిపోతాయని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ట్యాక్స్లు పోనూ ఆయన చేతికి రూ.63లక్షలు అందనున్నాయి. ఆ మొత్తంలో అప్పులు తీర్చగా మిగిలిన మొత్తాన్ని అవసరమైన వారికి ఇస్తానని అంటున్నాడు.