
- జీతాలు, పింఛన్లు, ఖర్చులకు కటకట
- మళ్లీ అప్పు పుడితేనో, భూములమ్మితేనో కానీ గట్టెక్కలేని దుస్థితి
- వాయిదాల పద్ధతిలో ఉద్యోగులకు శాలరీలు
- కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ వాళ్లకు
- రెండు మూడు నెలలుగా పెండింగ్
- రిటైరయినోళ్లకు బెనిఫిట్స్ అందుతలేవ్
- గ్రామ పంచాయతీల ఖాతాలు ఫ్రీజ్
- స్కూళ్లకిచ్చిన గ్రాంట్లు రెండు వారాలకే వెనక్కి
- రూ.15 వేల కోట్ల అప్పు కోసం
- ఆర్బీఐకి రాష్ట్ర సర్కార్ ఇండెంట్
- ఇప్పటికే రూ. 4 లక్షల కోట్లు దాటిన అప్పు
ఆసరాకు.. నెలంతా తిరుగుడే
ప్రతి నెలా ఫస్ట్ వీక్‌లో అందాల్సిన ఆసరా పింఛన్లు.. నెలాఖరులో వస్తున్నాయి. దీంతో లబ్ధిదారులు ఎప్పుడు ఇస్తారా అని రోజూ పోస్టాఫీసు, బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తున్నది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, గీత కార్మికులు, హెచ్ఐవీ బాధితులు, బోదకాలు బాధితులు కలిపి దాదాపు 36 లక్షల మంది ఆసరా పింఛన్ లబ్ధిదారులున్నారు. రాష్ట్ర ఖజానాలో డబ్బుల్లేకపోవటంతో పింఛన్ల పంపిణీ లేటవుతున్నది. అందుకే.. 57 ఏండ్లు నిండినోళ్లకు ఆసరా పింఛన్ల హామీని అమలు చేయడం లేదని తెలుస్తున్నది. ఈ పింఛన్ల కోసం కొత్తగా10.50 లక్షల మంది అప్లయ్ చేసుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో ఏప్రిల్ నుంచి కొత్త పింఛన్ల హామీ అమలవుడు డౌటేనని ఆఫీసర్లు అంటున్నారు.
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది. ధనిక రాష్ట్రమని ప్రభుత్వం పదే పదే చెప్తున్నా.. వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నది. అప్పుల మీద అప్పులు చేయడం, రాబడికి మించి ఖర్చులు పెట్టడంతో గల్లా పెట్టె ఘొల్లుమంటున్నది. ఎనిమిదేండ్లలో ఎన్నడూ లేనంత కటకటను ఆర్థిక శాఖ ఎదుర్కొంటున్నది. 18వ తారీఖు దాటినా వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఆసరా పింఛన్లు అందడం లేదు. ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ల చెల్లింపుల కోసం కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. మళ్లీ అప్పులు తెస్తే కానీ, పెద్ద ఎత్తున ఆస్తులు, భూములు అమ్మితే కానీ గండం గట్టెక్కే పరిస్థితి లేదని ఆర్థిక శాఖ వర్గాలు చెప్తున్నాయి. ఏప్రిల్, మే, జూన్ నెలల్లోనే రూ. 15 వేల కోట్లు అప్పు కావాలని రాష్ట్ర ప్రభుత్వం రిజర్వు బ్యాంక్‌కు ఇండెంట్ ఇచ్చింది.
అప్పులు, వడ్డీలతోనే ఎసరు
బడ్జెట్ లెక్కల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చేసే ఖర్చులు, అమల్లో ఉన్న స్కీమ్‌లన్నీ వెళ్లదీయాలంటే.. యావరేజ్‌గా నెలకు రూ.19 వేల కోట్లు అవసరం. జీఎస్టీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, లిక్కర్ అమ్మకాలు, పెట్రోల్, డీజిల్ అమ్మకాలు, రాష్ట్రాల పన్నుల వాటా.. అన్నీ కలిపితే వచ్చేది రూ.12 వేల కోట్లు మించటం లేదు. మిగతా లోటు పూడ్చేందుకు ప్రభుత్వం అప్పులు తేవటంతో ఖజానాపై మోయలేనంత భారం పడుతున్నది. ఇప్పటికే అప్పుల మొత్తం రూ. 4 లక్షల కోట్లు దాటడంతో.. ప్రతి నెలా వడ్డీలు, కిస్తీలకు ప్రభుత్వం రూ. 1,850 కోట్లు చెల్లిస్తున్నది. అప్పులమీద అప్పులు పేరుకుపోవటం, రాబడికి మించి ఖర్చు ఉండటంతో నెలనెలా జీతాలు, నిర్వహణ ఖర్చులకు కటకట మొదలైంది. దళిత బంధుకు, జూన్ ఫస్ట్ వీక్‌లో ఇవ్వాల్సిన రైతు బంధుకు కావాల్సిన నిధుల సర్దుబాటు కోసం ఆఫీసర్లు తలలు పట్టుకుంటున్నారు.
వాయిదాల పద్ధతిలో జీతాలు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫస్ట్ తారీఖున జీతాలు రావటం కలగా మారింది. ఈ నెలలో 15వ తారీఖు నాటికి పది జిల్లాలకు జీతాలు అందలేదు. ఒక్కో రోజు ఒకటీ రెండు జిల్లాలకు శాలరీలు విడుదల చేశారు. ఇప్పటికీ మూడు జిల్లాల్లో కొందరు ఉద్యోగులకు జీతాలు అందలేదు. అన్ని డిపార్టుమెంట్లలో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ట్రెజరీలోనే బిల్లులు నిలిచిపోయాయి. తాను 36 ఏండ్లుగా సర్వీసులో ఉన్నానని, ఏనాడూ ఈ పరిస్థితి రాలేదని వరంగల్ జిల్లాకు చెందిన ఒక హెడ్మాస్టర్ ఇప్పుడున్న పరిస్థితిని తలుచుకున్నారు. కరోనా బిల్లులకు సంబంధించి రీ యింబర్స్‌మెంట్ బిల్లులు ఇప్పటికీ శాంక్షన్ కాలేదని, వేల సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు అంటున్నారు.
మోడల్ స్కూల్ అయితేనేం.. డబ్బుల్లేవ్!
సమగ్ర శిక్షా అభియాన్(ఎస్ఎస్ఏ) పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్‌తో పాటు మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లకు, సిబ్బందికి ఇప్పటికీ జీతాలు రాలేదు. ఎస్ఎస్ఏలో పనిచేసే 18 వేల మంది ఎంప్లాయీస్, మోడల్ స్కూళ్లలో పనిచేసే 5 వేల మందికి వేతనాలు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇందులో రెగ్యులర్ ఎంప్లాయీస్‌కు కూడా ఇప్పటికీ జీతాలు రాలేదు. ప్రతినెలా ఒకటో తారీఖున ఇవ్వాల్సిన జీతాలు... సగం నెల పూర్తయినా ఇవ్వకపోవడంతో బ్యాంకు ఈఎంఐలు, ఇంటి రెంట్‌కు ఇబ్బంది పడుతున్నామని టీచర్లు చెప్తున్నారు.
రిటైర్డ్ ఎంప్లాయీస్‌కు ఎదురుచూపులు
రిటైర్డ్ ఎంప్లాయీస్‌కు అందాల్సిన బెనిఫిట్స్‌ను రిటైర్ అయిన రోజే క్లియర్ చేసి పంపిస్తామని సీఎం పలుమార్లు ప్రకటించారు. అయినా అమలవడం లేదు. రాష్ట్రంలో ఇప్పటికే రిటైర్ అయిన వేల మంది ఉద్యోగులకు వివిధ రకాల బెనిఫిట్స్ బిల్లులు ట్రెజరీలలో మూలుగుతున్నాయి. రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వం నుంచి అందాల్సిన ఏదో ఒక బెనిఫిట్ పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సంఖ్య 7 వేల పైనే ఉన్నట్లు తెలుస్తున్నది.
ఫ్రీజింగ్ లో గ్రామ పంచాయతీల అకౌంట్లు
చాలా జిల్లాల్లో ట్రెజరీ అధికారులు గ్రామ పంచాయతీ అకౌంట్లను ఫ్రీజింగ్లో పెట్టారు. దీంతో రాష్ట్రంలో దాదాపు 36,500 మంది మల్టీ పర్పస్ వర్కర్లకు జీతాలు బంద్ అయ్యాయి. తమకు జీతాలు చెల్లించాలంటూ నిర్మల్ జిల్లాలో కార్మికులు రోడ్డెక్కారు. దాదాపు 9,300 మంది గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఇప్పటికీ మార్చి నెల జీతాలు చెల్లించలేదు.
స్కూళ్ల గ్రాంట్లు రిటర్న్
స్కూళ్ల నిర్వహణ కోసం మార్చిలో రిలీజ్ చేసిన గ్రాంట్‌ను రెండు వారాలు తిరక్కముందే ఆర్థిక శాఖ వెనక్కి తీసుకుంది. ఖాతాలు క్లోజ్ చేసి, దాంట్లోని అమౌంట్‌ను స్టేట్ అకౌంట్‌కు పంపించాలని ఈ నెల13న ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో దాదాపు రూ.100 కోట్లు వెనక్కి పోయాయని, డబ్బుల్లేకనే ప్రభుత్వం వీటిని తీసుకుందని టీచర్లు అభిప్రాయపడుతున్నారు. కాగా, కాంట్రాక్టర్లకు రూ. 21 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.
ఇంకా ఆసరా అందక తిప్పలు
ఈ ఫొటోలో కనిపిస్తున్న దివ్యాంగుడి పేరు కిన్నెర కృష్ణమూర్తి(52). హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని నిరుపేద కుటుంబానికి చెందిన ఈయన భార్య ఇటీవలే అనారోగ్యంతో చనిపోయింది. ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. ప్రతి నెలా గవర్నమెంట్ నుంచి వచ్చే మూడు వేల రూపాయలు ఆయనకు ఆసరా. కానీ.. ఇచ్చే పింఛన్ ప్రతి నెలా లేటవుతున్నదని, ఈ నెలలో ఇప్పటికీ అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నడు.
డబ్బులు లేవంటున్రు
కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లకు మూడు నెలలు దాటినా జీతాలు రాలేదు. అడిగితే ఆర్థిక శాఖ దగ్గర డబ్బులు లేక ఆగిపోయాయని అంటున్నరు. శాలరీస్ రాక టీచర్లు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నరు. ఈఎంఐలు, రెంట్లు కట్టడానికి అప్పులు తెస్తున్నరు. జీతాలు ఎప్పుడు వస్తయా అని ఎదురుచూడాల్సిన పరిస్థితి. సర్కారు స్పందించి వెంటనే జీతాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలి.
‑ మాలోతు సోమేశ్వర్, స్టేట్ ప్రెసిడెంట్, ఆశ్రమ పాఠశాలల కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్ల సంఘం.