
ఇటానగర్: ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్‌లో క్రికెట్‌ను అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించిన ‘టెచి టాగర్ అరుణాచల్ టీ20 చాంపియన్‌షిప్’లో అరంగేట్రం చేసేందుకు కామెంగ్ కింగ్స్ జట్టు సిద్ధమైంది. గౌహతి వేదికగా జరగనున్న ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు తలపడనున్నాయి. కామెంగ్ ప్రాంతపు పోరాట స్ఫూర్తికి ప్రతీకగా బరిలోకి దిగుతున్న కామెంగ్ కింగ్స్ తమ తొలి సీజన్‌లోనే ముద్ర వేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఇటానగర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో జట్టు జెర్సీ, లోగోను ఆవిష్కరించారు. కామెంగ్ కింగ్స్ కెప్టెన్ టీఎన్‌ఆర్ మోహిత్ ఈ ఈవెంట్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాడు.
హైదరాబాద్ నుంచి అరుణాచల్ జట్టుకు మారిన స్పిన్నర్ మోహిత్ ఇప్పుడు ఆ రాష్ట్ర క్రికెట్‌లో ఓ సంచలనం.. అరుణాచల్ క్రికెట్ ఫ్యూచర్ స్టార్‌గా గుర్తింపు పొందాడు. అరుణాచల్ తరఫున ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అడుగుపెట్టిన తొలి మ్యాచ్‌లోనే సిక్కింపై 9 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. ఆ సీజన్ మొత్తం 19 వికెట్లతో సత్తా చాటాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా తన నిలకడైన ఆటతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ సందర్భంగా మోహిత్ మాట్లాడుతూ, ‘ఈ జెర్సీ ధరించడం ఒక బాధ్యత. ఇది కేవలం ఆట కాదు, మా ప్రాంత ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించడం. వ్యక్తిగత రికార్డుల కన్నా జట్టుగా విజయం సాధించడమే నాకు ముఖ్యం. మేమంతా కలిసి ఈ సీజన్‌లో అద్భుతాలు చేస్తామని నమ్ముతున్నాను’ అని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. టీమ్ ప్రధాన స్పాన్సర్, లైవ్‌వైర్స్ అడ్వర్టైజింగ్ ఎండీ తడకమల్ల అరవింద్ మాట్లాడుతూ ‘ఇది కేవలం స్పాన్సర్‌షిప్ కాదు, అరుణాచల్ యువత భవిష్యత్తుపై మా నమ్మకం, వారి కోసం పెడుతున్న పెట్టుబడి’ అని అన్నారు.