
- కలెక్టరేట్లు, రైతువేదికల వద్ద స్వాగత తోరణాలు
- వర్చువల్గా సీఎం స్పీచ్ విన్న రైతులు
నెట్వర్క్, వెలుగు:రెండో విడత రుణమాఫీ సందర్భంగా మంగళవారం తెలంగాణ అంతటా రైతులు సంబురాలు చేసుకున్నారు. కలెక్టరేట్లు, రైతు వేదికల్లో వేడుకలు ఘనంగా జరిగాయి. కొద్ది రోజుల వ్యవధిలోనే రెండో విడత లక్షన్నర రూపాయలలోపు లోన్లను మాఫీ చేయడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ మీటింగ్ హాళ్లలో, రైతువేదికల్లో వర్చువల్గా సీఎం రేవంత్ రెడ్డి సందేశాన్ని విన్నారు.
యాదాద్రి కలెక్టరేట్లో కలెక్టర్ హనుమంతు జెండగే రుణమాఫీ చెక్కులు పంపిణీ చేశారు. జిల్లాలో రెండో విడత 16,143 మంది రైతులకు రూ.165. 87 కోట్లు మాఫీ జరిగింది. సూర్యాపేటలో 26,376 మంది రైతులకు రూ. 250.07 కోట్లు రుణమాఫీ జరిగినట్టు అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత తెలిపారు. నల్గొండ జిల్లాలో 50,409 మంది రైతుల ఖాతాలలో రూ. 503.89 కోట్లు జమ కానున్నాయని కలెక్టర్ నారాయణరెడ్డి చెప్పారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో లక్షన్నరలోపు రుణా లున్న 63,286 మంది రైతుల అకౌంట్లలో రూ.580.44 కోట్లు జమ కానున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 11,915 మంది రైతులకు చెందిన రూ.116 కోట్లు, పెద్దపల్లి జిల్లాలో 13,238 మం ది రైతులకు రూ.122.44 కోట్లు, కరీంనగర్ జిల్లాలో 18,510 మందికి రూ.173.28 కోట్లు, జగిత్యాల జిల్లాలో 19,623 మందికి రూ.169 కోట్ల లోన్లు మాఫీ అయ్యాయి. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి కలెక్టరేట్లలో రుణమాఫీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మెదక్ జిల్లాలో రెండో విడతలో 21,517 మంది రైతులకు రూ.202.98 కోట్లు మాఫీ అయినట్టు కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు.
సిద్దిపేట జిల్లాలో 27,955 మంది రైతులకు రూ.279.33 కోట్లు మాఫీ జరిగిందని కలెక్టర్ మను చౌదరి చెప్పారు.సంగారెడ్డి జిల్లాలో 27,249 మంది రైతుల ఖాతా ల్లో ప్రభుత్వం రూ.286.76 కోట్లు జమ చేసినట్లు కలెక్టర్ క్రాంతి తెలిపారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 1,04,113 మంది రైతులకు రూ.1,023 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి. ఆయా కలెక్టరేట్లలో పలువురు రైతులకు చెక్కులను అందజేశారు. రైతు వేదికల వద్ద బ్యాంకు, అగ్రికల్చర్ఆఫీసర్లు రైతులతో సమావేశమై మాఫీకి సంబంధించిన వివరాలు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో 22,868 మంది రైతులకు రూ.210 కోట్లు, కామారెడ్డి జిల్లాలో 24,816 మందికి రూ.211 కోట్లు మాఫీ అయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో రైతులకు కలెక్టర్లు చెక్కులు పంచారు.
సీఎంతో మాట్లాడిన మెదక్ జిల్లా గిరిజన మహిళ రైతు
కౌడిపల్లి, వెలుగు: రెండో విడత రుణమాఫీ నిధుల విడుదల సందర్భంగా మంగళవా రం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం హరిచంద్ తండాకు చెందిన మూడావత్ కోమిని అనే గిరిజన మహిళా రైతు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా చెక్ అందు కున్నారు. ఆమెకు రూ.1.50 లక్షల రుణం మాఫీ అయ్యింది. ఈ సందర్భంగా ఆమె సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో లక్ష రూపాయలు లోన్ ఉంటే నాలుగు విడతలుగా మాఫీ చేశా రని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒకేసారి లక్షా 50 వేలు రుణమాఫీ అయ్యిందని కోమిని సంతోషం వ్యక్తం చేశారు.