ఔటర్ రింగు రోడ్డు​పై కుళ్లిపోయిన డెడ్ ​బాడీ

ఔటర్ రింగు రోడ్డు​పై కుళ్లిపోయిన డెడ్ ​బాడీ
  • వ్యక్తిని చంపిన మూట కట్టి పడేసిన దుండగులు 
  • మూడు రోజుల కిందట పడేసినట్లుగా గుర్తింపు 
  • డెడ్​బాడీ నుంచి గోల్డ్ ఆర్నమెంట్స్ స్వాధీనం
  • కేసు నమోదు చేసిన ఆదిభట్ల పోలీసులు

ఎల్​బీనగర్,వెలుగు :  ఔటర్ రింగు రోడ్డుపైన బస్తా మూటలో డెడ్ బాడీ కలకలం రేపింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పీఎస్ పరిధి బ్రాహ్మణ పల్లి వద్ద ఔటర్ పైన కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహం నుంచి మంగళవారం దుర్వాసన రావడంతో స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు.  వెళ్లి డాగ్ స్వ్కాడ్, క్లూస్ టీంతో దర్యాప్తు చేయగా మూటలో కాళ్లు చేతులు కట్టేసి కట్టి పడేసిన వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు ఎక్కడో హత్య చేసి తెచ్చి ఔటర్ పై నుంచి కిందకు పడేసినట్లు పోలీసులు అనుమానించారు.

డెడ్ బాడీ కుళ్లిన స్థితిలో ఉండగా రెండు, మూడు రోజుల కిందట పడేసి ఉంటారని భావిస్తున్నారు. హత్యకు గురైన వ్యక్తి 40 –-50 ఏళ్ల మధ్య ఉండవచ్చని తెలిపారు. డెడ్ బాడీ నుంచి బంగారు చైన్, బ్రాస్ లెట్ స్వాధీనం చేసుకున్నారు. మృతుడు  ఏ ప్రాంతానికి చెందినవారోనని ఆరా తీస్తున్నారు. వ్యక్తి మిస్సింగ్ కేసు ఏదైనా పీఎస్ లో నమోదు అయ్యిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

నాలుగు రోజులుగా ఔటర్ పై తిరిగిన వాహనాలు, వాటి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఘటన స్థలాన్ని మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి పరిశీలించారు. హత్యకు గురైన వ్యక్తి ఎవరు..? ఎందుకు హత్య చేశారోననే  కోణంలో ప్రత్యేక పోలీసు బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి.  

దుండిగల్ ప్రాంతంలో..

దుండిగల్ : గుర్తు తెలియని వ్యక్తి డెడ్​బాడీ కనిపించిన ఘటన దుండిగల్ పీఎస్ పరిధిలోని బహదూర్ పల్లిలోని జ్యోతి మిల్క్ వద్ద చోటు చేసుకుంది. స్థానికులు మంగళవారం ఉదయం డెడ్ బాడీని చూసి పోలీసులకు సమాచారం అందించారు. దుండిగల్ పోలీసులు వెళ్లి పరిశీలించగా.. చనిపోయిన వ్యక్తి  30 ఏళ్ల లోపు ఉంటాడని, గుర్తుతెలియని వాహనం ఢీకొని, లేదా ఇతర కారణాలతో  మృతి చెంది ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

మృతుడి వివరాలు తెలియరాలేదు. అతని వద్ద లభించిన వివరాలను బట్టి చూస్తే.. హిందీ మాట్లాడతాడని, కార్మికుడి పని చేస్తూ జీవిస్తాడని తెలిసింది. దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.