డిసెంబర్ 4 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు

డిసెంబర్ 4 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు

సోమవారం (డిసెంబర్ 4) నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సారి వాడీవేడిగా సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 4 నుంచి 22వ తేదీ వరకూ 15 రోజుల పాటు ఉభయ సభలు భేటీ కానున్నాయి. మరికొన్ని నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ టర్మ్​లో ఇవే ఆఖరి శీతాకాల సమావేశాలు కానున్నాయి. 

ఈ సెషన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం క్లియర్ చేయాలనుకుంటున్న కొన్ని కీలక బిల్లులపై ఫోకస్ పెట్టింది. ఈ సమావేశాల్లో మొత్తం 21 బిల్లులను ఆమోదించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం జాబితా సిద్ధం చేసుకుంది. వీటిలో 19 సాధారణ బిల్లులు, 2 ఆర్థిక బిల్లులు ఉన్నాయి. లోక్ సభలో పాస్ అయిన ది రిపీలింగ్ అండ్ అమైండ్​మెంట్ బిల్లు –2023, రాజ్యసభలో ఆమోదం పొందిన ది అడ్వకేట్స్ (అమైండ్​మెంట్) బిల్లు –2023, ది ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్–2023లను ఈ సెషన్​లో కేంద్రం ప్రవేశ పెట్టనుంది.

భారతీయ న్యాయ సంహిత బిల్లు–2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత బిల్లు–2023, భారతీయ సాక్ష్య బిల్లు–2023, కేంద్ర ఎన్నికల ప్రధా‌న కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకం.. మహిళా రిజర్వేషన్ చట్టంలోని నిబంధనలను జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరికి విస్తరించడానికి 2 బిల్లులు, సెంట్రల్ యూనివర్సిటీ సవరణ బిల్లు, పోస్టాఫీసు సవరణ వంటి ముఖ్య బిల్లులు ఉన్నాయి. అలాగే 2023–24కు సంబంధించిన డిమాండ్స్ అండ్ గ్రాంట్స్, 2020–21 డిమాండ్స్ ఫర్ ఎక్సెస్ గ్రాంట్స్​పై చర్చ చేపట్టనున్నారు.

నిర్మాణాత్మక చర్చకు సిద్ధం : ప్రహ్లాద్ జోషి 

శీతాకాల సమావేశాలు సజావుగా సాగేలా సహకరించాలని పార్లమెంట్ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి విపక్షాలను కోరారు. నిర్మాణాత్మక చర్చకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. శనివారం (డిసెంబర్ 2న) ఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ బిల్డింగ్​లో ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. ఈ భేటీకి కేంద్ర మంత్రులు రాజ్​నాథ్ సింగ్, అర్జున్ రాం మేఘ్వాల్, 23 పార్టీల నుంచి 30 మంది నేతలు హాజరయ్యారు. సభలో విపక్షాలు లేవనెత్తే అన్ని అంశాలపై చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు.

మొయిత్రాపై వేటుకు రంగం సిద్ధం   

డబ్బులు తీసుకొని లోక్‌‌‌‌సభలో ప్రశ్నలు అడిగారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణముల్ కాంగ్రెస్‌‌‌‌(టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రాపై వేటుకు రంగం సిద్ధమైంది. ఎథిక్స్‌‌‌‌ కమిటీ లోక్‌‌‌‌సభకు తమ నివేదికను సమర్పించిన తర్వాత మొయిత్రాపై అనర్హత వేటు వేయాలని కేంద్రం కోరనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 4న ప్రారంభం కానున్న శీతాకాల సమావేశాల్లోనే ఎథిక్స్‌‌‌‌ కమిటీ తన నివేదికను లోక్‌‌‌‌సభ ముందు ఉంచనుందని సమాచారం.

లోక్‌‌‌‌సభలో ప్రశ్నలు అడిగేందుకు పారిశ్రామికవేత్త హిరానందాని నుంచి మొయిత్రా డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలపై ఎథిక్స్‌‌‌‌ కమిటీ విచారణ జరిపి నివేదికను రూపొందించింది. ఈ నివేదికను పరిశీలించేందుకు బీజేపీ ఎంపీ వినోద్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ సోన్కర్‌‌‌‌‌‌‌‌ నేతృత్వంలోని ప్యానల్‌‌‌‌ సమావేశమైంది. అనంతరం దానిని 6:4 మెజారిటీతో ఆమోదించింది.