
సెప్టెంబర్‌లో 9 శాతం తగ్గి 30,421 కోట్ల ఇన్‌ఫ్లో నమోదు
గ్లోబల్ అంశాలే కారణమంటున్న ఎనలిస్టులు
మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఏయూఎం రూ.75.61 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడులు తగ్గుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో రూ.30,421 కోట్ల ఇన్‌ఫ్లో నమోదవగా, వరుసగా రెండో నెలలోనూ డౌన్ ట్రెండ్ కొనసాగింది. ఈ ఏడాది ఆగస్టులో వచ్చిన రూ.33,430 కోట్లతో పోలిస్తే సెప్టెంబర్‌లో 9 శాతం తగ్గుదల కనిపించింది. అలాగే ఈ ఏడాది జులైలో నమోదైన ఆల్‌టైం హై రూ.42,703 కోట్ల కంటే తగ్గింది.
మార్కెట్‌లో ఉన్న అస్థిరత, గ్లోబల్ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని ఎనలిస్టులు చెబుతున్నారు. అందుకే ఈక్విటీ బేస్డ్ ఫండ్స్‌లోకి ఇన్వెస్ట్‌మెంట్లు తగ్గుతున్నాయని అన్నారు. అయినప్పటికీ, వరుసగా 55వ నెలలో ఈక్విటీ స్కీముల్లోకి నెట్ ఇన్‌ఫ్లో ఉండటం విశేషం. లాంగ్‌టెర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం మ్యూచువల్ ఫండ్స్ వైపు ఇన్వెస్టర్లు చూస్తున్నారు.
ఈక్విటీ ఫండ్స్‌లోకి పెట్టుబడులు తగ్గడం సాధారణమని, ఏడాదిలోని ఈ టైమ్‌లో ఫండ్స్‌లోకి ఇన్‌ఫ్లో తగ్గుతుందని మార్నింగ్‌స్టార్ ఇండియా సీనియర్ ఎనలిస్ట్ నేహల్ మేశ్రామ్ అన్నారు. గ్లోబల్ రాజకీయ అనిశ్చితులను కారణంగా ఫండ్స్‌లోకి పెట్టుబడులు తగ్గాయని ఈక్విరస్ వెల్త్ ఎండీ అంకుర్ పుంజ్ పేర్కొన్నారు. సామ్‌కో మ్యూచువల్ ఫండ్ సీఈఓ విరాజ్ గాంధీ ప్రకారం, థీమాటిక్ ఫండ్స్‌లో స్లోడౌన్ కూడా ఈ తగ్గుదలకు ప్రధాన కారణం.
సిప్ కు మాత్రం జై
సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ (సిప్) ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లోకి స్థిరంగా పెట్టుబడులు వస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో సిప్‌ల ద్వారా రూ.29,361 కోట్ల ఇన్‌ఫ్లో నమోదైంది. ఇది ఆగస్టులో ఉన్న రూ.28,265 కోట్ల కంటే ఎక్కువ. ఇది రిటైల్ ఇన్వెస్టర్ల లాంగ్‌టెర్మ్ కమిట్‌మెంట్‌ను సూచిస్తోంది.
కిందటి నెలలో ఈక్విటీ కేటగిరీలలో ఫ్లెక్సీ-క్యాప్ ఫండ్స్‌లోకి రూ.7,029 కోట్లు, మిడ్-క్యాప్ ఫండ్స్‌లోకి రూ.5,085 కోట్లు, స్మాల్-క్యాప్ ఫండ్స్‌లోకి రూ.4,363 కోట్లు, లార్జ్-క్యాప్ ఫండ్స్‌లోకి రూ.2,319 కోట్లు వచ్చాయి.
గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్‌లకు డిమాండ్
గ్లోబల్ ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్టుబడిదారులు డైవర్సిఫికేషన్ కోసం విలువైన లోహాలవైపు మొగ్గుచూపుతున్నారు. గోల్డ్ ఈటీఎఫ్‌లకు ఫుల్ డిమాండ్ కనిపిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో రూ.8,363 కోట్ల ఇన్‌ఫ్లో రాగా, ఆగస్టులో వచ్చిన రూ.2,190 కోట్లతో పోలిస్తే సుమారు నాలుగు రెట్లు పెరిగింది. గోల్డ్ ఈటీఎఫ్‌ల అసెట్ అండర్ మేనేజ్‌మెంట్ (ఏయూఎం) రూ.90 వేల కోట్లకు చేరుకుంది.
సిల్వర్ ఈటీఎఫ్‌లకు కూడా డిమాండ్ కనిపిస్తోంది. మల్టీ-అసెట్ ఫండ్స్‌లోకి సెప్టెంబర్‌లో రూ.5 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. శ్రీరామ్ ఏఎంసీ ఎండీ కార్తిక్ జైన్, ఏంజెల్ వన్ ఏఎంసీ సీఈఓ హేమన్ భాటియా ప్రకారం, గోల్డ్ ర్యాలీ, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, యూఎస్ డాలర్ బలహీనత వలన గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్‌లపై ఇన్వెస్టర్ల ఆసక్తి పెరుగుతోంది.
డెట్ ఫండ్స్ నుంచి పెట్టుబడులు బయటకు..
కిందటి నెలలో డెట్ ఫండ్స్ నుంచి రూ.1.02 లక్షల కోట్ల విత్‌డ్రాయల్స్ జరిగాయి. ఆగస్టులో జరిగిన రూ.7,980 కోట్ల విత్‌డ్రాయల్స్‌తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. లిక్విడ్, మనీ మార్కెట్ ఫండ్స్ నుంచి ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు పెట్టుబడులను విత్‌డ్రా చేసుకుంటున్నారు. క్వార్టర్ ఎండ్ లిక్విడిటీ, అడ్వాన్స్ టాక్స్ కట్టాల్సి రావడమే ఇందుకు కారణం.
కంపెనీలు తమ దగ్గరున్న మిగులు ఫండ్స్‌ను తాత్కాలికంగా డెట్ స్కీమ్‌లలో ఇన్వెస్ట్ చేస్తాయి. మొత్తం భారత మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో కిందటి నెలలో రూ.43,146 కోట్ల నెట్ అవుట్‌ఫ్లో నమోదైంది. ఆగస్టులో రూ.52,443 కోట్ల నెట్ ఇన్‌ఫ్లో రికార్డయ్యింది. ఇండస్ట్రీ ఏయూఎం రూ.75.12 లక్షల కోట్ల నుంచి రూ.75.61 లక్షల కోట్లకు పెరిగింది.