గ్రేటర్​ హైదరాబాద్​లో  తగ్గుతున్న కేసులు

V6 Velugu Posted on Jan 27, 2022

  •     హైదరాబాద్‌‌‌‌లో 20 నుంచి 10 శాతానికి..
  •     అంచనాలకంటే ఓ వారం ముందే నమోదైన కరోనా పీక్‌‌ స్టేజ్​
  •     జిల్లాల్లో రెండు వారాల తర్వాత తగ్గుతుందంటున్న ఆఫీసర్లు

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్‌‌లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. గ్రేటర్​ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో నాలుగైదు రోజుల నుంచి టెస్ట్ పాజిటివిటీ రేటు డిక్రీజ్​ అవుతున్నది. హైదరాబాద్ జిల్లాలో ఈ నెల 18న అత్యధికంగా 20.16 శాతం పాజిటివిటీ రేటు నమోదవగా.. ఆ తర్వాతి రోజు నుంచి తగ్గుతూ వస్తున్నది. గడిచిన మూడు రోజుల నుంచి జిల్లాలో పది శాతం కంటే తక్కువగా పాజిటివిటీ రేటు నమోదవుతున్నట్టు డీఎంహెచ్‌‌  డాక్టర్ వెంకటి చెప్పారు. రంగారెడ్డి జిల్లాల్లో పీక్‌‌ స్టేజ్‌‌లో 22 శాతం వరకూ నమోదైన పాజిటివిటీ.. ఇప్పుడు పది నుంచి పన్నెండు శాతం మధ్య నమోదవుతున్నదని ఆ జిల్లా డీఎంహెచ్‌‌వో డాక్టర్ స్వరాజ్య లక్ష్మి తెలిపారు. మేడ్చల్ జిల్లాలో ఈ నెల 17న అత్యధికంగా 31.81 శాతం పాజిటివిటీ నమోదవగా.. ఆ తర్వాత నుంచి క్రమంగా తగ్గుతున్నది. 

ఇక్కడ బుధవారం 12 శాతం పాజిటివిటీ నమోదైనట్టు ఆ జిల్లా ఆఫీసర్ ఒకరు ‘వెలుగు’తో అన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌‌లో ఈ నెల చివరి వారంలో మూడో వేవ్‌‌ పీక్ స్టేజ్‌‌కు చేరుకుంటుందని ఎక్స్‌‌పర్ట్స్‌‌ అంచనా వేసినప్పటికీ.. అంతకంటే ఓ వారం ముందే పీక్‌‌కు చేరి డిక్రీజింగ్ ట్రెండ్ మొదలైంది. ఒమిక్రాన్ వేరియంట్ అత్యంత వేగంగా స్ర్పెడ్ అవడమే ఇందుకు కారణమని డాక్టర్లు చెప్తున్నారు. 

జిల్లాల సంగతేంటి?

గ్రేటర్ హైదరాబాద్‌‌తో పోలిస్తే జిల్లాల్లో కొంత ఆలస్యంగా థర్డ్ వేవ్‌‌ మొదలైంది. సంక్రాంతికి ముందు వరకూ జిల్లాల్లో పెద్దగా కేసులు రాలేదు. కానీ, సంక్రాంతి తర్వాత గ్రేటర్ హైదరాబాద్‌‌లో కంటే 
జిల్లాల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఇంకో రెండు వారాల వరకు జిల్లాల్లో కేసులు సంఖ్య పెరుగుతూ పోయి, ఆ తర్వాత తగ్గుముఖం పట్టే చాన్స్ ఉందని అధికారులు అంటున్నారు. 

3,801 కేసులు.. ఒకరు మృతి

రాష్ట్రంలో మరో 3,801 మంది కరోనా బారిన పడ్డారని హెల్త్ డిపార్ట్‌‌మెంట్ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం 88,867 మందికి టెస్టులు చేస్తే.. గ్రేటర్ హైదరాబాద్‌‌లో 1,570 మందికి, జిల్లాలో 2,231 పాజిటివ్‌‌ వచ్చిందని పేర్కొంది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,47,155కి పెరిగిందని చెప్పింది. ఇప్పటివరకు 7,05,054 మంది కోలుకున్నారని, మరో 38,023 యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు బులెటిన్‌‌లో పేర్కొన్నారు. వీరిలో 3,332 మంది హాస్పిటళ్లలో చికిత్స పొందుతుండగా, మిగిలిన వాళ్లు హోమ్ ఐసోలేషన్‌‌లో ఉన్నారన్నారు. కరోనాతో బుధవారం ఒకరు మరణించగా, మృతుల సంఖ్య 4,078కి పెరిగింది.

హైదరాబాద్‌‌ జిల్లాలో థర్డ్​ వేవ్​ ఇలా..
తేదీ                                టెస్టులు    కేసులు    పాజిటివిటీ
ఈ నెల
18                                      13,649       2,751    20.16
19                                      14,016       2,605    18.59
20                                       13,218      2,287    17.3
21                                      13,041       2,069    15.87
22                                       12,696     1,709     13.46
23                                      8828           943       10.68
24                                      12,799      1,067     8.34
25                                      12,131       931       7.67

Tagged Decreasing cases in Greater Hyderabad

Latest Videos

Subscribe Now

More News