
- నేషనల్ స్పేస్ డే సందర్భంగా సైంటిస్టులకు ప్రధాని మోదీ పిలుపు
- మానవాళి భవిష్యత్తు కోసం
- స్పేస్ రహస్యాలను వెలికితీద్దాం
- ఏడాదికి 50 రాకెట్లను ప్రయోగించే స్థాయికి చేరాలని ఆకాంక్ష
న్యూఢిల్లీ: మానవాళికి మెరుగైన భవిష్యత్తు కోసం అంతరిక్ష పరిశోధనలకు సిద్ధం కావాలని స్పేస్ సైంటిస్టులకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ‘‘మనం ఇప్పటివరకూ చంద్రుడిని, అంగారకుడిని చేరుకున్నాం. ఇప్పుడు డీప్ స్పేస్ పై ఫోకస్ పెడదాం. అంతరిక్ష రహస్యాలను వెలికితీసేందుకు డీప్ స్పేస్ ఎక్స్ ప్లోరేషన్ మిషన్ చేపడదాం” అని చెప్పారు.
శనివారం నేషనల్ స్పేస్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా స్పేస్ సైంటిస్టులు, స్టూడెంట్లు, పాలసీమేకర్స్ కలిసి నిర్వహించిన సమావేశాలను ఉద్దేశించి ప్రధాని వీడియో ప్రసంగం చేశారు. భవిష్యత్తు మిషన్ల కోసం ఆస్ట్రోనాట్లతో కూడిన సమూహాన్ని ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో యువత కూడా భాగస్వామ్యం కావాలన్నారు. స్పేస్ టెక్నాలజీలో భారత్ ఒకదాని వెంట ఒకటిగా మైలురాళ్లను అందుకుంటూ వస్తోందని, ఇప్పుడు డీప్ స్పేస్ ను అన్వేషించాలన్నారు.
అంతరిక్షానికి ఎల్లలు లేనట్టే.. ఈ రంగంలో పరిశోధనలకూ హద్దులు లేవన్నారు. ఎలక్ట్రిక్ ప్రొపల్షన్, సెమీ క్రయోజెనిక్ ఇంజన్ల టెక్నాలజీలో దేశం గణనీయమైన ప్రగతిని సాధించిందని ప్రధాని చెప్పారు. రాకెట్ ప్రయోగాల్లో ప్రైవేట్ స్టార్టప్ లు కూడా కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ‘‘ప్రైవేట్ సెక్టార్ ముందుకు రావాలని ఆశిస్తున్నా. మనం ఏడాదికి 50 రాకెట్లను ప్రయోగించే స్థాయికి చేరుకోగలమా?” అని స్పేస్ సైంటిస్టులు, ఇంజనీర్లను ప్రధాని ప్రశ్నించారు.
ఈ విజన్ ను సాకారం చేసుకోవడం కోసం అవసరమైన సంస్కరణలను అమలు చేసేందుకు తన ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. మూడు రోజుల క్రితం ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా తనను కలిశారని.. ఐఎస్ఎస్ లో ఎగరేసిన జాతీయ జెండాను తనకు ఇచ్చారని ప్రధాని తెలిపారు. ఆ జాతీయ జెండాను చూసి తాను మాటలకందని ఉద్వేగానికి గురయ్యానన్నారు.