రెండు రోజుల్లో ఆరోపణలు నిరూపించాలి : దీపాదాస్ మున్షీ

రెండు రోజుల్లో  ఆరోపణలు నిరూపించాలి : దీపాదాస్  మున్షీ
  • లేకపోతే రూ.10 కోట్ల పరువునష్టం దావా వేస్త
  • ఎన్వీఎస్ఎస్  ప్రభాకర్ కు దీపాదాస్ మున్షీ నోటీసులు

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్‌ నాయకుల నుంచి ఇటీవల తాను బెంజ్‌  కారు పొందినట్లు ఆరోపణలు చేసిన బీజేపీ నేత ఎన్‌వీఎస్‌ఎస్‌  ప్రభాకర్‌ కు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్  మున్షీ మంగళవారం లీగల్  నోటీసుల పంపారు.  తనపై చేసిన ఆరోపణలకు రెండు రోజుల్లో ఆధారాలు చూపాలని, లేకపోతే రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేస్తానని ఆ నోటీసుల్లో ఆమె హెచ్చరించారు. ఇటీవల ఓ టీవీ చానెల్  నిర్వహించిన డిబేట్ లో ప్రభాకర్  ఆ ఆరోపణలు చేశారు. 

బెంగాల్ కు చెందిన తాను కేంద్ర మంత్రిగా పనిచేశానని, ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా రాజకీయాల్లో కొనసాగుతున్నానని మున్షీ పేర్కొన్నారు. తెలంగాణ  కాంగ్రెస్  రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ గా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీని బలోపేతం చేస్తున్నారని మున్షీ అడ్వొకేట్  థామస్  జోసెఫ్  లాయిడ్  ఆ నోటీస్లులో తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరిశీలకులుగా పనిచేసి పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేశారన్నారు.