దీప్తి ధమాకా..రూ. 3.20 కోట్లతో డబ్ల్యూపీఎల్ వేలంలో టాప్‌‌‌‌‌‌‌‌

దీప్తి ధమాకా..రూ. 3.20 కోట్లతో డబ్ల్యూపీఎల్ వేలంలో టాప్‌‌‌‌‌‌‌‌
  •     ఆర్టీఎంతో మళ్లీ యూపీ వారియర్స్‌‌‌‌ జట్టులోకి
  •     అమేలియా కెర్‌‌‌‌‌‌‌‌కు రూ. 3 కోట్లు
  •      శిఖా పాండేకు రూ. 2.40 కోట్లు

న్యూఢిల్లీ: ఇండియా విమెన్స్ టీమ్ స్టార్ ఆల్‌‌‌‌రౌండర్, వన్డే వరల్డ్ కప్ విక్టరీలో కీలక పాత్ర పోషించిన దీప్తి శర్మపై కాసుల వర్షం కురిసింది. విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్‌‌‌‌) 2026 ఎడిషన్‌‌‌‌ మెగా వేలంలో జాక్‌‌‌‌పాట్ కొట్టింది. అత్యధికంగా రూ. 3.2 కోట్ల ధర పలికి ఆక్షన్ టాపర్‌‌‌‌‌‌‌‌గా రికార్డు సృష్టించింది. గురువారం జరిగిన వేలంలో మార్క్యూ రౌండ్‌‌‌‌లో వచ్చిన దీప్తి శర్మ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ తీవ్రంగా పోటీపడింది. అయితే, యూపీ వారియర్స్ జట్టు వ్యూహాత్మకంగా వ్యవహరించి రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎం) కార్డును ఉపయోగించి ఆమెను తిరిగి దక్కించుకుంది. వేలంలో అత్యధిక పర్సు (రూ. 14.5 కోట్లు), నాలుగు ఆర్టీఎం ఆప్షన్లతో దిగిన  వారియర్స్ ఆధిపత్యం చూపెట్టింది.   ఇండియా వెటరన్ పేస్ ఆల్‌‌‌‌రౌండర్,  చాన్నాళ్లుగా నేషనల్ టీమ్‌‌‌‌కు దూరమైన శిఖా పాండే కోసం ఆర్సీబీతో బిడ్డింగ్‌‌‌‌ వార్‌‌‌‌‌‌‌‌లో నెగ్గిన యూపీ ఏకంగా రూ. 2.40 కోట్లు ఖర్చు చేసి అందరికీ షాకిచ్చింది.  ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌ను వరుసగా మూడు సార్లు ఫైనల్ చేర్చిన మాజీ కెప్టెన్ మెగ్ లానింగ్‌‌‌‌ను ఢిల్లీతో పోరాడి మరీ రూ. 1.9 కోట్లకు యూపీ దక్కించుకుంది. వరల్డ్  నంబర్ వన్ బౌలర్ సోఫీ ఎకిల్‌‌‌‌స్టోన్‌‌‌‌ను రూ. 85 లక్షలకే ఆర్టీఎం ద్వారా తిరిగి తీసుకుంది. ఫోబ్ లిచ్‌‌‌‌ఫీల్డ్ (రూ. 1.2 కోట్లు), స్పిన్నర్ ఆశా శోభన (రూ. 1.1 కోట్లు) కూడా యూపీ గూటికి చేరారు. ఇండియా ప్లేయర్లు  కిరణ్ నవ్‌‌‌‌గిరె (60 లక్షలు), క్రాంతి గౌడ్ (50 లక్షలు)ను యూపీ ఆర్టీఎం ద్వారా తీసుకుంది. 

కెర్ కమాల్ 

ఫారిన్ క్రికెటర్లలో న్యూజిలాండ్ ప్లేయర్లకు మంచి ధర లభించింది. ఆల్‌‌‌‌రౌండర్ అమేలియా కెర్‌‌‌‌‌‌‌‌ రూ. 3 కోట్లతో  వేలంలో సెకండ్ టాపర్‌‌‌‌‌‌‌‌గా నిలిచింది. తను డిఫెండింగ్ చాంప్ ముంబై ఇండియన్స్ టీమ్‌‌‌‌లో చేరింది. కివీస్ డ్యాషింగ్ బ్యాటర్  సోఫీ డివైన్‌‌‌‌ను రూ. 2 కోట్లకు జట్టులోకి తీసుకున్న గుజరాత్ జెయింట్స్‌‌‌‌..  ఇండియా పేసర్ రేణుకా సింగ్‌‌‌‌ను రూ. 60 లక్షలకు కొనుగోలు చేసింది. సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్‌‌‌‌వార్ట్‌‌‌‌ కోసం రూ.1.1 కోట్లు వెచ్చించిన ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్ లిజెల్లీ లీ (రూ. 30 లక్షలు)ని కూడా తీసుకుంది.  ఇంగ్లండ్ బౌలర్ లారెన్ బెల్ (రూ. 90 లక్షలు), నాడిన్ డి క్లెర్క్ (రూ. 65 లక్షలు) బెంగళూరు జట్టులో చేరారు. ఇండియా క్రికెటర్లలో పూజా వస్త్రాకర్ (85 లక్షలు–ఆర్సీబీ), సజీవన్ సజన (75 లక్షలు–ముంబై), భారతి ఫుల్మాలి (70 లక్షలు–గుజరాత్‌‌‌‌), కశ్వీ గౌతమ్ (65 లక్షలు–గుజరాత్‌‌‌‌)కు చాన్స్ లభించింది.

హీలీకి షాక్‌‌‌‌

ఈ వేలంలో అతిపెద్ద సంచలనం ఆస్ట్రేలియా కెప్టెన్ అలీసా హీలీ అన్‌‌సోల్డ్‌‌గా మిగిలిపోవడం. రూ. 50 లక్షల కనీస ధరతో వచ్చిన హీలీని కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపకపోవడం గమనార్హం.

జనవరి 9 నుంచి డబ్ల్యూపీఎల్‌‌‌‌

సాధారణంగా ఫిబ్రవరి–-మార్చిలో జరిగే డబ్ల్యూపీఎల్‌‌‌‌ ఈసారి  నెల ముందే సందడి చేయనుంది. వచ్చే ఏడాది ఇండియాలో టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ నేపథ్యంలో లీగ్‌‌‌‌  జనవరి 9వ తేదీ నుంచే షురూ  అవుతుందని డబ్ల్యూపీఎల్‌‌‌‌  చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్ జయేష్ జార్జ్‌‌‌‌ తెలిపారు.  తొలి దశ మ్యాచ్‌‌‌‌లు నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో షెడ్యూల్ చేశారు.  రెండో దశతో పాటు ఫిబ్రవరి 5న ఫైనల్‌‌‌‌ వడోదరలో  నిర్వహిస్తారు.

అరుంధతికి  75 లక్షలు.. త్రిష, క్రాంతి, మమతకు చాన్స్‌‌

హైదరాబాద్ ప్లేయర్లలో  పేసర్‌‌‌‌‌‌‌‌ అరుంధతి రెడ్డి రూ. 75 లక్షలతో ఆర్సీబీ టీమ్‌‌‌‌లో చేరగా..  ఆల్‌రౌండర్లు గొంగడి త్రిష రెడ్డి (రూ. 10 లక్షలు, యూపీ వారియర్స్), క్రాంతి రెడ్డి (రూ. 10 లక్షలు–ముంబై),  కీపర్ మదివాల మమత (రూ. 10 లక్షలు –డీసీ)కి కూడా అవకాశం లభించింది. యశశ్రీ, ప్రణవి చంద్రకు చాన్స్ రాలేదు. వన్డే వరల్డ్ కప్‌‌‌‌లో సత్తా చాటిన ఏపీ స్పిన్నర్ శ్రీచరణి జాక్ పాట్ కొట్టింది. రూ. 30 లక్షల బేస్ ప్రైస్‌‌‌‌తో వచ్చిన తనను ఢిల్లీ రూ. 1.30 కోట్లకు తీసుకుంది. కానీ, సబ్బినేని మేఘన, షబ్నమ్ షకీల్, స్నేహ దీప్తి అన్‌సోల్డ్‌గా మిగిలారు.

ప్లేయర్     రేటు    టీమ్ 

దీప్తి శర్మ     3.20 కోట్లు    యూపీ వారియర్స్ (ఆర్టీఎం)
అమేలియా కెర్    3.00 కోట్లు    ముంబై ఇండియన్స్
శిఖా పాండే    2.40 కోట్లు    యూపీ వారియర్స్
సోఫీ డివైన్    2.00 కోట్లు    గుజరాత్ జెయింట్స్
మెగ్ లానింగ్    1.90 కోట్లు    యూపీ వారియర్స్

67 వేలంలో అమ్ముడైన మొత్తం ప్లేయర్లు. ఇందులో 23 మంది ఫారిన్ క్రికెటర్లు ఉన్నారు.
40.8 కోట్లు ఐదు ఫ్రాంచైజీలు కలిపి వేలంలో ఖర్చు చేసిన మొత్తం