ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2026 సీజన్ మెగా వేలం గురువారం (నవంబర్ 27) ఢిల్లీలో ప్రారంభమైంది. మెగా ఆక్షన్ కావడంతో స్టార్ ప్లేయర్స్ పై భారీ హైప్ నెలకొంది. మొత్తం 277 మంది ప్లేయర్స్ మెగా ఆక్షన్ లోకి వచ్చారు. ఇందులో 73 స్థానాల కోసం ప్లేయర్స్ పోటీ పడనున్నారు. 194 మంది భారత ప్లేయర్స్ ఉన్నారు. వీరిలో 52 మంది క్యాప్డ్ ప్లేయర్స్ ఉండగా, 142 మంది అన్ క్యాప్డ్ ప్లేయర్స్ ఉన్నారు. డబ్ల్యూపీఎల్ జట్లు ముంబై, బెంగుళూర్, గుజరాత్, ఢిల్లీ, యూపీ ఐదు ఫ్రాంచైజీలు తమ జట్టును పటిష్టం చేసుకోవడానికి సిద్ధమయ్యాయి.
ఇప్పటివరకు జరిగిన ఈ మెగా ఆక్షన్ లో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ దీప్తి శర్మకు భారీ ధర లభించింది. యూపీ వారియర్స్ ఈ ఆల్ రౌండర్ ను రూ. 3.2 కోట్లకు కొనుగోలు చేసింది. మెగా ఆక్షన్ కు ముందు ఉమెన్స్ వరల్డ్ కప్‌లో ఆల్‌రౌండ్ షో చూపెట్టిన దీప్తి శర్మకు విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో నిరాశ ఎదురైంది. ఆమెను యూపీ వారియర్స్ రిటేన్ చేసుకోలేదు. మెగా టోర్నీలో దీప్తి 215 రన్స్, 22 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచింది. అలాగే గతేడాది డబ్ల్యూపీఎల్‌లోనూ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచినా ఫ్రాంచైజీ ఆమెపై కరుణ చూపలేదు. అయితే ప్రస్తుతం జరుగుతున్న మెగా ఆక్షన్ లో అదే జట్టు ఈ యూపీ ఆల్ రౌండర్ ను భారీ ధరకు కొనుగోలు చేయడం విశేషం.
న్యూజిలాండ్ యంగ్ ఆల్ రౌండర్ అమేలియా కెర్ ను ముంబై ఇండియన్స్ రూ. 3 కోట్ల ధరకు సొంతం చేసుకుంది. కెర్ ను కూడా ముంబై రిలీజ్ చేసి ప్రస్తుతం జరుగుతున్న మెగా ఆక్షన్ లో భారీ ధరకు తీసుకుంది. ఇటీవలే బిగ్ బాష్ లీగ్ లో మెరుపు సెంచరీ చేసిన మెగ్ లానింగ్ ను 1.9 కోట్లకు యూపీ వారియర్స్ దక్కించుకుంది. కెప్టెన్ గా లానింగ్ వరుసగా మూడేళ్లు ఢిల్లీ జట్టును ఫైనల్ కు తీసుకెళ్లినా ఆమెను ఢిల్లీ రిలీజ్ చేసింది. భారత స్పిన్నర్ శ్రీ చరనికి మంచి ధర లభించింది. రూ. 1.3 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ఆఫ్ స్పిన్నర్ ను దక్కించుకుంది.
సీనియర్ ప్లేయర్, గత సీజన్ లో ఆర్సీబీ జట్టుకు ఆడిన సోఫీ డివైన్ ను రూ. 2 కోట్లకు గుజరాత్ జెయింట్స్ కొనుగోలు చేసింది. ఇంగ్లాండ్ స్టార్ స్పిన్నర్ సోఫీ ఎక్లెస్టోన్ ను కూడా యూపీ వారియర్స్ దక్కించుకోవడం విశేషం. ఆస్ట్రేలియా ఓపెనర్ లిచ్‌ఫీల్డ్ ను కూడా యూపీ వారియర్స్ దక్కించుకుంది. వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియాపై సెంచరీ కొట్టిన ఈ ఆసీస్ ఓపెనర్ ను రూ.1.2 కోట్లకు కొనుగోలు చేసింది.
