ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు..అసెంబ్లీలో స్పీకర్ ఎదుట వాదనలు

ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు..అసెంబ్లీలో స్పీకర్ ఎదుట వాదనలు
  • విచారణకు అడ్వకేట్లు మాత్రమే హాజరు
  •  కాంగ్రెస్ లో చేరలేదని స్పీకర్ కు నివేదన
  • ఆధారాలున్నాయన్న పిటిషనర్ల తరఫున అడ్వకేట్లు

హైదరాబాద్, వెలుగు: రాజ్యాంగంలోని 10 వ షెడ్యూల్ పరిధిలో ఏర్పాటైన ట్రిబ్యునల్ ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్ల విచారణను శుక్రవారం పున:ప్రారంభించింది. అసెంబ్లీలోని స్పీకర్ ఆఫీసులో శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఇరువర్గాల అడ్వకేట్ల వాదనలు కొనసాగాయి. 

ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, కాలే యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి తరఫున వారి న్యాయవాదులు మాత్రమే ఈ విచారణకు హాజరై వాదనలు వినిపించారు. ఈ నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్, చింత ప్రభాకర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి తరపున వారి అడ్వకేట్లు మాత్రమే హాజరై వాదనలు వినిపించారు. 

ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారని, కాంగ్రెస్ లో చేరలేదని వారి తరఫు న్యాయవాదులు పలు ఆధారాలతో సహా విన్నవించారు. ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారని అందుకు సంబంధించిన పలు ఆధారాలను ఉన్నాయంటూ పిటిషనర్ల తరఫు అడ్వకేట్లు వాదించారు. ఈ నలుగురిపై ఇప్పటికే మొదటి దఫా విచారణ గత నెల 29, ఈ నెల 1వ తేదీల్లో సాగింది. 

ఆ విచారణకు కొనసాగింపుగానే శుక్రవారం మళ్లీ విచారణ చేపట్టారు. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఆరుగురు ఎమ్మెల్యేలపై విచారణ సాగాల్సి ఉంది. ఆయా తేదీలను స్పీకర్ ఇంకా ఖరారు చేయలేదు. అయితే శుక్రవారం విచారణ సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో పలు ఆంక్షలను అమలు చేశారు. కేవలం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మాత్రమే వారి పార్టీ ఆఫీసులకు అనుమతించారు. మాజీ ప్రజాప్రతినిధులు, మీడియాను అనుమతించలేదు.