యాదగిరిగుట్ట అభివృద్ధి పనుల్లో బయటపడ్డ నాణ్యతాలోపం

యాదగిరిగుట్ట అభివృద్ధి పనుల్లో బయటపడ్డ నాణ్యతాలోపం

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కొలువైన యాదగిరిగుట్ట అభివృద్ధి పనుల్లో డొల్లతనం బయటపడింది. సీఎం కేసీఆర్ ఆలోచనలకు ప్రతిరూపంగా రూపుదిద్దుకున్న దివ్య క్షేత్రంలో పనులు ఎంత నాసిరకంగా జరిగాయో తేటతెల్లమైంది. ఒకే ఒక్క వర్షానికి అధికారులు, గుత్తేదారుల నిర్లక్ష్యం బయటపడింది. ఆలయ అభివృద్ధికి దాదాపు రూ. 2వేల కోట్లు ఖర్చుచేయగా.. ఘాట్ రోడ్డు మొదలు.. క్యూ లైన్ల పరిస్థితి చూస్తే నాణ్యతా ప్రమాణాలు ఏ మేరకు పాటించారో అర్థమవుతోంది.

యాదగిరిగుట్టలో ఉదయం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. అకాల వర్షంతో ఆలయ పరిసరాలు అస్తవ్యస్తంగా మారాయి. రోడ్లు కొట్టుకుపోగా.. క్యూలైన్లు చెరువులను తలపిస్తున్నాయి. యాదగిరి గుట్ట ఆలయం పునర్ నెలలు గడవకముందే ఒక్క భారీ వర్షానికే ఘాట్ రోడ్డు కుంగిపోయింది. ఆ ప్రాంతం బురదమయం కావడంతో బస్సులు దిగబడిపోయాయి. ఫలితంగా కొండపైకి రాకపోకలు నిలిచిపోయాయి. యాదగిరి నర్సన్న దర్శనానికి వచ్చిన భక్తులు కాలినడకన కొండపైకి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రెసిడెన్షియల్ సూట్ రోడ్డులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడే ఉన్న రింగ్ రోడ్డు చెరువును తలపిస్తోంది. 

ఇక కొండపైన పరిస్థితి చూస్తే ఈదురుగాలులకు చలువ పందిళ్లు కుప్పకూలాయి. క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లలోకి భారీగా వర్షపు నీరు చేరింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో పరిస్థితి మరింత అద్వానంగా మారింది. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణాల్లో డొల్లతనం బయటపడటంపై భక్తులు మండిపడుతున్నారు.