లెక్చరర్ పనిష్​మెంట్​తో ఆస్పత్రిపాలైన విద్యార్థిని

లెక్చరర్ పనిష్​మెంట్​తో ఆస్పత్రిపాలైన విద్యార్థిని

కాలేజీకి రాలేదని నాలుగు రోజులు క్లాస్​బయటే నిలబెట్టింది
స్పృహ తప్పి పడిపోయిన విద్యార్థిని
వేములవాడలో ఓ లెక్చరర్​ తీరు 
విధుల నుంచి తొలగించిన కలెక్టర్

వేములవాడ, వెలుగు : అనారోగ్యంతో కాలేజీకి రాని ఓ విద్యార్థినితో లెక్చరర్ అమానుషంగా ప్రవర్తించింది. ఐదు రోజులుగా క్లాస్ బయటే నిలబెట్టడంతో తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట గ్రామానికి చెందిన నిహారిక వేములవాడలోని సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజీలో బీకాం కంప్యూటర్స్ ఫైనల్ ​ఇయర్ ​చదువుతోంది. ఆరోగ్యం బాగా లేకపోవడంతో హెల్త్​ చెకప్ కోసం ఈ నెల18న ఒక్క రోజు సెలవు పెట్టి ఇంటికి వెళ్లింది. మళ్లీ 22న కాలేజీకి వచ్చింది. దీంతో ఇన్ని రోజులు ఎందుకు రాలేదని లెక్చరర్​ మహేశ్వరి..నిహారికను వరుసగా ఐదు రోజుల పాటు క్లాసు బయట ఎండలో నిలబెట్టింది. అప్పటికే అనారోగ్యంతో ఉన్న నిహారిక బాధ తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయింది.దీంతో ఆమెను వేములవాడలో ఏరియా హాస్పిటల్ కు తరలించారు. బాధితురాలు మాట్లాడుతూ లెక్చరర్​ పనిష్​మెంట్​తో తన కాళ్లలో స్పర్ష తెలియడం లేదని రోదించింది. ఈ విషయంపై వైస్ ప్రిన్సిపాల్ శ్యామలను వివరణ కోరగా ఘటన గురించి నిహారిక తమకు చెప్పలేదని, విచారణ జరిపి అధికారులకు నివేదిక పంపామని చెప్పారు.  

కలెక్టర్ సీరియస్
నిహారికను బయట నిలబెట్టిన ఘటనపై కలెక్టర్ అనురాగ్ జయంతి సీరియస్ అయ్యారు. ఆమె హాస్పిటల్​లో అడ్మిట్ ​కావడానికి కారణమైన కామర్స్​ లెక్చరర్​మహేశ్వరిని విధుల నుంచి తొలగించారు. అలాగే కాలేజీ ప్రిన్సిపాల్ మాతంగి కల్యాణిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు. నిహారిక ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు.