
లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం
ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న నదులు
15 మంది గల్లంతు.. 500 మందిని కాపాడిన రెస్క్యూ సిబ్బంది
హిమాచల్ ప్రదేశ్‌లో రాత్రంతా కుండపోత
స్తంభించిన రాకపోకలు.. భారీగా ట్రాఫిక్ జామ్
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో మరోసారి క్లౌడ్ బరస్ట్ సంభవించింది. డెహ్రాడూన్‌లో అర్ధరాత్రి మెరుపు వరదలు బీభత్సం సృష్టించాయి. సిటీలో ఐదుగురు గల్లంతయ్యారు. ఆయా ప్రాంతాల్లోని సుమారు 500 మంది వరదలో చిక్కుకుపోయారు. వీరిని కాపాడేందుకు రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. సహస్త్రధార, మల్దేవ్త, సంత్లా దేవి, దలాన్వాలా ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. సహస్త్రధారాలో సోమవారం రాత్రి 20 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వరదతో పాటు వచ్చిన బురద, రాళ్లు, దుంగలకు చాలా వరకు ఇండ్లు, దుకాణాలు, హోటళ్లు దెబ్బతిన్నాయి. రహదారులపైకి భారీగా వరద చేరడంతో వాహనాలు కొట్టుకుపోయాయి. రోడ్లు కోతకు గురవ్వగా.. ఓ బ్రిడ్జి కొట్టుకుపోయింది. తమ్సా, టన్స్, సాంగ్ నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. రిషికేశ్‌లో చంద్రభాగానది ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నది. నదీ ప్రవాహంలో చిక్కుకున్న ముగ్గురిని ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బంది రక్షించారు.
ప్రమాదకరస్థాయిలో గంగా, యమునా
తపకేశ్వర్ మహాదేవ్ ఆలయం దగ్గర తమ్సా నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో గుడి ప్రాంగణం నీట మునిగింది. భారీ హనుమంతుడి విగ్రహం భుజం వరకు వరద చేరింది. గత 30 ఏండ్లలో ఇంతలా వరద పోటెత్తడం చూడలేదని ఆలయ పూజారి బిపిన్ జోషి చెప్పారు. కాగా, ఉత్తరాఖండ్‌లోని అన్ని జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. గంగా, యమునా నదులు కూడా డేంజర్ లెవల్లోనే ప్రవహిస్తున్నాయి. పౌందా ఏరియాలో ఉన్న దేవ్‌భూమి ఇన్స్టిట్యూట్ క్యాంపస్‌లో చిక్కుకుపోయిన 200 మంది చిన్నారులను ఎస్డీఆర్ఎఫ్ టీం కాపాడింది. నైనిటాల్‌కు వెళ్లే రోడ్లపై కొండ చరియలు విరిగిపడటంతో ఆ రూట్‌ను అధికారులు క్లోజ్ చేశారు. సీఎం పుష్కర్ సింగ్ ధామీ.. అధికార యంత్రాంగం ద్వారా అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
టన్స్ నదిలో కొట్టుకుపోయిన ట్రాక్టర్.. 10 మంది గల్లంతు
డెహ్రాడూన్‌లో టన్స్ నదిని దాటేందుకు ప్రయత్నిస్తుండగా.. వరద ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో ట్రాక్టర్ బోల్తా పడింది. అందులో ఉన్న 10 మంది వరదనీటిలో కొట్టుకుపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. మృతులంతా కార్మికులుగా పోలీసులు గుర్తించారు. మైనింగ్ పనులు పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో వీరి ట్రాక్టర్ నది మధ్యలో ఆగిపోయింది.
ఆపై చూస్తుండగానే.. ట్రాక్టర్ బోల్తా పడి అందరూ కొట్టుకుపోయారు.