- విద్య, వైద్య రంగాల్లో పరస్పర సహకారంపై చర్చ
హైదరాబాద్, వెలుగు: అమెరికాలోని డెలావర్ రాష్ట్ర గవర్నర్ మాట్ మేయర్ శనివారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. తెలంగాణ, డెలావర్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలో పేతం, సంక్షేమ పథకాల అమలు, భవిష్యత్ వ్యూహాలపై చర్చించారు. ప్రధానంగా విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంపై ఇరువురు నేతలు తమ ఆలోచనలను పంచుకున్నారు.
డెలావర్ రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ప్రజల కోసం అమలు చేస్తున్న గృహ నిర్మాణ పథకాలు, రుణమాఫీ వంటి అంశాలను మాట్ మేయర్ వివరించగా.. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలను సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా 'డేటా ప్రివెన్షన్ (సమాచార భద్రత)', 'యూనివర్సల్ హెల్త్ కేర్' వంటి కీలక అంశాలపై చర్చ సాగింది. ప్రజలందరికీ సాంకేతికతతో కూడిన నాణ్యమైన వైద్యం అందించడంలో పరస్పర సహకారంపై మంతనాలు జరిపారు.
ఈ సందర్భంగా ‘తెలంగాణ-2047 విజన్ డాక్యుమెంట్’ను మాట్ మేయర్‌కు సీఎం అందజేశారు. భవిష్యత్తులో తెలంగాణ, డెలావర్ మధ్య సత్సంబంధాలు మరింత బలోపేతం కావాలని మాట్ మేయర్ ఆకాంక్షించారు. అలాగే, తెలంగాణ ప్రతినిధుల బృందంతో కలిసి అమెరికాలో పర్యటించాలని సీఎంను ఆయన ఆహ్వానించారు. సీఎం వెంట మంత్రి శ్రీధర్ బాబు, డెలావర్ ఫస్ట్ లేడీ లారెన్ మేయర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
