డబుల్ బెడ్రూమ్​ ఇండ్లను ఆక్రమిస్తున్న లబ్ధిదారులు

డబుల్ బెడ్రూమ్​ ఇండ్లను ఆక్రమిస్తున్న లబ్ధిదారులు

సిద్దిపేట/దుబ్బాక, వెలుగు: డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలు పూర్తయినా,  లబ్ధిదారుల ఎంపిక జరిగినా ఇండ్లు పంపిణీ చేయడంలో లేటు అవుతోంది. దీంతో  లబ్ధిదారులు కొందరు బలవంతంగా ఇండ్లల్లోకి ప్రవేశిస్తుండగా.. ఇండ్లు రాని వాళ్లు సైతం నివాసాలు ఏర్పరుచుకోవడం స్థానికంగా వివాదాలకు దారితీస్తోంది. కొంతకాలంగా గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. లిస్టులో పేరుండి నిలువ నీడ లేని వారు ఇండ్లలోకి ప్రవేశిస్తున్న ఘటనలు ఉంటున్నాయి. అధికారికంగా కేటాయింపులు చేయకపోవడంతో అలాంటి వారిని ఆఫీసర్లు ఖాళీ చేయిస్తున్నారు. 

ఇండ్లకు లబ్ధిదారులే కాపలా 

గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని మర్కుక్ మండలం పాములపర్తి, ములుగు మండల కేంద్రం, కొండపాక మండలం నాగిరెడ్డిపల్లి, ఖమ్మంపల్లి, దుద్దెడ, దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డి మండలం మల్లుపల్లి, మోతె  తొగుట మండలం గుడికందుల దుబ్బాక మండలం పెద్దచీకోడు, బల్వంతాపూర్, గంభీర్ పూర్ లలో లబ్ధిదారులు బలవంతంగా ఇండ్లలోకి ప్రవేశించారు. ములుగులో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మల్లన్నసాగర్ నిర్వాసితులకు తాత్కాలికంగా కేటాయించారు. ఇటీవల కొందరు వాటిని ఖాళీ చేయడంతో ములుగుకు చెందిన కొందరు వాటిల్లో నివాసాలు ఏర్పరుచుకున్నారు. దుద్దెడలో పూర్తయిన 40 ఇండ్లలో కొద్ది రోజుల క్రితం కొందరు నివాసాలు ఏర్పరుచుకోగా ఆఫీసర్లు వారిని బయటకు పంపించి తాళాలు వేశారు. అయినా మళ్లీ వారు ఇండ్లలోకి ప్రవేశించారు. దీంతో లిస్టులో పేరున్న లబ్ధిదారులు ఇండ్లకు కాపలా ఉంటున్నారు. దుబ్బాక మండలం గంభీర్ పూర్లో 60 ఇల్లు పూర్తి  కాగా అధికారికంగా పంపిణీ చేయకున్నా లబ్ధిదారులే నివాసాలు ఏర్పచుకున్నారు. అసంపూర్తిగా మిగిలిన విద్యుత్ హౌజ్ వైరింగ్ తో పాటు మరుగుదొడ్లు,  కాల్వల పనులను లబ్ధిదారులే పూర్తి చేసుకున్నారు. 

లబ్ధిదారులకు ఇచ్చుడు ఇంకెప్పుడో 

పలు గ్రామాల్లో ఇండ్ల నిర్మాణాలు పూర్తయినా ఎంపిక చేసిన లబ్ధిదారులకు సకాలంలో అందజేయకపోవడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.  గజ్వేల్ నియోజకవర్గంలో  4,248 ఇండ్లకు 2,993 పూర్తి కాగా 1000 ఇండ్లను అందజేశారు. దుబ్బాక నియోజకవర్గంలో మొత్తం 3,509 ఇండ్లకు 2,050 పూర్తి కాగా ఇప్పటివరకు 400 ఇండ్లను పంపిణీ చేశారు. మిగిలిన వాటిని పంపిణీకి సిద్ధం చేశారు. పలు గ్రామాల్లో అర్హుల లిస్టు సిద్ధం చేసినా వివిధ కారణాలతో పంపిణీ లేటు అవుతోంది. దీంతో ఇండ్లు రాని వారితో పాటు కొందరు లబ్ధిదారులు సైతం బలవంతంగా ఇండ్లలో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండటంతో ఆఫీసర్లు తలలు పట్టుకుంటున్నారు. దుబ్బాకలో రాజకీయ కారణాలతో ఇండ్ల పంపిణీకి లేటవుతోందన్న విమర్శలు న్నాయి. 

పేదల్లో వానాకాలం భయం

గుడిసెలు, తాత్కాలిక నివాసాల్లో ఉంటున్న పేదలకు వానా కాలం భయం పట్టుకుంది. డబుల్ బెడ్రూమ్ ఇండ్లిస్తే గుడిసెల్లో నివసించే బాధతోపాటు వానలతో ఇబ్బందులు తప్పుతాయని పేదలైన లబ్ధిదారులు వాపోతున్నారు. డబుల్ బెడ్రూమ్​ఇండ్లను ఆశిస్తున్న వారిలో రేకుల షెడ్లు, పూరి గుడిసెల్లో నివాసముండే వారే  ఎక్కువ. దీంతో తమకు వెంటనే ఇండ్లను కేటాయిస్తే కష్టాల నుంచి గట్టెక్కుతామని భావిస్తున్నారు. కొన్ని చోట్ల వానల భయంతో బలవంతంగా ఇండ్ల తాళాలు పగులకొట్టి  ఆక్రమించుకుంటున్న ఉదంతాలు ఉన్నాయి. పలు గ్రామాల్లో లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నా తమ వారికే ఇండ్లు దక్కాలన్న ఉద్దేశంతో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు అనవసర గొడవలు సృష్టిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
దుబ్బాక మున్సిపాలిటీలో మొత్తం 945 ఇండ్ల నిర్మాణం పూర్తయి దాదాపు రెండేళ్లు కావస్తోంది. దీంతో ఎమ్మెల్యే రఘునందన్​రావు చొరవ తీసుకొని లబ్ధిదారులు ఇండ్లలోకి ప్రవేశించాలని పిలుపునివ్వడంతో  అప్రమత్తమైన అధికార పార్టీ నేతలు కొందరు లబ్ధిదారులకు శుక్రవారం సర్టిఫికేట్లు అందజేసి ఇండ్లలోకి 
పంపించారు. ః

త్వరలో కేటాయిస్తాం..

దుబ్బాక మండలంలో డబుల్ బెడ్రూమ్​లబ్ధిదారులకు త్వరలోనే ఇండ్లను కేటాయిస్తాం. పంచాయతీ రాజ్ శాఖ నుంచి పూర్తి స్థాయిలో ఇండ్లను అప్పగించక పోవడం వల్ల కొంత ఇబ్బంది ఏర్పడుతోంది. దీనివల్ల కొన్ని గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తయినా వారికి అందజేయలేని పరిస్థితి ఉంది. అర్హులైన వారందరికి త్వరలోనే ఇండ్లను కేటాయించేలా చర్యలు చేపడతాం.
- సలీమ్, తహసీల్దారు, దుబ్బాక

దుబ్బాక మండలం బల్వంతపూర్ లో 22 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి లబ్ధిదారుల లిస్టు సిద్దం చేశారు. వలు కారణాలతో లబ్ధిదారులకు కేటాయించే విషయంలో లేటు అయింది. ఇదే సమయంలో కొందరు ఇండ్లు రాని వాళ్లు వాటిని ఆక్రమించుకొని నివాసముంటున్నారు.  దీంతో అధికారులు స్పందించి వారిని ఖాళీ చేయించి ఇండ్లకు తాళాలు వేశారు. మరోవైపు ఎంపికైన లబ్ధిదారులు ఆందోళన చెందుతూ పగటిపూట ఆ ఇండ్ల వద్ద కాపలా ఉంటున్నారు. జిల్లాలోని పలు గ్రామాల్లో ఇలాంటి పరిస్థితులే ఉంటుండటంతో స్థానికంగా వివాదాలు ఏర్పడుతున్నాయి.