రాష్ట్రంలో ఇంకా 60.88 లక్షల ఓటర్లకు ఫారాలు చేరలే

రాష్ట్రంలో ఇంకా 60.88 లక్షల ఓటర్లకు ఫారాలు చేరలే
  •     3.38 కోట్ల మందిలో 2.77 కోట్ల మందికే ఎన్యూమరేషన్ ఫారాలు 
  •     10 రోజులు కావొచ్చినా పంపిణీ పూర్తికాలే 
  •     సమన్వయలోపమే కారణం 

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో ఇంటింటికి సర్ ఫారాల పంపిణీ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. షెడ్యూల్ ప్రకారం పంపిణీ ప్రారంభమై 10 రోజులు కావస్తున్నా.. ఇప్పటికీ లక్షలాది మంది ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు అందలేదు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3.38 కోట్ల మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు కేవలం 2.77 కోట్ల మందికి మాత్రమే ఫారాలు చేరాయి. అంటే ఇంకా సుమారు 60.88 లక్షల మంది ఓటర్లకు ఈ ఫారాలు చేరాల్సి ఉంది. పంపిణీ ప్రక్రియలో చోటుచేసుకుంటున్న జాప్యంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

దీనివల్ల ఓటరు జాబితా సవరణ ప్రక్రియ అనుకున్న సమయానికి పూర్తవుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ జాప్యానికి కారణాలపై ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి నివేదికలను కోరుతున్నారు. ఓటర్లు సైతం తమకు ఎప్పుడు ఫారాలు వస్తాయా? అని ఎదురుచూస్తున్నారు. నిర్ణీత గడువు ముగుస్తున్నా పంపిణీ ప్రక్రియ పూర్తికాకపోవడంతో ఓటర్లలో గందరగోళం నెలకొంది. క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరత, సమన్వయ లోపం కారణంగానే ఈ ప్రక్రియ ఆలస్యమవుతోందని తెలుస్తోంది. నగరాలు, పట్టణాల్లోని అపార్ట్‌మెంట్‌లలోకి బీఎల్‌వోల ప్రవేశం మరింత కష్టతరంగా మారింది. 

కొనసాగుతున్న ఫారాల ఎంట్రీ..  

ఎన్యుమరేషన్ ఫారాలు అందిన ప్రాంతాల్లో ఓటర్లు వాటిని పూర్తి చేసి సిద్ధంగా ఉంచుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న బీఎల్‌వోలు ఆయా నివాసాల నుంచి ఇప్పటికే నింపిన ఫారాలను సేకరిస్తున్నారు. ఫారాల పంపిణీ నెమ్మదించినప్పటికీ, అందిన వాటిని డిజిటలైజ్ చేసే ప్రక్రియ మాత్రం నిరంతరాయంగా కొనసాగుతోంది. ఎంట్రీ ప్రక్రియ వేగంగానే జరుగుతున్నా, క్షేత్రస్థాయిలో ఫారాల సేకరణ మాత్రం ఆశించిన స్థాయిలో సాగడం లేదు. గడువు సమీపిస్తుండటంతో పెండింగ్‌లో ఉన్న 60.88 లక్షల ఓటర్లకు తక్షణమే ఎన్యుమరేషన్ ఫారాలు అందేలా చూడాలని ఉన్నతాధికారులు యంత్రాంగాన్ని ఆదేశిస్తున్నారు. బీఎల్ఓలు వేగంగా ఇళ్లను సందర్శించి పంపిణీ పూర్తి చేయాలని, ఎక్కడా ల్యాప్స్ రాకుండా చూడాలని స్పష్టం చేస్తున్నారు. నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేసి నిర్ణీత గడువులోగా 100 శాతం సర్వే పూర్తి చేయాలని హెచ్చరిస్తున్నారు.