- మిడ్ మానేరు, ఎల్ఎండీలో ఇప్పటికే షురూ..
- మరో రెండు నెలలు గడిస్తే వర్షాలు
- యూనిట్ ఏర్పాటులో జాప్యంపై యాజమాన్యానికి ఇరిగేషన్ శాఖ నోటీసులు
- కడెంలోని 7.6 టీఎంసీల్లో 4 టీఎంసీలు పూడికే..
నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలోని ప్రతిష్టాత్మక కడెం ప్రాజెక్టుకు ముప్పుగా మారుతున్న సిల్ట్ ను తొలగించే పనులు ఏడాదవుతున్నా మొదలు కాలేదు. సిల్ట్ ప్రాసెసింగ్ యూనిట్ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఏడాది క్రితమే ఈథర్ అనే కంపెనీ సిల్ట్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కోసం టెండర్ ని దక్కించుకొని అగ్రిమెంట్ చేసుకుంది. అయితే టెండర్ నిబంధన ప్రకారం యూనిట్ ఏర్పాటుకు సంబంధిత అధికారులు స్థలాన్ని కేటాయించాల్సి ఉండగా ఇప్పటివరకు కేటాయించకపోవడంతో ప్రాసెసింగ్ యూనిట్ పనులను మొదలు పెట్టలేదని కంపెనీ చెబుతోంది. ఇదిలా ఉంటే.. టెండర్ నిబంధన ప్రకారం ఇప్పటికే యూనిట్ పనులను మొదలు పెట్టాలని, పనులు ప్రారంభించకపోవడంతో సంబంధిత కంపెనీకి ఇరిగేషన్ అధికారులు ఇప్పటికే రెండు సార్లు నోటీసులు జారీ చేశారు.
మిడ్ మానేరు, ఎల్ఎండీలో పనులు షురూ..
కడెం ప్రాజెక్టుతో పాటు కరీంనగర్ జిల్లాలోని మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యాముల్లో పూడిక తొలగించేందుకు ప్రభుత్వం గతేడాదే నిర్ణయించింది. పూడిక తొలగింపు కోసం నిర్వహించిన టెండర్ ప్రక్రియ కూడా పూర్తయ్యింది. పూడిక తొలగింపు, ఆ పూడికను ప్రాసెసింగ్ చేసే పనులను రాజస్థాన్ కు చెందిన ఈథర్ అనే కంపెనీ దక్కించుకుంది. 20 సంవత్సరాల వరకు కడెం ప్రాజెక్టులోని పూడికను ఎప్పటికప్పుడు తీసి, ప్రాసెసింగ్ చేయాల్సి ఉంటుంది. మిడ్ మానేరు, ఎల్ఎండీ ప్రాజెక్టుల్లో పూడికతీతకు సంబంధించి యూనిట్ ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి. కానీ కడెంలో మాత్రం ఎలాంటి పనులు మొదలుకాలేదు.
పూర్తికాని స్థల కేటాయింపు ప్రక్రియ
ప్రాజెక్టు సమీప ప్రాంతంలో సిల్ట్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వ స్థలం కోసం అన్వేషణ మొదలుపెట్టారు. యూనిట్ ఏర్పాటుకు దాదాపు 100 ఎకరాల స్థలం అవసరం కానుండగా.. ఇందులో 20 ఎకరాల్లో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మరో 80 ఎకరాల్లో సిల్ట్ నుంచి ప్రాసెసింగ్ చేసిన ఇసుక, మట్టి నిల్వలను వేర్వేరుగా స్టాక్ పాయింట్ పేరిట ఉంచనున్నారు. కడెం మండలంలోని ఎర్వచింతల, రేవోజిపేట, సోమవార్ పేట గ్రామాల్లో భూములను రెవెన్యూ అధికారులు గుర్తించారు. కానీ ఆ భూములను సంబంధిత కంపెనీకి కేటాయించకపోవడంతో యూనిట్ఏర్పాటులో ఆలస్యం జరుగుతోందని ఈథర్ యాజమాన్యం చెబుతోంది.
ప్రాజెక్టులో భారీగా పూడిక
కడెం ప్రాజెక్టులో మూడు నుంచి నాలుగు టీఎంసీల లోతు వరకు పూడిక పేరుకుపోయినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 7.630 టీఎంసీలుగా అధికారులు నిర్ధారించినప్పటికీ.. ఏటేటా పెరిగిపోతున్న పూడిక కారణంగా నీటిమట్టం దాదాపు సగానికి పైగా తగ్గిపోయినట్లు తేలింది. ప్రాజెక్టులో నాలుగు టీఎంసీల వరకు పూడిక చేరుకోగా మూడున్నర టీఎంసీల వరకు మాత్రమే నీటి నిల్వ సామర్థ్యం ఉంది. ప్రాజెక్ట్ రిజర్వాయర్ ఎగువన 15 నుంచి 18 కిలోమీటర్ల పొడవు వరకు పూడిక ఉన్నట్లు సర్వే లెక్కలు చెబుతున్నాయి.
ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో ప్రాజెక్టులో నీటిమట్టం తక్కువైంది. పూడికతీతకు ఈ సమయం ఎంతో అనుకూలం. మరో రెండు నెలలు గడిస్తే పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పూడికతీత పనులు మరో ఐదారు నెలల వరకు చేపట్టడం సాధ్యం కాదు. ప్రాజెక్టు కింద 68,000 ఎకరాలకు సాగు నీరు అందాల్సి ఉంది. కానీ పూడిక కారణంగా చివరి ఆయకట్టు భూములకు నీరందడం లేదు. ఇప్పటికీ పూడిక పనులు మొదలు కాకపోవడంతో రాబోయే ఖరీఫ్ లో కూడా చివరి ఆయకట్టు వరకు నీరు అందడం కష్టమే. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

