నోటిఫికేషన్లు ఇచ్చి.. నెలలు గడుస్తున్నా పూర్తికాని రిక్రూట్‌‌మెంట్ ప్రాసెస్

నోటిఫికేషన్లు ఇచ్చి.. నెలలు గడుస్తున్నా పూర్తికాని రిక్రూట్‌‌మెంట్ ప్రాసెస్
  • నోటిఫికేషన్లు ఇచ్చి.. నెలలు గడుస్తున్నా పూర్తికాని రిక్రూట్‌‌మెంట్ ప్రాసెస్
  • నెల కింద అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్​
  • ఇప్పటికీ విడుదల కాని సెలక్షన్ లిస్ట్
  • గతేడాది చివరలో స్టాఫ్ నర్స్‌‌ పోస్టులకు నోటిఫికేషన్‌‌
  • నేటికీ దరఖాస్తుల వద్దే ఆగిన ప్రక్రియ
  • బోర్డులో సరిపడా సిబ్బంది లేరంటున్న ఆఫీసర్లు

హైదరాబాద్‌‌, వెలుగు: ప్రభుత్వ దవాఖాన్లు, మెడికల్ కాలేజీల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముందుకు కదలడం లేదు. అసిస్టెంట్ ప్రొఫెసర్, స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చి నెలలు గడుస్తున్నా, ఇప్పటికీ రిక్రూట్‌‌మెంట్ ప్రాసెస్ పూర్తి కాలేదు. స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ అప్లికేషన్ల వద్దే ఆగిపోగా.. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల ప్రాసెస్​ ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ వరకు వచ్చి నిలిచిపోయింది. హెల్త్ డిపార్ట్‌‌మెంట్‌‌లో పోస్టుల భర్తీ బాధత్యను టీఎస్‌‌పీఎస్సీకి అప్పగిస్తే ఆలస్యం అవుతోందని, సొంతంగా ఒక బోర్డును ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. అందులో సరిపడా సిబ్బందిని మాత్రం నియమించలేదు. దీంతో రిక్రూట్‌‌మెంట్ ఆలస్యం అవుతోందని ఆఫీసర్లు చెబుతున్నారు. 

అప్లికేషన్లతోనే సరి

ప్రభుత్వ హాస్పిటళ్లు, విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న 5,204 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబర్‌‌‌‌ చివర్లో నోటిఫికేషన్‌‌ ఇచ్చారు. సుమారు 45 వేల మంది ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. గత నెల 9 నాటికి అప్లికేషన్లలో తప్పుల ఎడిటింగ్‌‌ కూడా పూర్తయింది. ఏప్రిల్‌‌ లేదా మే ఫస్ట్ వీక్‌‌లో ఎగ్జామ్ ఉంటుందని బోర్డు అధికారులు పరోక్షంగా లీకులు ఇచ్చారు. కానీ, ఇప్పటివరకు ఎగ్జామ్ నిర్వహణపై ఎలాంటి నోటిఫికేషన్ రాకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా ఏండ్లకు ఏండ్లు రిక్రూట్‌‌మెంట్‌‌ను సాగదీస్తారేమోనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 2017లోనూ నర్సింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌‌ ఇచ్చిన ప్రభుత్వం.. 2021 చివరి వరకూ సాగదీసింది. కాంట్రాక్ట్ బేసిస్‌‌లో పనిచేసిన స్టాఫ్‌‌ నర్సులకు ఇచ్చిన వెయిటేజీ విషయంలో కోర్టు కేసులు పడడం, వాటికి కౌంటర్లు వేయడంలో సర్కార్ స్పందించపోవడం ఆలస్యానికి కారణమైంది. ఈసారి కాంట్రాక్ట్ వాళ్లతో పాటు, అవుట్‌‌సోర్సింగ్ నర్సులకూ వెయిటేజీ ఇచ్చారు. దీంతో ఈసారి ఎలాంటి పొరపాట్లు జరుగుతాయోనని, కోర్టు కేసుల విషయంలో ప్రభుత్వం ఏం చేస్తుందోనని నర్సులు ఆవేదన చెందుతున్నారు. ఎన్నికలు సమీపిస్తుండడం కూడా నర్సుల ఆందోళనకు కారణమవుతోంది.

స్టాఫ్‌‌ లేక ఆలస్యం

ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబర్‌‌‌‌ 6న నోటిఫికేషన్ ఇచ్చారు. ఒకట్రెండు నెలల్లోనే ఈ ప్రాసెస్‌‌ను పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఐదు నెలలు కావొస్తున్నా ఇప్పటికీ భర్తీ ప్రక్రియ పూర్తి కాలేదు. ఈ పోస్టుల భర్తీకి రాత పరీక్ష కూడా లేదు. మెడికల్ పీజీలో వచ్చిన మార్కులు, కాంట్రాక్ట్ వెయిటేజీ ఆధారంగానే భర్తీ చేస్తున్నారు. 1,442 పోస్టులకు సుమారు 6 వేల మంది దరఖాస్తు చేయగా, గత నెల 28న ప్రొవిజనల్ మెరిట్‌‌ లిస్ట్‌‌ను విడుదల చేశారు. అభ్యంతరాల స్వీకరణకు వారం రోజుల గడువు ఇచ్చారు. సుమారు 700 ఆబ్జెక్షన్స్ వచ్చాయి. ప్రస్తుతం వీటి పరిశీలన కొనసాగుతోంది. అయితే, సరిపడా స్టాఫ్ లేకపోవడం వల్ల ఈ ప్రాసెస్​పూర్తవడానికి కనీసం ఇంకో 15 రోజులు పడుతుందని బోర్డు అధికారులు చెబుతున్నారు.