కుటుంబం ఈడ .. కొలువు ఆడ

కుటుంబం ఈడ .. కొలువు ఆడ

అసెంబ్లీ ఎన్నికల ముందు తహసీల్దార్ల బదిలీలు జరిగినయ్‌‌‌‌. ఎన్నికల విధుల కోసం ఓ మూలకున్న వాళ్లను ఇంకో మూలకేశారు. కుటుంబం ఓ చోట, ఉద్యోగం ఇంకో చోట అయిపోయింది. ఎన్నికలయ్యే వరకే కదా అనుకున్నరు. కానీ కోడ్‌‌‌‌ ముగిసి నెల కావొస్తున్నా బదిలీలు జరగలేదు. అధికారులు ఆలస్యం చేస్తున్నరు. దీంతో వెనక్కి పంపాలంటూ నెల రోజులుగా తహసీల్దార్లు వినతి పత్రాలిస్తునే ఉన్నారు.

ఫైల్‌‌‌‌ సిద్ధమైనా..

బదిలీల్లో భాగంగా సిద్దిపేట జిల్లా వారిని గద్వాల, నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌, వనపర్తి జిల్లాలకు, కరీంనగర్‌‌‌‌ జిల్లా వారిని నిర్మల్‌‌‌‌, ఖమ్మం జిల్లాలకు బదిలీ చేశారు. అసెంబ్లీ నుంచి లోక్‌‌‌‌సభ ఎన్నికల వరకు అసిస్టెంట్‌‌‌‌ ఎలక్షన్‌‌‌‌ రిటర్నింగ్‌‌‌‌ ఆఫీసర్లుగా వీళ్లు విధులు నిర్వహించారు. అప్పట్లో అకడమిక్‌‌‌‌ ఇయర్‌‌‌‌ మధ్యలో ట్రాన్స్‌‌‌‌ఫర్లు జరగడంతో పిల్లల చదువుల దృష్ట్యా కుటుంబాలను పని చేసే చోటుకి తీసుకెళ్లలేదు. ఇప్పుడు మళ్లీ కొత్త అకడమిక్‌‌‌‌ ఇయర్‌‌‌‌ ప్రారంభమవుతుండటంతో పాత జిల్లాలకు ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌ చేయాలని ట్రెసా, టీజీటీఏ ప్రతినిధులు సీసీఎల్‌‌‌‌ఏ చీఫ్‌‌‌‌ కమిషనర్‌‌‌‌ను కలిసి విన్నించారు. కానీ ఫలితం లేదు. ఉన్నతాధికారులూ పట్టించుకోవడం లేదు. చాలా జిల్లాల్లో జేసీ స్థాయిలో ట్రాన్సఫర్ల ఫైల్‌‌‌‌ సిద్ధం చేసినా సీసీఎల్‌‌‌‌ఏ అప్రూవల్‌‌‌‌ లేక బదిలీలు నిలిచాయి.

సీసీఎల్‌‌‌‌ఏ కోరిన వివరాలివే…

తాజాగా తహసీల్దార్ల వివరాలను ప్రత్యేక ప్రొఫార్మాలో పంపాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు సీసీఎల్‌‌‌‌ఏ చీఫ్‌‌‌‌ కమిషనర్‌‌‌‌ ఉత్తర్వులిచ్చారు. సీసీఎల్‌‌‌‌ఏ 13 కాలమ్స్‌‌‌‌తో రూపొందించిన ప్రొఫార్మాలో తహసీల్దార్ల వివరాలను కోరింది. ఇందులో సీరియల్‌‌‌‌ నంబర్‌‌‌‌, జిల్లా పేరు, తహసీల్దార్‌‌‌‌ పేరు, పుట్టిన తేదీ, సొంత జిల్లా, డేట్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ అపాయింట్‌‌‌‌మెంట్‌‌‌‌, ఉద్యోగంలో చేరినప్పటి హోదా, ఉద్యోగంలో చేరిన జిల్లా, పని చేసిన ఏడాది, ఉద్యోగ విరమణ తేదీ, పెండింగ్‌‌‌‌ కేసులు, రిమార్క్స్‌‌‌‌ను పొందుపరిచారు. గురువారం వరకు ఈ వివరాలను కలెక్టర్లకు పంపాల్సి ఉంటుంది. బదిలీల కోసం వీఆర్వోలూ ఎదురు చూస్తున్నారు. ఇటీవల రంగారెడ్డి జిల్లాలోనే వీఆర్వోల బదిలీలు జరిగాయని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ బదిలీలు చేపట్టాలని, పూర్వ జిల్లాలకు పంపాలని కోరుతున్నారు.