మెదక్, నల్గొండలో ఆలస్యం అవుతున్న ధాన్యం కొనుగోళ్లు

మెదక్, నల్గొండలో ఆలస్యం అవుతున్న ధాన్యం కొనుగోళ్లు

రైతులకు పంట పండిచడం ఒక ఎత్తు అయితే.. దాన్ని అమ్ముకోవడం ఇంకో ఎత్తు అవుతోంది. ఆరుగాలం కష్టపడి వరి సాగు చేసిన రైతు.. ధాన్యం అమ్ముడుపోక కన్నీరు పెడుతున్నాడు. ధాన్యం అమ్మకం కోసం ఐకేపీ కేంద్రాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నాడు. అధికారులు మాత్రం తమకు ఏం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. 

వడ్ల కొనుగోళ్లు ఆలస్యం

మెదక్ జిల్లాలో వడ్ల కొనుగోళ్లు మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తమ ఒడ్లు కొనడం లేదంటూ కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం గుట్టలుగా పోసి ఉంది. మెదక్ జిల్లా వ్యాప్తంగా 6 లక్షల మెట్రిక్ టన్నుల వరి సాగు అవ్వగా.. సుమారు 5 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరింది. అయితే.. ఇప్పటివరకు వరి కొనుగోలు పై అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. 

ధాన్యంతో నిండిపోయిన ఐకేపీ సెంటర్లు

మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ధాన్యం సెంటర్లలో వడ్ల కొనుగోళ్లు నెమ్మదిగా సాగుతున్నాయి. దీని వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కువ రోజులు ధాన్యాన్ని సురక్షితంగా రక్షించలేక.. తక్కువ ధర వచ్చినా దళారులకు అమ్ముకుంటున్నారు. ఇదే అదునుగా భావించిన దళారులు రైతుల వద్ద దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. సుమారు 10 నుంచి 15 రోజులుగా వరి ధాన్యం ఐకేపీ సెంటర్లలోనే ఉంది. చివరికి ఐకేపీ సెంటర్లు సరిపోకపోవడంతో... కొందరు రైతులు తమ ధాన్యాన్ని రోడ్లపైనే పోస్తున్నారు. రోడ్లపై ఉన్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. టర్బలిన్ కవర్లు కొనుగోలు కోసం ఐకేపీ కేంద్రాలకు వెళితే.. ఒక్కో టర్బలిన్ కవర్‭కి వెయ్యి రూపాయల చొప్పున అధికారులు డబ్బులు వసూలు చేస్తున్నారు. 

ధాన్యం కొనుగోలు సంగతి అటుంచితే.. ధాన్యం కొనుగోలు అయినా తీసుకువెళ్లేందుకు లారీలు లేవు. మరోవైపు గన్నీ బ్యాగులు కూడా అందుబాటులో లేకుండా పోయాయి. అప్పు చేసి పంట పండించిన రైతు.. ధాన్యాన్ని అమ్ముకునేందుకు తిప్పలు పడుతున్నాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించిన ధాన్యం కొనుగోళ్లు వెంటనే చేయాలని రైతులు కోరుతున్నారు.