
- అమెరికా పరిశోధనా సంస్థ రిపోర్ట్
న్యూఢిల్లీ: వాయు కాలుష్యం ఢిల్లీవాసుల జీవితకాలంలో పదేళ్లు తగ్గిస్తోందని అమెరికా పరిశోధన సంస్థ ఒకటి వెల్లడించింది. కలుషిత గాలిని పీల్చి దేశంలో ఏటా లక్షలకొద్దీ జనం చనిపోతున్నారని తేల్చింది. ఈమేరకు మంగళవారం విడుదల చేసిన రిపోర్టులో ఈ వివరాలు పేర్కొంది. యూనివర్సిటీ ఆఫ్ షికాగో(ఈపీఐసీ)లోని ఎనర్జీ పాలసీ ఇనిస్టిట్యూట్రూపొందించిన ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ ప్రకారం.. ఉత్తర భారతదేశంలో 40% మందికి 7.6 ఏళ్ల జీవిత కాలం తగ్గినట్లు తేలింది. ప్రస్తుత గాలి నాణ్యత ప్రకారం ఇప్పటికే దేశంలో ప్రజల సగటు ఆయుర్దాయం ఐదేళ్లు తగ్గిపోయిందని వివరించింది.
వాయు కాలుష్యాన్ని తగ్గిస్తే..
దేశంలోని 1.3 బిలియన్ల ప్రజలు వార్షిక సగటు కాలుష్య స్థాయి.. డబ్ల్యూహెచ్వో సూచించిన పరిమితికంటే ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉంటున్నారని తెలిపింది. వాయు కాలుష్యాన్ని తగ్గిస్తే ప్రజల ఆయుర్దాయాన్ని పదేండ్ల వరకు పెంచుకోవచ్చని ఈపీఐసీ డేటా చెబుతోంది. 2013 నుంచి ప్రపంచవ్యాప్తంగా పెరిగిన వాయు కాలుష్యంలో 44% మన దేశం నుంచే ఉన్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలోనే మన దేశం రెండవ అత్యంత కలుషితమైన దేశంగా బీబీసీ పేర్కొంది. దాదాపు 63% కంటే ఎక్కువ మంది భారతీయులు గాలి నాణ్యత ప్రమాణాన్ని మించిన ప్రాంతాల్లో నివసిస్తున్నారని పేర్కొంది. దేశంలో 2 దశాబ్దాలుగా వాయు కాలుష్యం పెరగడానికి ప్రధాన కారణం పారిశ్రామికీకరణ, ఆర్థికాభివృద్ధి, శిలాజ ఇంధనాల వాడకం విపరీతంగా పెరగడం, వాహనాల సంఖ్య 4 రెట్లు పెరగడమేనని నిపుణులు చెబుతున్నారు.