సెకండ్ ప్లేస్ కు ఢిల్లీ.. ఓడినా ప్లే ఆఫ్స్ కు ఆర్సీబీ

సెకండ్ ప్లేస్ కు ఢిల్లీ.. ఓడినా ప్లే ఆఫ్స్ కు ఆర్సీబీ

సెకండ్‌‌ ప్లేస్‌‌ కోసం జరిగిన కీలక పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌‌ పైచేయి సాధించింది..! టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో రహానె (46 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 60), ధవన్‌‌ (41 బాల్స్‌‌లో 6 ఫోర్లతో 54) దంచికొట్టడంతో.. బలమైన బెంగళూరుకు చెక్‌‌ పెట్టింది..! దీంతో టేబుల్​లో రెండో ప్లేస్​తో ప్లే ఆఫ్‌‌ బెర్త్‌‌ను దక్కించుకున్న ఢిల్లీ.. క్వాలిఫయర్‌‌–1లో ముంబైతో అమీతుమీ తేల్చుకోనుంది..! మరోవైపు ఇదే ఈక్వేషన్‌‌తో ఉన్న ఆర్‌‌సీబీ ఓడిన కూడా.. నెట్‌‌ రన్‌‌రేట్‌‌ను కాపాడుకోవడంతో ప్లే ఆఫ్స్‌‌లో చోటు సంపాదించింది..! ప్రస్తుతానికి థర్డ్‌‌ ప్లేస్‌‌లో ఉన్నా.. హైదరాబాద్‌‌, ముంబై మ్యాచ్‌‌ రిజల్ట్‌‌ తర్వాత ఇది మారొచ్చు..!!

అబుదాబిఆల్‌‌రౌండ్‌‌ షోతో అదరగొట్టిన ఢిల్లీ.. ఐపీఎల్‌‌లో ప్లే ఆఫ్స్​ బెర్త్‌‌ను సొంతం చేసుకుంది. 16 పాయింట్లతో సెకండ్‌‌ ప్లేస్‌‌తో క్వాలిఫయిర్​–1కు అర్హత సాధించింది. సోమవారం జరిగిన కీలక లీగ్‌‌ మ్యాచ్‌‌లో 6 వికెట్ల తేడాతో బెంగళూరుపై గెలిచింది. టాస్‌‌ గెలిచి ఢిల్లీ ఫీల్డింగ్‌‌ ఎంచుకోగా, బ్యాటింగ్‌‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు152  రన్స్‌‌ చేసింది. దేవదత్‌‌ పడిక్కల్‌‌ (41 బాల్స్‌‌లో 5 ఫోర్లతో 50), డివిలియర్స్‌‌ (21 బాల్స్‌‌లో 1 ఫోర్‌‌, 2 సిక్సర్లతో 35) రాణించారు. తర్వాత ఢిల్లీ 19 ఓవర్లలో 4 వికెట్లకు 154 రన్స్‌‌ సాధించింది. రహానె, ధవన్‌‌ రెండో వికెట్‌‌కు 88 రన్స్‌‌ జోడించి విజయాన్ని సులువు చేశారు. ఢిల్లీ పేసర్​ అన్రిచ్​ (3/33)కు ‘మ్యాన్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది.

పడిక్కల్‌‌ దూకుడు..

తొలుత టాస్​ ఓడిన ఆర్​సీబీ బ్యాటింగ్​కు దిగగా ఓపెనర్లు ఫిలిప్​ (12), పడిక్కల్‌‌ మెల్లగా ఇన్నింగ్స్‌‌ మొదలుపెట్టారు. ఫస్ట్‌‌ ఓవర్ వేసిన పేసర్‌‌ సామ్స్‌‌ 4 రన్సే ఇవ్వగా, సెకండ్‌‌ ఓవర్‌‌లో అశ్విన్‌‌ (1/18) 6 రన్స్‌‌ ఇచ్చుకున్నాడు. నాలుగో ఓవర్‌‌లో బౌలింగ్‌‌కు వచ్చిన రబాడ (2/30)… ఢిల్లీకి ఫస్ట్‌‌ బ్రేక్‌‌ అందించాడు. రబాడ బాల్‌‌ను ఫుల్‌‌షాట్‌‌ ఆడటంలో టైమింగ్‌‌ మిస్‌‌ అయిన ఫిలిప్​.. కవర్స్‌‌లో పృథ్వీకి క్యాచ్‌‌ ఇచ్చాడు. దీంతో తొలి వికెట్‌‌కు 25 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. పడిక్కల్‌‌తో జత కలిసిన కోహ్లీ (24 బాల్స్‌‌లో 2 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 29) కూడా తొలుత భారీ షాట్స్‌‌కు వెళ్లలేదు. ఆరో ఓవర్‌‌లో ఫోర్‌‌తో టచ్‌‌లోకి వచ్చాడు. పవర్‌‌ప్లే ముగిసేసరికి బెంగళూరు 40/1 రన్స్‌‌ చేసింది. ఏడో ఓవర్‌‌లో మళ్లీ అశ్విన్‌‌ బౌలింగ్‌‌కు రావడంతో పడిక్కల్‌‌ బౌండ్రీతో స్వాగతం పలికాడు. కానీ తర్వాతి రెండు ఓవర్లలో 10 రన్సే వచ్చాయి. అయితే 10వ ఓవర్‌‌లో కోహ్లీ ఇచ్చిన క్యాచ్‌‌ను లాంగాన్‌‌లో అన్రిచ్‌‌ డ్రాప్‌‌ చేయడంతో ఊపిరి పీల్చుకున్నాడు. ఓవరాల్‌‌గా ఫస్ట్‌‌ టెన్‌‌లో 6 రన్‌‌రేట్‌‌తో 60 రన్స్‌‌ వచ్చాయి. ఇక రన్‌‌రేట్‌‌ పెంచాలనే ఉద్దేశంతో కోహ్లీ కాస్త బ్యాట్‌‌ ఝుళిపించాడు. 11వ ఓవర్‌‌లో ఫోర్‌‌, తర్వాతి ఓవర్‌‌లో భారీ సిక్సర్‌‌తో రెచ్చిపోయిన కెప్టెన్‌‌ను 13వ ఓవర్‌‌లో అశ్విన్‌‌ బోల్తా కొట్టించాడు. మిడిల్‌‌ స్టంప్‌‌ టార్గెట్‌‌తో వేసిన స్లో బాల్‌‌ను కోహ్లీ షాట్‌‌ కొట్టి డీప్‌‌ మిడ్‌‌వికెట్‌‌లో స్టోయినిస్‌‌ చేతికి చిక్కాడు. దీంతో రెండో వికెట్‌‌కు 57 రన్స్‌‌ భాగస్వామ్యం ముగిసింది.  భారీ అంచనాలతో వచ్చిన డివిలియర్స్‌‌  స్టార్టింగ్‌‌లో సింగిల్స్‌‌కు మొగ్గడంతో 15 ఓవర్లు ముగిసేసరికి ఆర్‌‌సీబీ స్కోరు 103/2కు చేరింది. కానీ 16వ ఓవర్‌‌లో అన్రిచ్‌‌ (3/33) డబుల్‌‌ షాకిచ్చాడు. 40 బాల్స్‌‌లో ఫిఫ్టీ కంప్లీట్‌‌ చేసిన పడిక్కల్‌‌, మోరిస్‌‌ (0)ను మూడు బంతుల వ్యవధిలో పెవిలియన్‌‌కు చేర్చాడు. స్లాగ్‌‌ ఓవర్స్‌‌ మొదలుకావడంతో శివమ్‌‌ దూబే (17) భారీ షాట్లకు యత్నించాడు. 18వ ఓవర్‌‌లో ఏబీ ఫోర్‌‌ కొడితే.. దూబే ఫోర్‌‌, సిక్స్‌‌ బాదడంతో 17 రన్స్‌‌ వచ్చాయి. తర్వాతి ఓవర్‌‌ ఫస్ట్‌‌ బాల్‌‌ను డివిలియర్స్‌‌ స్టాండ్స్‌‌లోకి పంపగా, లాస్ట్‌‌ బాల్‌‌కు దూబే ఔటయ్యాడు. లాస్ట్‌‌ ఓవర్‌‌లో ఏబీ రనౌట్‌‌తో పాటు ఉడాన (4) కూడా వెనుదిరగడంతో ఆర్‌‌సీబీ మోస్తరు టార్గెట్‌‌నే నిర్దేశించింది.

ధవన్‌‌–రహానె అదుర్స్‌‌..

సాధారణ టార్గెట్​ ఛేజింగ్​ను ఢిల్లీ దూకుడుగానే మొదలుపెట్టింది. రెండో ఓవర్‌‌లో రెండు ఫోర్లు బాదిన పృథ్వీ షా (9) అనూహ్యంగా ఔటైనా.. ధవన్‌‌, రహానె పోటీపడి ఆడారు. ప్రతి ఓవర్‌‌లో సింగిల్స్‌‌తో పాటు బౌండ్రీలు కూడా బాదారు. దీంతో మెరుగైన రన్‌‌రేట్‌‌ సాధించడంతో పవర్ ప్లేలో ఢిల్లీ 53/1 స్కోరు చేసింది. ఫీల్డింగ్‌‌ సడలించిన తర్వాత కూడా ఆర్‌‌సీబీ బౌలర్లలో పదును పెరగలేదు. దీనిని ఆసరగా చేసుకున్న రహానె.. ఏడో ఓవర్‌‌లో ఫోర్‌‌తో 9 రన్స్‌‌ రాబట్టాడు. తర్వాతి ఓవర్‌‌లో సుందర్‌‌ 4 రన్సే ఇచ్చినా.. 9వ ఓవర్‌‌లో ధవన్‌‌ బౌండ్రీతో 7 రన్స్‌‌ సాధించాడు. ఓవరాల్‌‌గా ఫస్ట్‌‌ టెన్‌‌లో ఢిల్లీ స్కోరు 8 రన్‌‌రేట్‌‌తో 81/1. వీలైనంత త్వరగా మ్యాచ్‌‌ ముగించాలన్న ఉద్దేశంతో ధవన్​, రహానే బ్యాట్‌‌ ఝుళిపించే ప్రయత్నం చేశారు. 12వ ఓవర్‌‌లో చెరో ఫోర్‌‌ కొట్టడంతో 13 రన్స్‌‌ వచ్చాయి. తర్వాత షాజాబ్‌‌ ఓవర్‌‌లో లాంగాఫ్‌‌లో సూపర్‌‌ సిక్స్‌‌తో రహానె రెచ్చిపోయాడు. 37 బాల్స్‌‌లో ఫిఫ్టీ మార్క్‌‌ను అందుకున్న ధవన్‌‌.. మరో షాట్​ ఆడే క్రమంలో షార్ట్‌‌ ఫైన్‌‌లో దూబే చేతికి చిక్కాడు. దీంతో రెండో వికెట్‌‌కు 88 రన్స్‌‌ బిగ్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ బ్రేక్‌‌ అయ్యింది. అయితే ఢిల్లీ 17.3 ఓవర్ల కంటే ఎక్కువ ఆడేలా చేస్తే రన్‌‌రేట్‌‌ను సేవ్‌‌ చేసుకోవచ్చనే ఉద్దేశంతో కోహ్లీ.. ముగ్గురు స్పిన్నర్లతో బౌలింగ్‌‌ చేయించాడు. ఈ వ్యూహం బాగా ఫలించింది. 17వ ఓవర్‌‌లో అయ్యర్‌‌ (7)ను షాబాజ్‌‌ బోల్తా కొట్టించాడు. 37 బాల్స్‌‌లో ఫిఫ్టీ మార్క్‌‌ను అందుకున్న రహానెను తర్వాతి ఓవర్‌‌లో సుందర్‌‌ పెవిలియన్‌‌కు చేర్చాడు. ఇక విజయానికి 12 బాల్స్‌‌లో 15 రన్స్‌‌ కావాల్సిన దశలో రిషబ్‌‌ (8 నాటౌట్‌‌), స్టోయినిస్‌‌ (10 నాటౌట్‌‌) సిక్స్‌‌, ఫోర్‌‌తో లాంఛనం ముగించారు.