కోర్టు ముందు నిజాలు ఒప్పుకుని, ప్రజలకు క్షమాపణ చెప్పాలి

కోర్టు ముందు నిజాలు ఒప్పుకుని, ప్రజలకు క్షమాపణ చెప్పాలి
  • ఢిల్లీ లిక్కర్ స్కాం వెనుక.. కేసీఆర్ ఫ్యామిలీ హస్తం
  • బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ సంచలన ఆరోపణలు 
  • ఢిల్లీ ఒబెరాయ్ హోటల్ లో పాలసీ రూపొందించారు 
  • కేసీఆర్ కుటుంబ సభ్యులతో సిసోడియా భేటీ  
  • ఫస్ట్ విడతలో ఆయనకు రూ. 150 కోట్లు ముట్టినయ్ 
  • తెలంగాణ, పంజాబ్, బెంగాల్​లోనూ ఇదే పాలసీ ఉందని ఆరోపణలు

న్యూఢిల్లీ, వెలుగు:    ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కాం వెనక తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల హస్తం ఉందని వెస్ట్ ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ ఆరోపించారు. ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్‌‌లో ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ శాఖ మంత్రి మనీశ్ సిసోడియాతో కేసీఆర్ కుటుంబసభ్యులు భేటీ అయ్యారని, అక్కడే వారికి డీల్ కుదిరిందన్నారు. ఆదివారం ఢిల్లీలోని బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సాతో కలిసి పర్వేశ్ వర్మ మీడియాతో మాట్లాడారు.

ఢిల్లీ ఒబెరాయ్ హోటల్లో ఆరు నెలల పాటు సూట్ రూం బుక్ అయి ఉందని ఆయన తెలిపారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు, సిసోడియా, ఎక్సైజ్ కమిషనర్, లిక్కర్ మాఫియాకు చెందిన వ్యక్తులు, ఎక్సైజ్ అధికారులు హోటల్ రూంలో భేటీ అయి డీల్ గురించి చర్చలు జరిపారని ఆరోపించారు. ‘‘తెలంగాణలో లిక్కర్ మాఫియాకు చెందిన ఓ వ్యక్తి ఏర్పాటు చేసిన ప్రైవేటు విమానంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు ఢిల్లీ వచ్చేవారు. ఒబెరాయ్ హోటల్లో సూట్ రూం బుక్ చేసింది కూడా ఈ లిక్కర్ మాఫియా వ్యక్తే. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతో కలిసి ఆయనే ఈ పాలసీని రూపొందించారు. పంజాబ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్లో ఇదే లిక్కర్ పాలసీ అమలవుతోంది” అని వర్మ చెప్పారు. 

రూ. 150 కోట్లు ముట్టజెప్పిన్రు.. 

కేసీఆర్ కుటుంబ సభ్యులు, ఢిల్లీ ఎల్1 లైసెన్స్ హోల్డర్లు, తమ వ్యక్తులను ఢిల్లీలో ఏర్పాటు చేసుకున్నారని పర్వేశ్ వర్మ ఆరోపించారు. డీల్‌‌‌‌లో ఫస్ట్ ఇన్ స్టాల్మెంట్ కింద సిసోడియాకు రూ. 150 కోట్లు ఇచ్చారని, తెలంగాణ నుంచి వచ్చిన వారే ఈ సొమ్మును ముట్టజెప్పారని తెలిపారు. ‘‘ఎల్1 కమీషన్ ముందుగా మేము తీసుకుంటాం. లాభాలూ తీసుకుంటాం. ఆ తర్వాతే మీరు తీసుకోవాలి’’ అని సిసోడియా డీల్ కుదుర్చుకున్నట్టు ఆయన చెప్పారు. కేసీఆర్ కుటుంబ సభ్యులతో భేటీ అయ్యారా? లేదా? ఒబేరాయ్ హోటల్ లో వారిని కలిశారా లేదా? అనే ప్రశ్నలకు సిసోడియా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సిసోడియా కోర్టు ముందు నిజాలు ఒప్పుకుని, ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు.      

ఇవేం గిమ్మిక్కులు మోడీజీ?: సిసోడియా 

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తనకు సీబీఐ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిందంటూ ఆదివారం మనీశ్ సిసోడియా ట్వీట్ చేశారు. తాను ఢిల్లీలోనే స్వేచ్ఛగా తిరుగుతున్నానని, కానీ విదేశాలకు పారిపోతున్నట్లు నోటీసులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ‘‘మీ దాడులు ఫెయిల్ అయ్యాయి. ఏమీ దొరకలేదు. ఇప్పుడు నాపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఇవేం గిమ్మిక్కులు మోడీజీ? నేను ఢిల్లీలోనే ఉన్నా. ఎక్కడికి రావాల్నో చెప్తే.. అక్కడికి వస్తా” అని చెప్పారు. ‘‘బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్​లో ఏటా రూ. 10 వేల కోట్ల ఎక్సైజ్ ట్యాక్స్ ఎగవేత జరుగుతోంది. కల్తీ మద్యం తాగి ఏటా వెయ్యి మంది చనిపోతున్నారు. లిక్కర్ పాలసీలో అవినీతిపై చర్యలు తీసుకోవాలన్న చిత్తశుద్ధి ఉంటే ముందుగా మీరు అక్కడ చర్యలు తీసుకునేవారు” అని విమర్శించారు. కాగా, ఏదైనా కేసులోని నిందితులు దేశం విడిచిపారిపోకుండా చూసేందుకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేస్తుంటారు. అయితే, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితులెవరికీ లుక్ అవుట్ నోటీసులు జారీ చేయలేదని సీబీఐ స్పష్టం చేసింది.