ఢిల్లీ బీజేపీ చీఫ్‌ రాజీనామా

ఢిల్లీ బీజేపీ చీఫ్‌ రాజీనామా

న్యూఢిల్లీ: ఢిల్లీ బీజేపీ ప్రెసిడెంట్‌ ఆదేశ్‌ గుప్తా తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ తాను రాజీనామా చేస్తున్నట్లు ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. దీంతో బీజేపీ ఢిల్లీ యూనిట్‌ వైస్ ప్రెసిడెంట్ వీరేంద్ర సచ్‌దేవను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించారు. ఆదేశ్‌ గుప్తా రాజీనామాను పార్టీ చీఫ్‌ జేపీ నడ్డా ఆదేశాల మేరకు ఆమోదించామని బీజేపీ నేషనల్‌ జనరల్‌ సెక్రటరీ అరుణ్‌ సింగ్‌ తెలిపారు. తదుపరి ప్రెసిడెంట్‌ను నియమించే వరకు వర్కింగ్‌ స్టేట్‌ యూనిట్‌ చీఫ్‌గా వీరేంద్ర ఉంటారని ఆయన వెల్లడించారు. ఇటీవల విడుదలైన ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఫలితాల్లో ఆప్‌ 134 సీట్లు సాధించి అఖండ విషయం సాధించింది. బీజేపీ 104 సీట్లకు పరిమితమైంది. గత 15 ఏండ్లుగా ఢిల్లీ కార్పొరేషన్‌లో బీజేపీనే అధికారంలో ఉంది. 2020లో గుప్తా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన పని తీరుపై బీజేపీ నిఘా ఉంచింది. 2021లో జరిగిన కొన్ని ఎంసీడీ వార్డుల్లో ఉప ఎన్నికలు, రాజేందర్‌‌నగర్‌‌ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ గెలవలేదు. దీంతో ఆయనను తప్పించినట్లు సమాచారం. కాగా, గుప్తా పదవీ కాలం మరికొన్ని రోజుల్లో ముగియనుండటంతో ఆయన రాజీనామా చేయడం వల్ల పెద్దగా అర్థం లేదని కొందరు ఢిల్లీ బీజేపీ కార్యకర్తలు అంటున్నారు.