చెన్నైను చిత్తు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్

చెన్నైను చిత్తు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్
  • ధవన్‌..దంచెన్‌
  • చెన్నైపై 7 వికెట్ల తేడాతో ఢిల్లీ గెలుపు
  • పృథ్వీ షా సూపర్‌‌ హిట్‌‌   రైనా పోరాటం వృథా

హై స్కోరింగ్‌‌ మ్యాచ్‌‌ను కాస్తా వన్‌‌సైడ్‌‌ వార్‌‌గా మార్చిన ఢిల్లీ క్యాపిటల్స్‌‌.. ఐపీఎల్‌‌–14లో గ్రాండ్‌‌ విక్టరీ కొట్టింది..! శిఖర్‌‌ ధవన్‌‌ (54 బాల్స్‌‌లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 85), పృథ్వీ షా (38 బాల్స్‌‌లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 78) బ్యాట్‌‌తో చేసిన ఎదురుదాడిలో సీఎస్‌‌కే బౌలర్లు బెంబేలెత్తిపోయారు..! వరుస ఫోర్లు, భారీ సిక్సర్లతో రెచ్చిపోయిన ఈ ఇద్దరు.. ఫస్ట్‌‌ వికెట్‌‌కు 138 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌తో బలమైన పునాది వేశారు..! రీఎంట్రీలో సురేశ్‌‌ రైనా (36 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 54) మెరుపులు మెరిపించడంతో  సీఎస్‌‌కే భారీ టార్గెట్‌‌ ఇచ్చినా.. బౌలింగ్‌‌ వైఫల్యంతో దాన్ని కాపాడుకోలేకపోయింది..!!

ముంబై: గురు–శిష్యుల సమరంగా సాగిన హై ఓల్టేజ్‌‌ మ్యాచ్‌‌లో ఎంఎస్‌‌ ధోనీకి.. రిషబ్‌‌ పంత్‌‌ చెక్‌‌ పెట్టాడు. బలమైన బ్యాటింగ్‌‌ లైనప్‌‌తో భారీ టార్గెట్‌‌ను ఊదేసి.. లీగ్‌‌లో అదిరిపోయే బోణీ కొట్టాడు. ఫలితంగా శనివారం జరిగిన సెకండ్‌‌ మ్యాచ్‌‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌‌ 7 వికెట్ల తేడాతో చెన్నై సూపర్‌‌కింగ్స్‌‌పై గెలిచింది. టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 188 రన్స్‌‌ చేసింది. రైనాకు తోడు మొయిన్‌‌ అలీ (24 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 36), సామ్‌‌ కరన్‌‌ (15 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 34) రాణించారు. తర్వాత ఢిల్లీ 18.4 ఓవర్లలో 3 వికెట్లకు 190 రన్స్‌‌ చేసి గెలిచింది. మూడు క్యాచ్‌‌లు కూడా పట్టిన ధవన్‌‌కు ‘మ్యాన్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. 

రైనా హుషారు..
స్లో వికెట్‌‌పై బ్యాటింగ్‌‌కు దిగిన చెన్నైకి శుభారంభం దక్కలేదు. ఫోర్‌‌తో ఖాతా తెరిచిన రుతురాజ్‌‌ (5), డుప్లెసిస్‌‌ (0).. నాలుగు బాల్స్‌‌ తేడాలో ఔటయ్యారు. దీంతో 7 రన్స్‌‌కే 2 వికెట్లు కోల్పోయిన సీఎస్‌‌కే ఇన్నింగ్స్‌‌కు రైనా, అలీ  ప్రాణం పోశారు. వోక్స్‌‌ (2/18) బాల్‌‌ను బౌండ్రీకి తరలించిన రైనా ఎక్కడా తగ్గలేదు. రెండో ఎండ్‌‌లోనూ అవేశ్‌‌ ఖాన్‌‌ (2/23) బౌలింగ్‌‌లో అలీ వరుస ఫోర్లతో రెచ్చిపోవడంతో పవర్‌‌ప్లేలో చెన్నై 33/2 స్కోరు చేసింది. ఫీల్డింగ్‌‌ను విస్తరించిన తర్వాత అలీ.. అశ్విన్‌‌ (1/47)ను టార్గెట్‌‌ చేసుకున్నాడు. 7వ ఓవర్‌‌లో రెండు ఫోర్లు, 9వ ఓవర్‌‌ ఫస్ట్‌‌ రెండు బాల్స్‌‌కు రెండు సిక్సర్లు బాదేశాడు. కానీ థర్డ్‌‌ బాల్‌‌ను రివర్స్‌‌ స్వీప్‌‌కు ట్రై చేసి ధవన్‌‌ చేతికి చిక్కాడు. ఫలితంగా థర్డ్‌‌ వికెట్‌‌కు 53 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. ఇదే ఓవర్‌‌ లాస్ట్‌‌ బాల్‌‌ను సిక్సర్‌‌గా మలిచిన రైనా.. ఒక్కసారిగా గేర్‌‌ మార్చాడు. రాయుడు కూడా అశ్విన్‌‌ (11వ ఓవర్‌‌) బాల్‌‌ను సిక్సర్‌‌ కొట్టి జోష్‌‌ పెంచాడు. 12వ ఓవర్‌‌లో రెండు టవరింగ్‌‌ సిక్సర్లు కొట్టిన రైనా.. 44 రన్స్‌‌ వద్ద మరో భారీ సిక్సర్‌‌తో 32 బాల్స్‌‌లోనే హాఫ్‌‌ సెంచరీ కంప్లీట్‌‌ చేశాడు. 14వ ఓవర్‌‌లో ఫోర్‌‌ కొట్టిన రాయుడు భారీ షాట్‌‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. జడేజా (17 బాల్స్‌‌లో 3 ఫోర్లతో 26 నాటౌట్‌‌) రెండు ఫోర్లతో దూకుడు చూపెట్టినా.. రైనా రనౌట్‌‌కు కారకుడయ్యాడు. 16వ ఓవర్‌‌లో అవేశ్‌‌ ఖాన్‌‌ బాల్‌‌ను లో స్క్వేర్‌‌ లెగ్‌‌లోకి పంపి జడేజా సెకండ్‌‌ రన్‌‌ కోసం పరుగెత్తాడు. రైనా సగం పిచ్‌‌ దాటినా.. జడ్డూకు బౌలర్‌‌ అడ్డుగా రావడంతో వెనక్కి తిరిగి వచ్చేశాడు. అప్పటికే బాల్‌‌ను అందుకున్న పంత్‌‌ వికెట్లను పడగొట్టాడు. 

ధోనీ ఫెయిల్​.. కరన్​ ఫినిషింగ్​
భారీ అంచనాల మధ్య వచ్చిన కెప్టెన్‌‌ మహేంద్ర సింగ్​ ధోనీ (0).. థర్డ్‌‌ బాల్‌‌కే కు క్లీన్‌‌బౌల్డ్‌‌ అయ్యాడు. మూడు బాల్స్‌‌ తేడాలో రెండు కీలక వికెట్లు తీసి ఢిల్లీ రేస్‌‌లోకి వచ్చింది. స్లాగ్‌‌ ఓవర్స్‌‌లో జడేజా, సామ్‌‌ కరన్‌‌ను క్యాపిటల్స్‌ బౌలర్లు కట్టడి చేయలేకపోయారు. 17, 18 ఓవర్లలో 13 రన్సే వచ్చినా.. 19వ ఓవర్‌‌ టామ్‌‌ కరన్‌‌ బౌలింగ్‌‌లో అతని తమ్ముడు సామ్‌‌ కరన్‌‌ చెలరేగాడు.  4, 6, 6, 4తో 23 రన్స్‌‌ పిండుకున్నాడు. లాస్ట్‌‌ ఓవర్‌‌లో 10 రన్స్‌‌ వచ్చాయి. జడ్డూ–సామ్ కరన్ ఏడో వికెట్‌‌కు 28 బాల్స్‌‌లోనే 51 రన్స్‌‌ జత చేయడంతో చెన్నై భారీ స్కోరు చేసింది. 

138 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌..
భారీ టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో ధవన్‌‌, పృథ్వీ షా..  ఢిల్లీకి అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. ఫస్ట్‌‌ ఓవర్‌‌ నుంచే మొదలైన అటాకింగ్‌‌.. లాస్ట్‌‌ వరకు కొనసాగింది. సీఎస్‌‌కే ఫీల్డింగ్‌‌ కూడా చెత్తగా ఉండటంతో ఇద్దరూ పోటీపడి ఫోర్లు, సిక్సర్లు బాదారు. నాలుగో ఓవర్‌‌లో ధవన్‌‌ ఫస్ట్‌‌ సిక్సర్‌‌ కొడితే.. ఐదో ఓవర్‌‌లో ఇద్దరు కలిసి నాలుగు ఫోర్లతో 17 రన్స్‌‌ రాబట్టారు. పవర్‌‌ప్లే ముగిసేసరికి ఢిల్లీ 65 రన్స్‌‌తో నిలిచింది. ఆ తర్వాత కూడా ఈ జోడీ.. పేసర్‌‌, స్పిన్నర్‌‌ అనే తేడా లేకుండా విరుచుకుపడింది. 8వ ఓవర్‌‌లో షా ఇచ్చిన క్యాచ్‌‌ను శాంట్నర్‌‌ మిస్‌‌ చేశాడు. తర్వాతి ఓవర్‌‌లో అతను సిక్సర్‌‌తో రెచ్చిపోయాడు. 10వ ఓవర్‌‌లో ధవన్‌‌ రెండో సిక్సర్‌‌తో జోరు పెంచితే, పృథ్వీ ఫోర్‌‌తో 27 బాల్స్‌‌లో ఫిఫ్టీ కంప్లీట్‌‌ చేశాడు. 10 ఓవర్లలో డీసీ స్కోరు 99కి చేరింది. ఇదే క్రమంలో ధవన్‌‌ కూడా 35 బాల్స్‌‌లో హాఫ్‌‌ సెంచరీ మార్క్‌‌ను అందుకున్నాడు. ఇక్కడి నుంచి ఓవర్‌‌కు ఒకటి, రెండు ఫోర్లు ఉండేలా జాగ్రత్త పడ్డారు. 13వ ఓవర్‌‌ (అలీ)లో 6, 4తో రెచ్చిపోయిన పృథ్వీ సునామీ ఇన్నింగ్స్‌‌కు.. నెక్స్ట్‌‌ ఓవర్‌‌లో బ్రావో ముగింపు పలికాడు. దీంతో ఫస్ట్‌‌ వికెట్‌‌కు 138 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ బ్రేక్‌‌ అయ్యింది. వన్‌‌డౌన్‌‌లో వచ్చిన కెప్టెన్ పంత్‌‌ (15 నాటౌట్‌‌) కూడా ఫర్వాలేదనిపించడంతో ఢిల్లీ 15 ఓవర్లలో 151/1 స్కోరు చేసింది. తర్వాతి ఓవర్‌‌లో 7 రన్స్‌‌ రావడంతో ఇక ఢిల్లీ విజయం ఖాయమే అనుకుంటున్న తరుణంలో ఠాకూర్‌‌ సీఎస్‌కేకు బ్రేక్ ఇచ్చాడు.17వ ఓవర్‌‌లో రెండు ఫోర్లు కొట్టి సెంచరీపై కన్నేసిన ధవన్‌‌ వికెట్‌‌ తీశాడు. ఫలితంగా సెకండ్‌‌ వికెట్‌‌కు 29 రన్స్‌‌ పార్ట్​నర్​షిప్​ ముగిసింది. కానీ చేయాల్సిన రన్స్‌‌ 18 బాల్స్‌‌లో 17 మాత్రమే ఉండటంతో ఢిల్లీ విజయాన్ని సీఎస్‌‌కే ఆపలేకపోయింది. స్టోయినిస్‌‌ (14) ఔటైనా, పంత్‌‌ ఫోర్‌‌తో విన్నింగ్‌‌ షాట్‌‌ కొట్టాడు. 

స్కోరు బోర్డు
చెన్నై సూపర్‌‌కింగ్స్‌‌: రుతురాజ్‌‌ (సి) ధవన్‌‌ (బి) వోక్స్‌‌ 5, డుప్లెసిస్‌‌ (ఎల్బీ) ఆవేశ్‌‌ ఖాన్‌‌ 0, మొయిన్‌‌ అలీ (సి) ధవన్‌‌ (బి) అశ్విన్‌‌ 36, రైనా (రనౌట్‌‌) 54, రాయుడు (సి) ధవన్‌‌ (బి) టామ్‌‌ కరన్‌‌ 23, జడేజా (నాటౌట్‌‌) 26, ధోనీ (బి) ఆవేశ్‌‌ ఖాన్‌‌ 0, సామ్‌‌ కరన్‌‌ (బి) వోక్స్‌‌ 34, ఎక్స్‌‌ట్రాలు: 10, మొత్తం: 20 ఓవర్లలో 188/7. వికెట్లపతనం: 1–7, 2–7, 3–60, 4–123, 5–137, 6–137, 7–188. బౌలింగ్‌‌: క్రిస్‌‌ వోక్స్‌‌ 3–0–18–2, అవేశ్‌‌ ఖాన్‌‌ 4–0–23–2, అశ్విన్‌‌ 4–0–47–1, టామ్‌‌ కరన్‌‌ 4–0–40–1, మిశ్రా 3–0–27–0, స్టోయినిస్‌‌ 2–0–26–0. 
ఢిల్లీ క్యాపిటల్స్‌‌: పృథ్వీ (సి) అలీ (బి) బ్రావో 72, ధవన్‌‌ (ఎల్బీ) ఠాకూర్‌‌ 85, పంత్‌‌ (నాటౌట్‌‌)15, స్టోయినిస్‌‌ (సి) కరన్‌‌ (బి) ఠాకూర్‌‌ 14, హెట్‌‌మయర్‌‌ (నాటౌట్‌‌) 0, ఎక్స్‌‌ట్రాలు: 4, మొత్తం: 18.4 ఓవర్లలో 190/3. వికెట్లపతనం: 1–138, 2–167, 3–186. బౌలింగ్‌‌: దీపక్‌‌ చహర్‌‌ 4–0–36–0, సామ్‌‌ కరన్‌‌ 2–0–24–0, ఠాకూర్‌‌ 3.4–0–53–2, జడేజా 2–0–16–0, అలీ 3–0–33–0, బ్రావో 4–0–28–1.