
అబుదాబి: పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచే జట్టుకు ఫైనల్ చేరేందుకు రెండు అవకాశాలు వస్తాయి. ఈ నేపథ్యంలో ఈ సీజన్‌లో టాప్–2 ప్లేస్ కోసం సోమవారం జరిగే కీలక మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అమీతుమీ తేల్చుకోనున్నాయి. గెలిచిన టీమ్ సెకండ్ ప్లేస్‌ను దక్కించుకుంటే, ఓడిన జట్టుకు ప్లే ఆఫ్స్ కొద్దిగా కష్టమవుతుంది. మిగతా జట్ల సమీకరణాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఈ గందరగోళాన్ని తప్పించుకునేందుకు ఇరుజట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. టోర్నీ ఫస్ట్ హాఫ్‌లో వరుస విజయాలు సాధించిన ఢిల్లీ.. చివర్లో చతికిలపడింది. బ్యాటింగ్‌లో ఫర్వాలేదనిపిస్తున్నా.. బౌలింగ్‌లో చేతులెత్తేయడం ఆందోళన కలిగిస్తున్నది. ఓపెనింగ్‌లో నిలకడగా ఆడే ప్లేయర్లు లేకపోవడం కూడా ప్రతికూలాంశం. పృథ్వీ, రహానె, ధవన్ కాంబినేషన్ కుదురుకోవడం లేదు. వరుస సెంచరీలతో హోరెత్తించిన ధవన్.. లాస్ట్ మూడు మ్యాచ్‌ల్లో 0, 0, 6 రన్స్ మాత్రమే చేశాడు. బిగ్ హిట్టర్లు రిషబ్, శ్రేయస్ చెలరేగితే ఢిల్లీ కష్టాలు తీరినట్లే. మరోవైపు ఆర్‌సీబీ కూడా మూడు పరాజయాలతో ఒత్తిడిలో ఉంది. దీంతో టీమ్ బ్యాలెన్స్, ఫామ్‌పై సందేహాలు మొదలయ్యాయి. బ్యాటింగ్‌లో ఎక్కువగా కోహ్లీ, డివిలియర్స్‌పైనే ఆధారపడటం బలహీనతగా మారింది. లాస్ట్ రెండు గేమ్‌ల్లోనూ ఈ ఇద్దరు పెద్దగా రాణించలేదు. ఆరోన్ ఫించ్ స్థానంలో వచ్చిన జోష్ ఫిలిప్పీ ఘోరంగా నిరాశపరుస్తున్నాడు. బౌలర్లు కూడా మరింత మెరవాల్సి ఉంది.