స్వామి వివేకానంద : సహనమే విజయ సోపానం

స్వామి వివేకానంద : సహనమే విజయ సోపానం

సహనం ఎప్పుడూ చేదుగా ఉంటుంది. దాని ఫలితాలెప్పుడూ తియ్యగానే ఉంటాయి... అంటారు స్వామి వివేకానంద. సహనం వల్ల అధిక ఫలితం వస్తుంది. సహనం వల్ల విజయం లభిస్తుంది. సహనం వల్ల శాంతి, సత్యం నెలకొంటాయి. సహనం వల్ల బలం చేకూరుతుంది, మానసిక ప్రశాంతత కలుగుతుంది. అందువల్ల జీవితాన్ని సఫలం చేసుకోవాలంటే సహన గుణాన్ని అలవరచుకోవాలి అంటారు పెద్దలు.గొంగళి పురుగు జీవితాన్ని పరిశీలిస్తే చాలా ఆశ్చర్యకరమైన, అందమైన విషయం అర్థం అవుతుంది. అందమైన రంగురంగుల రెక్కలున్న కీటకం సీతాకోక చిలుక. అది బయటకు రావడానికి నాలుగు దశలుంటాయి.

 గుడ్డు దశ, లార్వా లేదా గొంగళి పురుగు దశ, కదలకుండా ఉండే ప్యూపా దశ, చివరగా బయటకు వెలువడే రంగు రంగుల రెక్కల ‘సీతాకోక చిలుక’ దశ. అంటే ఈ కీటకం ఎంతో సహనంగా ఉంటూ.. గుడ్డు దశ నుంచి ప్రారంభమై, అందరూ అసహ్యించుకునే గొంగళిపురుగు దశ నుంచి సీతాకోక చిలుకగా మారుతుంది. సహనం వల్ల వచ్చే ఫలితం ఇలా ఉంటుందని సీతాకోక చిలుక మనకు చెబుతోంది. సృష్టిలోని పక్షులు పెట్టే గుడ్లు కూడా ఇంతే. అవి పెట్టిన గుడ్లను ఎంతో జాగ్రత్తగా పొదుగుతాయి పక్షులు. అప్పుడు ఆ గుడ్డు నుంచి పిల్లలు బయటకు వస్తాయి. ఇందుకు ఆ పక్షులు ఎంతో సహనంతో ఉంటాయి. 

రామాయణంలో.. 

కైకమ్మ కోరిక మీద రాముడు వనవాసానికి వెళ్లవలసి వచ్చినప్పుడు, ఎంతో సహనంతో పదునాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేశాడు. ఎక్కడా ధర్మాన్ని అతిక్రమించలేదు, ఓర్పును కోల్పోలేదు. తత్ఫలితంగా తిరిగి అయోధ్యకు రాజయ్యాడు. ప్రజారంజకంగా పరిపాలన సాగించాడు. రామరాజ్యం అనే పేరును సంపాదించుకున్నాడు. తన మనసుసు బలంగా తయారుచేసుకుని, అశోకవనంలో సీతమ్మను కనుగొన్నాడు హనుమంతుడు. ఆనందంతో పరవశించిపోయాడు. ఎంతోమంది రాక్షసుల మధ్య ఉన్నప్పటికీ సహనాన్ని కోల్పోకుండా, భయం దరిచేరకుండా జీవించింది. చివరకు తన రాముడిని చేరుకుంది. 

ఇక మహాభారతం పరిశీలిస్తే...

కౌరవులకు ముందు నుంచీ మితిమీరిన అహంకారమే. ఆ అహంకారంతోనే పాండవుల సహనాన్ని పరీక్షించేలా ప్రవర్తించేవారు. ధర్మరాజు రాజసూయ యాగం చేసిన సందర్భంలో, వారికి వచ్చిన కానుకలను చూసి దుర్యోధనుడికి ఆ సంపదలను అపహరించాలనే దురాశ పుట్టింది.

 రాజసూయ యాగం చేయాలంటే... శత్రువు అనేవాడు ఉండకూడదు. అందువల్ల పాండవులందరూ నాలుగు దిక్కులకు వెళ్లి, రాజులను జయించి, వారు ఇచ్చిన కానుకలను తీసుకువచ్చి, అప్పుడు రాజసూయ యాగం చేశారు. ఎంతో సహనంతో, ఓర్పుతో ఈ యుద్ధాలు చేసిన తరువాతే యాగం ఆరంభించాడు. 

దుర్యోధనుడు మాత్రం ఆ సంపదలను సులువుగా అపహరించాలనుకున్నాడు. శకుని సూచన మేరకు ధర్మరాజుతో కపట జూదం ఆడాడు. పాండవులు సర్వస్వం కోల్పోయారు. ద్రౌపదీ వస్త్రాపహరణం చేయడానికి సంసిద్ధుడయ్యాడు దుశ్శాసనుడు. భీముడు ఆగ్రహంతో గద ఎత్తబోయాడు. కాని ధర్మానికి కట్టుబడిన ధర్మరాజు శాంతచిత్తంతో, భీముడిని ఆపాడు.

 ధర్మానికి కట్టుబడి పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం, ఒక సంవత్సర కాలం పాటు అజ్ఞాతవాసం పూర్తి చేశారు. అరణ్యవాస సమయంలో సైంధవుడు ద్రౌపది మీద అత్యాచారం జరపబోయాడు. వాడిని శిక్షించి విడిచేశారు పాండవులు. అజ్ఞాత వాస సమయంలో కీచకుడు ద్రౌపది పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సమయంలో మరోమారు భీముడు తన బలప్రదర్శన చేయబోయాడు. 

సహనశీలి అయిన ధర్మరాజు, నర్మగర్భంగా మాట్లాడి, భీముడిని శాంతపరిచాడు. ఆ తరువాత అదను చూసి, కీచకవధను ప్రోత్సహించాడు ధర్మరాజు. ఆయనలోని సహనమే వారి అజ్ఞాతవాసాన్ని బయటపడనీయకుండా రక్షించింది. అజ్ఞాతవాసం పూర్తయిన పిదప జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులంతా హతులయ్యారు. పాండవులు హస్తినాపుర ప్రభువులయ్యారు. పాండవుల సహనమే వారికి విజయాన్ని చేకూర్చింది. 

విద్యార్థులు సైతం పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడానికి ఎంతో సహనం, ఓర్పు అవసరం. మనస్సును చదువు మీద లగ్నం చేసి, ఓరిమిగా చదువుకుంటే, సత్ఫలితాలు సాధిస్తారు. అబ్రహాంలింకన్, లాల్‌‌ బహదూర్‌‌ శాస్త్రి వంటివారు కడు పేదరికంలో ఉండి కూడా, చదువు మీద శ్రద్ధ ఉంచి, విజయం సాధించేవరకు సహనంతో ఉన్నారు. జీవితంలో గెలుపు సాధించడానికి తొందరపాటు పనికిరాదు. ఓరిమి, సహనమే విజయానికి సోపానాలని వివేకానందుడి మాటను గుర్తుంచుకోవాలి.

- డా. పురాణపండ వైజయంతి-