ఇక గూగుల్ క్రోమ్ ఉండదా.. ? క్రోమ్నే కొనేందుకు రెడీ అయిన ఈ పర్ప్లెక్సిటీ ముచ్చటేందంటే...

ఇక గూగుల్ క్రోమ్ ఉండదా.. ? క్రోమ్నే కొనేందుకు రెడీ అయిన ఈ పర్ప్లెక్సిటీ ముచ్చటేందంటే...

వయసు దాదాపు ముప్పై ఏండ్లు.. కంపెనీ పెట్టి సరిగ్గా మూడేండ్లు.. కంపెనీలో పనిచేసే స్థాయి నుంచి తానే ఒక సామ్రాజ్యాన్ని నిర్మించే స్థాయికి ఎదిగాడు అరవింద్ శ్రీనివాసన్​. భారతీయుడిగా ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉన్న అతిపెద్ద  కంపెనీ గూగుల్​లో ఉద్యోగం సంపాదించాలని కలలు కన్న కుర్రాడు. ఇప్పుడు ఆ గూగుల్​నే కొనడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ఒక్కసారిగా షాక్​ ఇచ్చాడు. 

‘పర్​ప్లెక్సిటీ’ అనే పేరుతో ఒక ఏఐ కంపెనీని ఆవిష్కరించిన అరవింద్ ఇప్పుడు దానికి కో–ఫౌండర్, సీఈఓగా ఉన్నాడు. రాబోయే రోజుల్లో ఎన్ని ఏఐ కంపెనీలు పుట్టుకొచ్చినా పర్​ప్లెక్సిటీ మాత్రం కేవలం టూల్​గా కాకుండా.. ఇది పర్​ఫెక్ట్​ ఏఐ ఏజెంట్​లా పనిచేస్తుందని బలంగా చెప్తున్నాడు. ప్రస్తుతం పది కోట్లమంది యూజర్లతో నడుస్తోన్న ఈ కంపెనీ వచ్చే ఏడాదికల్లా వంద కోట్ల యూజర్లను టార్గెట్​గా పెట్టుకుని పనిచేస్తోంది. 

సెర్చ్ ఇంజిన్ అనగానే గుర్తొచ్చే పేరు గూగుల్. ప్రపంచమంతా వాడుతోన్న గూగుల్​ తన సేవలను ఎప్పటికప్పుడు విస్తృతం చేస్తోంది. కేవలం సెర్చ్ ఇంజిన్ ద్వారానే కోట్లు కొల్లగొడుతోంది. అలాంటి గూగుల్​కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోడైంది. అలా గూగుల్ జెమిని ఏఐ యూజర్లకు పరిచయం అయింది. అప్పటికే మార్కెట్​లో ఉన్న ఓపెన్ ఏఐ కంపెనీ చాట్​జీపీటీతో యూజర్లను తమ వశం చేసుకుంది. దాంతో గూగుల్ సెర్చింగ్​ చేసేవాళ్ల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఈ క్రమంలోనే గ్రోక్​ వంటి ఇతర ఏఐ టూల్స్ కూడా వెలుగులోకి వచ్చాయి. వీటన్నింటికీ ధీటుగా ఉండాలనే ఉద్దేశంతో జెమిని ఏఐని ఎప్పటికప్పుడు అప్​డేట్ చేస్తూ వస్తోంది గూగుల్. 

ఇలా ఏఐ మార్కెట్​ గురించి హడావిడి నెలకొన్న వేళ.. వాటి మధ్యలోకి మరొక కొత్త కంపెనీ వచ్చింది. అదే పర్​ప్లెక్సిటీ. ఈ కంపెనీ గూగుల్, మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ.. ఇలా ఏ సంస్థతో కంపేర్ చేసినా చాలా చిన్నది. నిజానికి ఈ కంపెనీని స్టార్ట్​ చేసేందుకు మొదట్లో అరవింద్​ శ్రీనివాస్‌ దగ్గర తగినంత డబ్బు కూడా లేదు. అందుకే ఈ పోటీ ప్రపంచంలో తన ఆలోచనను ఆవిష్కరిస్తే.. తప్పకుండా కోట్లు ఆర్జించవచ్చు అనే ఆత్మస్థైర్యంతో ముందడుగు వేశాడు. ప్రస్తుతం ‘టాప్ మోస్ట్​ ఇన్​ఫ్లుయెన్షియల్​ పీపుల్ ఇన్ ఏఐ’ లిస్ట్​లో ఒకరిగా నిలిచాడు. 

ఎలక్ట్రికల్ ఇంజినీర్​ చదివినా... 

చెన్నైకి చెందిన అరవింద్ శ్రీనివాస్1994లో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు. ఐఐటీ మద్రాస్​లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివాడు. అప్పట్లో కంప్యూటర్ సైన్స్​ గ్రూప్​లోకి మారడం వీలుకాకపోవడంతో పైథాన్ నేర్చుకున్నాడు. తర్వాత కాలిఫోర్నియా యూనివర్సిటీ బెర్కెలీలో మెషిన్​ లెర్నింగ్​లో పీహెచ్‌డీ పూర్తి చేశాడు. ఓపెన్ ఏఐ, డీప్ మైండ్ కంపెనీల్లో ఇంటర్న్​షిప్​ చేశాడు. అందులోభాగంగా గూగుల్‌లో కూడా ట్రైనీగా పనిచేశాడు. ఆ టైంలోనే అతనికి ఒక మెరుపులాంటి ఆలోచన తట్టింది. ఇక ఫ్యూచర్​ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్​దేనని గుర్తించాడు. తనకంటూ ఒక గుర్తింపు సంపాదించాలని జాబ్ వదిలేశాడు. ఇతర కంపెనీల్లోని లోపాలను తన అవకాశాలుగా మార్చుకున్నాడు. 

తన ఆలోచన అమెజాన్​ ఫౌండర్​ జెఫ్ బెజోస్​కు నచ్చింది. 2022లో ‘పర్​ప్లెక్సిటీ’ ఆలోచనను ప్రపంచం ముందు ఆవిష్కరించాడు. దీని గురించి మాట్లాడుతూ.. ‘‘మొదట జెఫ్ బెజోస్​కు నా ఐడియా చెప్పడానికి వెళ్లినప్పుడు ఆయన డెమో చేయమని చెప్పారు. చేసిన తర్వాత ఇంకా క్లారిటీ కోసం పేపర్​ మీద రాయమని చెప్పారు. ఆరు పేజీలు రాసిస్తే.. ఆయనే చదివారు. అలా రెండు మూడు సార్లు మీటింగ్ జరిగింది. ఆయన ఎన్నో విషయాలు నాకు చెప్పారు. కొన్ని సూచనలు, సలహాలు కూడా ఇచ్చారు. ఎప్పటికప్పుడు అప్​డేట్ గమనిస్తూనే ఉంటారు. ఆయన ఫండింగ్​కి ముందుకు రావడం వల్లే మా కంపెనీ పేరు ప్రపంచానికి తెలిసింది” అని చెప్పాడు. ఆయనతోపాటు యూట్యూబ్ మాజీ సీఈఓ సుశాంత్, టెక్ కంపెనీ అయిన ఎన్​వీడియా వారు తను సృష్టించబోయే కొత్త టెక్నాలజీకి పెట్టుబడులు అందించారు.

దాంతో జానీ హో, ఆండీ కాన్‌ విన్‌స్కీ, డెనియా యారట్స్​తో కలిసి స్టార్టప్‌ పెట్టాడు. ఇప్పటికే గూగుల్, యాహూ, బింగ్.. వంటి సెర్చ్ ఇంజిన్​లు అందుబాటులో ఉన్నప్పటికీ వాటికి భిన్నంగా, మరింత అధునాత టెక్నాలజీతో ఉండాలని పర్​ప్లెక్సిటిని రూపొందించాడు. ఈ సెర్చ్ ఇంజిన్​లో ప్రతి ప్రశ్నకూ సమాధానం వివరణాత్మకంగా దొరుకుతుంది. అంతేకాదు.. ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి తీసుకుందో కూడా చూపిస్తుంది. రియల్​ టైంలో సమాచారాన్ని అందిస్తోన్న ఈ సెర్చ్ ఇంజిన్​ మూడేండ్లలోనే రెండు కోట్లమంది యూజర్లకు చేరువయ్యింది. అలానే కోట్లలో పెట్టుబడులు అందుకుంది. కొంతకాలానికే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏఐ కంపెనీగా మారింది. ఒక ఏడాదికే బిలియన్ మార్క్ దాటిన ఈ కంపెనీ యూనీకార్న్​గా మారింది.  

గూగుల్​ క్రోమ్​ను కొనేందుకు..

పర్​ప్లెక్సిటీ లేటెస్ట్​గా తీసుకొచ్చిన ఏఐ బ్రౌజర్ ‘కామెట్’. ఇది ఒక కంపెనీకి కావాల్సిన ఇంజినీర్లను గుర్తించడం, వాళ్ల లింక్డ్​ ఇన్​ ప్రొఫైల్స్​ను సేకరించడం, ఇండివిడ్యువల్​ ఈ మెయిల్స్​ పంపడం వంటివి ఆటోమెటిక్​గా చేస్తుంది. అంటే రిక్రూటర్లు చేసే పనిని కూడా ఈ ఏఐ టూల్స్ చేస్తాయి. గూగుల్ క్యాలెండర్​ను కూడా మేనేజ్ చేయగలదు. షెడ్యూల్స్ ప్లాన్​ చేసి మీటింగ్​ సారాంశాన్ని రెడీ చేసి ఇస్తుంది. ఇది సెర్చ్​ ఇంజిన్ కాదు.. ఏఐ ఏజెంట్ లాంటిది అని అరవింద్ పేర్కొన్నారు. ఈ విధంగా చూస్తే రిక్రూటర్లు, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్లు వంటి ఉద్యోగాలను ఏఐ భర్తీ చేస్తుందని చెప్తున్నారు. గూగుల్.. యాపిల్, శాంసంగ్ వంటి పెద్ద కంపెనీలతో అగ్రిమెంట్ చేసుకుంది. ఆ కంపెనీల డివైజ్​ల్లో గూగుల్ సెర్చ్ డిఫాల్ట్​గా ఉండడం కోసం వాళ్లు కొంత మొత్తాన్ని చెల్లిస్తున్నారు. 

అయితే.. గూగుల్ పాలసీలు చట్టవిరుద్ధమని, కోర్టును ఆశ్రయించాయి. అమెరికా గవర్నమెంట్​ గూగుల్ క్రోమ్​ను అమ్మాలని, ఇతర ప్లాట్​ఫాంలలో ప్రత్యేక ప్రమోషన్లు చేసుకునేందుకు చెల్లింపులు ఆపాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే.. పది కోట్ల మంది యూజర్లు ఉన్న పర్​ప్లెక్సిటీ 2026 నాటికి వంద కోట్ల యూజర్లను పొందడమే టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ క్రమంలోనే గూగుల్​ క్రోమ్​ను కొంటామని ఆఫర్ చేసింది. క్రోమ్​ కోర్ ఇంజిన్ అయిన క్రోమియంను ఓపెన్ సోర్స్​గా కంటిన్యూ చేస్తామని పర్​ప్లెక్సిటీ చెప్పింది. ఏటా దాదాపు 3 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడతామని చెప్పింది. ఇదే జరిగితే పర్​ప్లెక్సిటీ డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్​గా కూడా మార్చబోమని చెప్పింది. గూగుల్ క్రోమ్​నే కొనసాగిస్తామని తెలిపింది. 

పర్​ప్లెక్సిటీ.. సెర్చ్ ఇంజిన్

జెమిని, డీప్ సీక్, చాట్​జీపీటీలోని మోడల్స్​ను వాటిని ఇంట్రడ్యూస్ చేసిన కంపెనీ వాళ్లు వేరే వాటిని వాడరు. కానీ, పర్​ప్లెక్సిటీ అలా కాదు.. డీప్​ సీక్ ఆర్​1, జెమిని ఫ్లాష్​ 2.0, క్లాడ్​ 3.5 సోనెట్, o3–మిని, జీపీటీ 4o, సోనార్, గ్రోక్​ 2.. వీటిన్నింటినీ పర్​ప్లెక్సిటీ ప్రొ సబ్​స్క్రిప్షన్ ద్వారా అందిస్తోంది. అందుకు కేవలం నెలకు 20 డాలర్లు వెచ్చించాలని ట్విట్టర్​లో అరవింద్ ట్వీట్ చేశాడు. ఈ మోడల్స్ అన్నింటినీ అవి లాంచ్​ అయిన రోజే ఇంటిగ్రేట్ చేసింది పర్​ప్లెక్సిటీ. అందుకు కారణం.. పర్​ప్లెక్సిటీ చాట్​బాట్​గా కాకుండా సెర్చ్​ ఇంజిన్​గా చెప్పుకుంది. కాబట్టి ఏఐ మోడల్స్​తో సంబంధం లేకుండా కేవలం యూజర్​ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు లేదా బెస్ట్​ ఇన్ఫర్మేషన్​ను అందివ్వడమే పనిగా పెట్టుకుంది.  

అంతేకాదు.. గూగుల్ వియో లానే పర్​ప్లెక్సిటీ ప్రొలో కూడా ఏఐ వీడియోలు జనరేట్ చేయొచ్చు. ఈ యాప్​ ద్వారా మనకు ఎలాంటి వీడియో కావాలో టెక్స్ట్​ రూపంలో ఇస్తే.. వీడియో క్రియేట్ చేస్తుంది. 8 సెకన్ల నిడివితో వీడియోలు చేయొచ్చు. క్రియేట్ చేసిన వీడియో కింద ఉన్న మూడు చుక్కలను క్లిక్ చేస్తే.. వీడియో డౌన్​లోడ్ లేదా షేర్ ఆప్షన్లు​ చూపిస్తుంది. కావాల్సిన ఆప్షన్​ను ఎంచుకోవచ్చు. ఒకవేళ వీడియో బాగా రాకపోతే నచ్చినట్లు ఎడిట్ చేసుకోవడానికి టెక్స్ట్​ను మార్చాల్సి ఉంటుంది. అంతేకాదు.. వీడియోలో ఏమైనా అన్​వాంటెడ్​గా ఉంటే రిపోర్ట్ కూడా చేయొచ్చు. ప్రస్తుతం ఎయిర్​టెల్ ద్వారా​ ఏడాదిపాటు ఫ్రీగా సర్వీస్​లను అందిస్తోంది.