
స్మార్ట్ టచ్ స్విచ్
లైట్లు, ఫ్యాన్ల స్విచ్‌లు ఆన్/ఆఫ్ చేస్తుంటే సౌండ్ భలేగా వస్తుంటుంది. అందుకే పిల్లలు అదే పనిగా స్విచ్‌లను నొక్కుతుంటారు. దాంతో అవి పాడైపోతుంటాయి. అందుకే ఈ టచ్ స్విచ్‌ని ఇన్‌స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని అజియోట్ అనే కంపెనీ తీసుకొచ్చింది. దీనికి నాలుగు టచ్ సెన్సర్లు ఉంటాయి. ఒక్కోటి ఒక్కో స్విచ్‌లా పనిచేస్తుంది. అంటే ఫ్యాన్, బల్బ్, నైట్ ల్యాంప్, అవుట్‌పుట్ సాకెట్.. ఇలా నాలుగింటిని ఆపరేట్ చేయొచ్చు. దీనిని వైఫైతో కనెక్ట్ చేసి, అలెక్సాతో కూడా ఆపరేట్ చేయొచ్చు.
‘‘అలెక్సా.. కిచెన్‌లో లైట్ ఆన్ చెయ్” అని చెప్పగానే లైట్ వెలుగుతుంది. ఇది గూగుల్ అసిస్టెంట్‌తో కూడా కనెక్ట్ అవుతుంది. ఒక్కోసారి ఇంట్లో లైట్లు, ఫ్యాన్లు ఆన్ చేసి మర్చిపోయి ఆఫీస్‌కి వెళ్లిపోతుంటారు. అలాంటప్పుడు ‘స్మార్ట్‌లైఫ్’ యాప్ ద్వారా ఈ స్విచ్‌లను ఎక్కడి నుంచైనా కంట్రోల్ చేయొచ్చు. అంతేకాదు.. మన లైఫ్‌స్టయిల్‌కు అనుగుణంగా ఆటోమెటిక్ షెడ్యూల్ చేసి పెడితే అదే టైంకి లైట్లు, ఫ్యాన్లు లాంటివాటిని ఆన్/ఆఫ్ చేస్తుంది.
ధర: రూ. 929
ఫోన్ కూలర్
ఎక్కువగా గేమింగ్, లైవ్ స్ట్రీమింగ్ చేస్తుంటే ఫోన్ బాగా వేడెక్కుతుంది. అలాంటప్పుడు ఫోన్ స్క్రీన్ ఫ్రీజ్ అవుతుంటుంది. టెంపరేచర్ బాగా పెరిగితే ఆటోమేటిక్‌గా షట్‌డౌన్ అవుతుంది. ఇది పదే పదే రిపీటైతే ఫోన్ పాడైపోతుంది. కానీ.. ఈ కూలర్‌తో ఇలాంటి సమస్యలన్నింటికీ చెక్ పెట్టొచ్చు. యాంట్ కంపెనీ తీసుకొచ్చిన ఈ గాడ్జెట్ అడ్వాన్స్‌డ్ కూలింగ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. దీన్ని ప్రత్యేకంగా గేమర్స్ కోసం తయారుచేశారు.
ఫోన్ వెనకభాగంలో అటాచ్ చేసి, యూఎస్‌బీ పవర్ కేబుల్ ప్లగ్ చేస్తే చాలు. ఇందులో సరికొత్త సెమీకండక్టర్ రిఫ్రిజిరేషన్ రేడియేటర్ టెక్నాలజీ కూడా ఉంది. ఇది ఫోన్‌ని క్షణాల్లోనే చల్లబరుస్తుంది. దీన్ని 4.5 నుంచి 7 అంగుళాల స్ర్కీన్ ఉండే అన్ని రకాల స్మార్ట్‌ఫోన్‌లకు అనుకూలంగా ఉండేలా తయారుచేశారు. ఇందులో రెండు కూలింగ్ మోడ్స్ ఉంటాయి. ఫ్యాన్ నుంచి 35db కంటే తక్కువ సౌండ్ వచ్చేలా డిజైన్ చేశారు. సైజు చిన్నగా ఉండడమే కాకుండా బరువు కూడా చాలా తక్కువ. ఇందులో ఆకట్టుకునే ఎల్‌ఈడీ లైట్లు కూడా ఉన్నాయి.
ధర: రూ. 503
కూలింగ్ ప్యాడ్
ల్యాప్‌టాప్‌లో వీడియో ఎడిటింగ్, గేమ్స్ ఆడడం లాంటివి చేస్తున్నప్పుడు ప్రాసెసర్ శక్తినంతా కూడగట్టుకుని పనిచేయాల్సి ఉంటుంది. దానివల్ల ల్యాప్‌టాప్ అడుగు భాగం బాగా వేడెక్కుతుంది. అందుకే హెవీ టాస్క్‌లు చేసేటప్పుడు ల్యాప్‌టాప్‌ని టేబుల్ మీద కాకుండా ఇలాంటి కూలింగ్ ప్యాడ్ మీద పెడితే సరిపోతుంది. దీన్ని పోర్‌ట్రోనిక్స్ కంపెనీ తీసుకొచ్చింది. ఇందులో 3,000 ఆర్‌పీఎంతో తిరిగే ఆరు ఫ్యాన్‌లు ఉంటాయి. అవి టెంపరేచర్‌ను బాగా కంట్రోల్ చేస్తాయి. వీటికి యూఎస్‌బీ కేబుల్‌తో పవర్ అందించాల్సి ఉంటుంది.
ఫ్యాన్‌లను ఆపరేట్ చేసేందుకు ప్రత్యేకంగా రెండు స్విచ్‌లు కూడా ఉంటాయి. దీనికి మరో స్పెషల్ అట్రాక్షన్ ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగుల్లో వెలిగే లైట్లు. ఈ ప్యాడ్‌కు ఒక స్మార్ట్‌ఫోన్ హోల్డర్ కూడా ఉంది. దీన్ని ఐరన్ మెష్ బోర్డు, ఏబీఎస్ ప్లాస్టిక్‌తో తయారుచేశారు. బరువు 840 గ్రాములు మాత్రమే ఉంటుంది. కాబట్టి ల్యాప్‌టాప్ బ్యాగ్, బ్యాక్‌ప్యాక్‌లో పెట్టుకుని ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు.
ధర : రూ. 1,499