
తాతయ్య గొప్ప నటుడు.. తల్లిదండ్రులు మాత్రం నటిస్తానంటే ఒప్పుకోలేదు. చిన్నప్పుడు భరతనాట్యం నేర్పించినా కళారంగం వైపు వెళ్లనివ్వలేదు. అప్పుడు ‘ఒక్క చాన్స్ ఇవ్వండి.. నేనేంటో చూపిస్తానంటూ’ ముందడుగు వేసింది. నచ్చిన రంగంలో తన సత్తా చూపించి.. ప్రేక్షకులతోపాటు పేరెంట్స్ ప్రశంసలు కూడా అందుకుంది. అప్పటినుంచి ఇప్పటివరకు గ్లామరస్ హీరోయిన్‌గానే కాకుండా చాలెంజింగ్ రోల్స్ ఎంచుకుంటూ తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది ఈ తమిళ అమ్మాయి.. తాన్యా రవిచంద్రన్. తెలుగు, తమిళంలో రకరకాల పాత్రల్లో మెప్పించిన ఆమె ప్రస్తుతం ‘మయసభ’లో మరో కొత్త రోల్లో కనిపించింది.
మలేసియాలో పుట్టిన రవిచంద్రన్ ఇండియాకి వచ్చి స్థిరపడ్డాడు. తమిళ ఇండస్ట్రీలో యాక్టర్‌గా మంచిపేరు తెచ్చుకున్నాడు. ఆయన మనవరాలే తాన్యా రవిచంద్రన్. తల్లి లావణ్య, తండ్రి శ్రీరామ్. తాన్యా తాతయ్య సినిమాలు చూసి పెరగడం వల్ల చిన్నప్పటి నుంచే సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉండేది. పైగా వాళ్లమ్మ క్లాసికల్ డ్యాన్సర్ కావడంతో ఆడపిల్లలు ఇద్దరికీ భరతనాట్యం నేర్పించింది. వాళ్లలో పెద్దమ్మాయి అపరాజిత, చిన్నమ్మాయే తాన్య. ఇద్దరు అక్కచెల్లెళ్లు టీనేజీలో ఉన్నప్పుడు చెన్నైలో రెగ్యులర్‌గా స్టేజీ షోల్లో పార్టిసిపేట్ చేసేవారు. అలాగని చదువు పక్కన పెట్టలేదు. ఆ తర్వాత తనకు నచ్చిన రంగంలో రాణించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది.
ఆ జర్నీ గురించి.. ‘‘చిన్నప్పటి నుంచి నాకు యాక్టింగ్ అంటే ఇష్టం ఉండేది. కానీ, మా పేరెంట్స్ పీజీ పూర్తయ్యేవరకు ఏం చేయడానికి వీల్లేదని చెప్పేశారు. కానీ, పీజీకంటే ముందే నాకు ఆఫర్లు వచ్చాయి. మొదటిసారి అవకాశం ఎలా వచ్చిందంటే.. మా కజిన్ సిస్టర్ షార్ట్ ఫిల్మ్‌లో ఒక రోల్ చేయాల్సి ఉంది. కానీ, తనకు వేరొక పని ఉండడం వల్ల కుదరలేదు. దాంతో ఆరోజు నాకు ఫోన్ చేసి నువ్వు చేస్తావా? అని అడిగింది. నాకు మొదట్నించీ నటించాలనే ఉత్సాహం ఉండడంతో వెంటనే చేస్తానని చెప్పా. కానీ, ఇంట్లో వాళ్లు మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. నాన్న నా మాట వినలేదు. అప్పుడు మా అమ్మతో.. ఒక్కసారి ట్రై చేస్తా. నచ్చకపోతే వదిలేస్తా అని చెప్పా. అయినా వాళ్లు ఒప్పుకోకపోవడంతో చెప్పకుండానే షూటింగ్‌కి వెళ్లాను. ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయి అందరూ నన్ను మెచ్చుకుంటూ మా పేరెంట్స్‌కు ఫోన్ చేసి చెప్పారు. అలా వాళ్లు కూడా నా యాక్టింగ్‌ని స్క్రీన్‌పై చూసి నా ఇంట్రెస్ట్ ఇదే అని అర్థం చేసుకున్నారు. దాని తర్వాత షార్ట్ఫిల్మ్స్లో చాన్స్‌లు వచ్చాయి. నా ఇంట్రెస్ట్ చూసి నటనకు మళ్లీ అడ్డుచెప్పలేదు. అలా ఫ్రెండ్స్‌తో షార్ట్ ఫిల్మ్స్‌లో చేసేదాన్ని. నేను సపరేట్గా ఫొటోషూట్లు చేసుకునేదాన్ని” అంది తాన్య.
కెరీర్ మొదలైంది
2016లో మొదటిసారి సినిమాకు ఆడిషన్ ఇచ్చింది. దాంట్లో సెలక్ట్ అవ్వడంతో సినిమాలో నటించింది. ఆ సినిమాతోనే తన పేరు కూడా మారిపోయింది. స్టేజీ షోలు చేసేటప్పుడు అభిరామి శ్రీరామ్‌గా ఉన్న ఆమె పేరు యాక్టింగ్ కెరీర్లోకి వచ్చాక తొలి డైరెక్టర్ మిస్కిన్ తాన్యా రవిచంద్రన్‌గా మార్చారు. అప్పటికే ఆ పేరుతో మరో యాక్ట్రెస్ ఉండడంతో తన పేరు మార్చినట్టు చెప్పిందామె. అయితే, ఆ సినిమా వాయిదా పడడంతో ఆడిషన్లో సెలక్ట్ అయిందని తెలిసి మరో డైరెక్టర్ అవకాశమిచ్చాడు. ఆయనే రాధామోహన్, ‘బృందావనమ్’ సినిమాలో హీరోయిన్గా విజయ్ సేతుపతి పక్కన నటించింది. తన మొదటి సినిమా షూటింగ్ మంచి ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చిందని చెప్పింది. ఆ సినిమాకోసం తీసిన స్టిల్స్ చూసి అదే టైంలో మరో సినిమా ‘బల్లె వెల్లైయాతెవా’లో ఆమెకు మరో అవకాశం వచ్చింది.
పాత్రల గురించి..
‘‘నాకు పాత్ర నచ్చితే స్ర్కీన్ టైం ఎంత ఉందనేది ఆలోచించను. ఆ పాత్ర నాకు సూట్ అవుతుంది అనిపిస్తే .. స్టోరీ ఇంట్రెస్టింగ్గా ఉంటే సినిమా ఒప్పుకుంటా. ఒకేలాంటి రోల్స్ కాకుండా ఒక యాక్టర్‌గా వెరైటీ పాత్రలన్నీ ట్రై చేయాలనుకుంటున్నా. నాకు వచ్చే పాత్రలను బట్టి నా యాక్టింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఉదాహరణకు ‘బృందావనమ్’లో నేను ‘సంధ్య’ అనే పాత్రలో నటించా. అందులో నా పాత్ర సైన్ లాంగ్వేజ్ (సైగలతో) పర్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. అందుకోసం ఆ లాంగ్వేజ్ ప్రాక్టీ చేశా. అలాగే ‘కరుప్పన్’ అనే సినిమాలో నా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి? మాట తీరు ఎలా ఉండాలనేది డైరెక్టర్‌కి క్లారిటీ ఉంది. దాంతో నేను ఆయన చెప్పినట్టు చేశా. డబ్బింగ్లోనూ కొంచెం జాగ్రత్త తీసుకున్నా. అలానే వచ్చిన ప్రతి పాత్రకు దానికి తగ్గట్టు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం లేదా కొత్తగా ఏదైనా నేర్చుకోవడం వంటివి చేస్తా. ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో తాత పేరు పోగొట్టకూడదని బాగా ఒత్తిడికి గురయ్యా. నా లక్ష్యం ఏంటంటే.. మంచి సినిమాల్లో మంచి పాత్రల్లో స్టార్ అనిపించుకోవడం. ఎప్పటికైనా అలా పేరు తెచ్చుకుంటాననే నమ్మకం బలంగా ఉంది.’’
తెలుగులో మరిన్ని..
నేను ఇండస్ట్రీలోకి వస్తానని మా తాతగారికి తెలియదు. నేను సినిమాల్లోకి రాకముందే ఆయన చనిపోయారు. యాక్ట్రెస్‌గా నాకు ఇన్‌స్పిరేషన్ మా తాతగారే. సినిమాలు చేయడం వల్ల నాకు సహనంగా ఉండడం అలవాటైంది. యాక్టర్ అవ్వాలనే ఆలోచన నా జీవితాన్నే మార్చేసింది. ఏదైనా సినిమా బాగుంది అని చెప్తే.. ఏ భాష అయినా చూస్తాను. తెలుగులో మొదటి సినిమా ‘రాజా విక్రమార్క’లో చేసేటప్పుడు స్క్రిప్ట్ నాకు ఇంగ్లిష్‌లో కూడా ఇచ్చేవాళ్లు. సెట్స్‌కి వెళ్లేముందు రోజు డైలాగ్స్ రిహార్సల్స్ చేసేదాన్ని. కో- యాక్టర్‌తో కలిసి ప్రాక్టీస్ చేయడం నాకు హెల్ప్ అయింది. తెలుగులో మరెన్నో సినిమాలు లేదా సిరీస్‌ల్లో నటించాలనుంది.
చిరంజీవి చెల్లిగా..
‘గాడ్ ఫాదర్’ సినిమా స్క్రిప్ట్ నా దగ్గరకి వచ్చినప్పుడు చిరంజీవి చెల్లెలి రోల్ అని చెప్పారు. ఆ మాట వినగానే ఇంకేం మాట్లాడకుండా నేను ఒప్పుకున్నాను. ఆయనతో సినిమాలో నటిస్తున్నందుకు చాలా ఎగ్జైట్ అయ్యా. ఆ సినిమాలో నా పాత్ర కొత్తగా, చాలెంజింగ్‌గా కూడా ఉంది. షూటింగ్ టైంలో డైరెక్టర్ నాకు ఏ డౌట్ వచ్చినా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఆ విధంగా నాకు యాక్టింగ్ ఈజీ అయింది.