ఢిల్లీ లిక్కర్​ పాలసీ కేసులో సుప్రీంకు కేజ్రీవాల్​

ఢిల్లీ లిక్కర్​ పాలసీ కేసులో సుప్రీంకు కేజ్రీవాల్​
  • అత్యవసరంగా విచారించాలన్న విజ్ఞప్తిపై స్పందించని కోర్టు 
  • ఈమెయిల్​ పంపితే పరిశీలిస్తామన్న సీజేఐ ​ 
  • ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్​కు మరో ఎదురు దెబ్బ
  • లాయర్లను ఎక్కువసార్లు కలిసేందుకు నో చెప్పిన కోర్టు

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్​ పాలసీ కేసులో ఈడీ తనను అరెస్ట్​ చేయడాన్ని సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఢిల్లీ సీఎం, ఆమ్​ ఆద్మీ పార్టీ (ఆప్​) జాతీయ కన్వీనర్ అర్వింద్​ కేజ్రీవాల్​సుప్రీంకోర్టులో సవాల్​ చేశారు. బుధవారం ఉదయం ఆయన తరఫు న్యాయవాది అభిషేక్​ మను సింఘ్వీ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్​ దాఖలు చేశారు. తమ క్లయింట్​ పిటిషన్​పై అత్యవసర విచారణ జరపాలని కోరగా, కోర్టు నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. గురువారం విచారణకు అనుమతిస్తారా  లేదా? చెప్పేందుకు న్యాయస్థానం నిరాకరించింది. అయితే, తనకు ఈ మెయిల్​ ద్వారా అభ్యర్థన పంపిస్తే పరిశీలిస్తానని అభిషేక్​ సింఘ్వీకి సీజేఐ డీవై చంద్రచూడ్​ సూచించారు.

హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్.. 

ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్​ చేస్తూ కేజ్రీవాల్​ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, మంగళవారం ఆయన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. ఈడీ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, అందుకే పిటిషన్​ను కొట్టివేస్తున్నట్టు న్యాయస్థానం పేర్కొంది. సీఎంకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయం ఉండదని తేల్చిచెప్పింది. కోర్టులు రాజ్యాంగ నైతికతకు సంబంధించినవి కానీ.. రాజకీయ నైతికతకు కాదని తెలిపింది. మనీలాండరింగ్​పై ఈడీ ఆధారాలు చూపించిందని పేర్కొంది. దీంతో ఢిల్లీ హైకోర్టు తీర్పును అర్వింద్​ కేజ్రీవాల్​ సుప్రీంకోర్టులో సవాల్​ చేశారు.

మరో పిటిషన్​ను తోసిపుచ్చిన ఢిల్లీ హైకోర్టు

ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్​కు మరో ఎదురుదెబ్బ తగిలింది. సీఎంగా విధులకు సంబంధించి చర్చించేందుకు వారానికి ఐదుసార్లు లాయర్లను కలిసేందుకు అవకాశం ఇవ్వాలని కేజ్రీవాల్ మరో పిటిషన్ వేశారు. దీనికి ఈడీ అభ్యంతరం తెలిపింది. ఇది జైలు మ్యానువల్​​కు వ్యతిరేకమని వాదించింది. ఆయనకు ఇప్పటికే లాయర్లను కలిసేందుకు రెండుసార్లు అవకాశమిస్తున్నట్టు కోర్టుకు వెల్లడించింది. కేజ్రీవాల్​ జైలునుంచి ప్రభుత్వాన్ని నడపాలనుకుంటున్నందున ప్రత్యేక అధికారాలు కల్పించొద్దని కోర్టును కోరింది. ఈడీ వాదనలతో ఏకీభవించిన స్పెషల్ జడ్జి కావేరి బవేజా.. కేజ్రీవాల్​కు ఈ విషయంలో రిలీఫ్​ ఇవ్వడానికి తగిన కారణాలు లేవంటూ పిటిషన్​ను కొట్టేశారు. 

కేజ్రీవాల్​కు జైలు మాన్యువల్​

అర్వింద్​ కేజ్రీవాల్ విజ్ఞప్తి మేరకు ఆయనకు జైలు మాన్యువల్ అందజేసినట్టు అధికారులు వెల్లడించారు. జైలులో ఉన్న వారు లైబ్రరీలో ఉన్న ఏ పుస్తకాన్నైనా చదవొచ్చని తెలిపారు. ఆయన సెల్​లో తరుచూ పుస్తకాలు చదువుతూ.. కుర్చీలో కూర్చొని రాసుకుంటూ కనిపిస్తున్నారని తెలిపారు. ఆయన జైలు 
మాన్యువల్ ను కూడా చదివారని పేర్కొన్నారు.

తీహార్​ జైలునుంచి కేజ్రీవాల్ మరో​ సందేశం

తీహార్​ జైలునుంచి ఆప్​ నేతలకు అర్వింద్​ కేజ్రీవాల్  మరో సందేశాన్ని ఇచ్చారు. ఏప్రిల్​ 14 న రాజ్యాంగ నిర్మాత డాక్టర్​ బీఆర్​ అంబేద్కర్​ జయంతి సందర్భంగా ‘సంవిధాన్​ బచావో.. తనషాహీ హఠావో దివస్’​(రాజ్యాంగాన్ని పరిరక్షించండి.. నియంతృత్వాన్ని నిర్మూలించండి)ను  నిర్వహించాలని కేజ్రీవాల్​ఆదేశించినట్టు ఆప్​ నేతలు తెలిపారు. అలాగే, ఢిల్లీ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆప్​ ఎమ్మెల్యేలు, వలంటీర్లు పనిచేయాలని కేజ్రీవాల్​ ఆదేశించినట్టు ఆ పార్టీ నేత గోపాల్​ రాయ్​మీడియాకు వెల్లడించారు. దేశంలో నియంతృత్వాన్ని ఎదుర్కొనేందుకు ఎంత హింసనైనా భరించేందుకు ఆప్​ సిద్ధంగా ఉన్నదని కేజ్రీవాల్​ తెలిపారన్నారు. కాగా, కేజ్రీవాల్​అరెస్ట్​ను నిరసిస్తూ అమెరికా, కెనడా, యూకే, ఐర్లాండ్, ఆస్ట్రేలియాలోని ఆప్​ వలంటీర్లు ఆయా దేశాల్లోని ఇండియా ఎంబసీల వద్ద ఆందోళన చేపట్టారు.