లిక్కర్ స్కామ్​లో కవితనే కింగ్ పిన్

లిక్కర్ స్కామ్​లో కవితనే కింగ్ పిన్


    ఆప్ నేతలతో కుమ్మక్కై లిక్కర్ పాలసీ రూపకల్పన
    రూ.100 కోట్ల ముడుపులు చెల్లింపు
    ఆధారాలు లేకుండా చేసేందుకు ఫోన్లు ధ్వంసం
    ఎవిడెన్స్ లు చూపెట్టినా బుకాయించడంతో అరెస్టు   
    14 పేజీల అరెస్టు కాపీలో ఈడీ వెల్లడి 

న్యూఢిల్లీ, వెలుగు: లిక్కర్ స్కామ్​లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితనే కింగ్ పిన్​గా, ప్రధాన కుట్రదారుగా, లిక్కర్ పాలసీలో ప్రధాన లబ్ధిదారుగా ఉన్నారని ఈడీ తెలిపింది. ఆప్ ముఖ్య నేతలతో కుమ్మక్కైన కవిత... శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ, మాగుంట శ్రీనివాసులురెడ్డితో పాటు సౌత్ గ్రూపుకు ప్రాతినిధ్యం వహించారని చెప్పింది. లిక్కర్ పాలసీ ద్వారా భారీ ఎత్తున లబ్ధి పొందేందుకు రూ.100 కోట్లు ముడుపులు చెల్లించారని వెల్లడించింది. ఇందుకోసం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ మంత్రి మనీశ్ సిసోడియాతో కవిత అగ్రిమెంట్ కుదుర్చుకున్నారని పేర్కొంది.

సౌత్ గ్రూప్ సభ్యులతో కలిసి దళారుల ద్వారా ముడుపులు ముట్టజెప్పారని తెలిపింది. అందువల్లనే ఆప్ నేతలు ముందుగానే కవితకు లిక్కర్ పాలసీ వివరాలు అందజేశారని చెప్పింది. కవిత అరెస్టుకు సంబంధించి కోర్టుకు సమర్పించిన 14 పేజీల రిపోర్టులో ఈడీ కీలక విషయాలను వెల్లడించింది. లిక్కర్ పాలసీ రూపకల్పన, దీనిపై దాఖలైన కేసు, ఈ స్కామ్​లో ప్రమేయం ఉన్నోళ్ల వివరాలు, దర్యాప్తు సంస్థల విచారణ, పలువురి స్టేట్మెంట్లు, చేతులు మారిన రూ.100 కోట్ల ముడుపుల వివరాలను ఇందులో పేర్కొంది. మొత్తం 18 అంశాలను రిపోర్టులో పొందుపరిచిన ఈడీ.. పలువురు నిందితుల నుంచి వాంగ్మూలం, వాట్సాప్ చాట్స్ సేకరించామని, వాటి ఆధారంగా కవితను విచారించామని తెలిపింది. అయితే ఆ ఆధారాలపై బుకాయించడంతోనే ఆమెను అరెస్ట్ చేశామని తెలిపింది. 

ఆప్ ప్రతినిధిగా విజయ్ నాయర్.. 

శరత్ చంద్రా రెడ్డి, సమీర్ మహేంద్రు, దినేశ్ అరోరా, అరుణ్ రామచంద్ర పిళ్లై, వి.శ్రీనివాస్, బుచ్చిబాబు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవ తదితరులు ఇచ్చిన స్టేట్ మెంట్ల ఆధారంగా రూ.100 కోట్ల ముడుపులు ఇచ్చినట్టు నిర్ధారణకు వచ్చామని ఈడీ తెలిపింది. ‘‘లిక్కర్ వ్యాపారం చేసుకునేందుకు సహకరిస్తే రూ.100 కోట్లు చెల్లిస్తామని ఆప్ ముఖ్య నేతలకు కవిత చెప్పారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్​ను 2021 మార్చి 16న తన ఆఫీసులో కలిసినప్పుడు ఈ అంశాన్ని వివరించారు” అని చెప్పింది. ‘‘హైదరాబాద్​లో కవితను కలిసినప్పుడు సౌత్ గ్రూప్ నుంచి చెల్లించాల్సిన రూ.100 కోట్లలో రూ.50 కోట్లు సీఏ గోరంట్ల బుచ్చిబాబుకు ఇవ్వాలని ఆమె చెప్పినట్టు మాగుంట తెలిపారు. 

సమీర్ మహేంద్రు కూడా కవిత పాత్ర గురించి వెల్లడించారు. కవిత, మాగుంట, శరత్ చంద్రారెడ్డి మొత్తం పెట్టుబడి పెడుతున్నట్టు పిళ్లై తనకు చెప్పినట్టు ఆయన తెలిపారు” అని పేర్కొంది. కవితకు వ్యతిరేకంగా 11.11.2022, 16.02.23లో పిళ్లై ఇచ్చిన స్టేట్ మెంట్లను రిపోర్టులో పేర్కొన్న ఈడీ.. ఇండో స్పిరిట్ లో భాగస్వామిగా ఉన్న కవిత రూ.100 కోట్లు ఆప్ నేతకు అందజేశారని తెలిపింది. అలాగే కవిత ఫ్యామిలీ ఫ్రెండ్, రిలేటీవ్ వి.శ్రీనివాస్ ఇచ్చిన వాంగ్మూలంతో పాటు గోరంట్ల బుచ్చిబాబు స్టేట్మెంట్ ను అటాచ్ చేసింది. కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా తరఫునే ఆప్ నేత విజయ్ నాయర్ పాల్గొన్నట్లు బుచ్చిబాబు అంగీకరించారని తెలిపింది. 

ఇండో స్పిరిట్ లో కవిత తరఫున అరుణ్ పిళ్లై భాగస్వామిగా ఉన్నారని పేర్కొంది. అందుకు సంబంధించి అరుణ్ పిళ్లై, బుచ్చిబాబు, శ్రీనివాస్, కవిత, విజయ్ నాయర్ మధ్య సాగిన చాట్స్ వివరాలను అటాచ్ చేసింది. దేశంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారుల్లోనే ఒకటైన పెర్నార్డ్ రికార్డ్ ఇండియా పంపిణీ వ్యాపారంలో కూడా వాటాలు పొందారని పేర్కొంది.   

ఇండో స్పిరిట్స్ లో కవితకు 33 శాతం వాటా.. 

ఇండో స్పిరిట్ లో తనకు వాటానే లేదని కవిత బుకాయించారని ఈడీ పేర్కొంది. కానీ, కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు, మాగుంట రాఘవల మధ్య సాగిన  వాట్సాప్ చాట్ లో ఇండో స్పిరిట్స్ లో కవితకు 33 శాతం వాటా ఉందని తేలిందని తెలిపింది. ఈ చాట్స్ ను చూపిన తర్వాత కూడా కవిత బుకాయించారని చెప్పింది. దర్యాప్తును ఆలస్యం చేసేందుకు దురుద్దేశంతో సుప్రీంకోర్టులో ఆమె రిట్ పిటిషన్ దాఖలు చేశారని, తన ఫోన్లను బలవంతంగా లాక్కున్నారని తప్పుడు ప్రకటనలు చేశారని తెలిపింది. 2023 మార్చి 21న విచారణ సందర్భంగా 9 మొబైళ్లను తీసుకొచ్చిన కవిత.. వాటిని స్వయంగా చూపిస్తూ రాజకీయ ప్రచారం చేసుకున్నారని పేర్కొంది. ‘‘కవిత, ఆమె మాజీ ఆడిటర్ బుచ్చిబాబు మధ్య జరిగిన చాట్ వివరాలు సేకరించాం. అందులో ‘నేను, అభిషేక్, గౌతం నిన్న కలిశాం. 30 శాతానికి బదులు 45 శాతం ఇవ్వమని గౌతంకు చెప్పాను. మళ్లీ శుక్రవారం కలుస్తున్నాం’ అని కవిత ఈ చాట్ లో బుచ్చిబాబుకు చెప్పినట్టు ఉంది” అని తెలిపింది. 

ఫోన్లు ధ్వంసం చేసి డేటా ఫార్మాట్..  

కవిత వాడిన ఫోన్ (8008666666) లోని ఎవిడెన్స్ ను ధ్వంసం చేశారని ఈడీ తెలిపింది. ఆమె సమర్పించిన ఫోన్లో ఎలాంటి డేటా లేదని చెప్పింది. మిగిలిన 9 ఫోన్లలో కూడా డేటా ఫార్మాట్ చేశారని, అందులోని సమాచారం ఏమైందని అడిగితే కవిత సమాధానం ఇవ్వలేదని పేర్కొంది. 2023 మార్చి 11న సమన్లను జారీ చేసిన తర్వాతే ఇందులో నాలుగు ఫోన్లను ఫార్మాట్ చేసినట్టు ఫోరెన్సిక్ పరీక్షలో తేలిందని వెల్లడించింది. ‘‘మేం సేకరించిన సమాచారం మేరకు మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 3 కింద కవితను నేరస్థురాలుగా నిర్ధారించాం. ఆమెను సెక్షన్ 19 ప్రకారం అరెస్టు చేసే అధికారం మాకుంది. ఈ రైట్స్ తోనే ఈడీ ఆఫీసర్లు తుమ్మోజీ వరలక్ష్మీ,  డిప్యూటీ డైరెక్టర్ భానుప్రియ మీనా సమక్షంలో మార్చి 15 న సాయంత్రం 5.20 నిమిషాలకు కవితను హైదరాబాద్ లోని ఆమె నివాసంలో అరెస్ట్ చేశాం” అని ఈడీ పేర్కొంది.

ఢిల్లీ లిక్కర్​ స్కామ్​ కేసులో ఇప్పటి వరకు అరెస్టులు

ఈడీ అరెస్టులు:

1. సమీర్ మహేంద్రు, ఇండో స్పిరిట్స్ సంస్థ యజమాని (2022 సెప్టెంబర్ 28)
2. పి.శరత్ చంద్రా రెడ్డి, అరబిందో గ్రూప్ - ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ (2022 నవంబర్ 11) 
3. బినొయ్ బాబు, పెర్నార్డ్ రిచర్డ్ కంపెనీ ప్రతినిధి (2022 నవంబర్ 11)
4. అభిషేక్ బోయినపల్లి, హైదరాబాద్ వ్యాపారి (2022 నవంబర్ 13)
5. విజయ్ నాయర్, ఆప్ మీడియా ఇంచార్జ్ (2022 నవంబర్ 13)
6. అమిత్ అరోరా, బడ్డీ రిటెయిల్ సంస్థ డైరెక్టర్, (2022 నవంబర్ 29)
7. గౌతమ్ మల్హోత్రా, మద్యం వ్యాపారి (2023 ఫిబ్రవరి 8)
8. రాజేష్ జోషి, చారియట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి (2023 ఫిబ్రవరి 9)
9. మాగుంట రాఘవ, మద్యం వ్యాపారి (2023 ఫిబ్రవరి 11)
10. అమన్ దీప్ ధల్, బ్రిండ్ కో సేల్స్ డైరెక్టర్ (2023 మార్చి 2)
11.అరుణ్ పిళ్లై, మద్యం వ్యాపారి (2023 మార్చి 7)
12. మనీశ్​ సిసోడియా, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి (2023, ఫిబ్రవరి 26)
14. సంజయ్ సింగ్ (అక్టోబర్ 4,2023)
15. కల్వకుంట్ల కవిత, బీఆర్ఎస్​ ఎమ్మెల్సీ (2024 మార్చి 15)
సీబీఐ అరెస్టులు:
1. విజయ్ నాయర్, ఆప్​ మీడియా ఇన్​చార్జ్​, ఓన్లీ మచ్ లౌడర్ సంస్థ యజమాని (2022 సెప్టెంబర్ 27)
2. అభిషేక్ బోయినపల్లి, రాబిన్ డిస్టిలరీస్‌‌లో డైరెక్టర్ (2022 అక్టోబర్ 10)
3. గోరంట్ల బుచ్చిబాబు, కవిత మాజీ ఆడిటర్ (2023 ఫిబ్రవరి 8)
4. మనీశ్​ సిసోడియా, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి (2023 ఫిబ్రవరి 26)
5. అమన్ దీప్ ధల్, బ్రిండ్ కో సేల్స్ డైరెక్టర్(2023 ఏప్రిల్ 18)
6. దినేశ్ అరోరా, బడ్డీ రిటెయిల్ సంస్థ డైరక్టర్ (అప్రూవర్‌‌గా మారిన నిందితుడు.. ప్రస్తుతం బెయిల్​పై ఉన్నడు)
ఇదే కేసులో పలువురిని ఈడీ, సీబీఐ అరెస్ట్ చేసినా... బెయిల్ పై బయట ఉన్నారు.