మనీశ్​ సిసోడియా బెయిల్​పై తీర్పు రిజర్వ్

మనీశ్​ సిసోడియా బెయిల్​పై తీర్పు రిజర్వ్

న్యూఢిల్లీ, వెలుగు: లోక్ సభ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్​ సిసోడియా దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ పై తీర్పును రౌస్ ఎవెన్యూ కోర్టు రిజర్వ్​ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న తనకు సీబీఐ, ఈడీ కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఈ ఏడాది ఫిబ్రవరిలో సిసోడియా ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్​పై శనివారం సీబీఐ స్పెషల్ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా విచారణ చేపట్టారు. సిసోడియా తరఫున సీనియర్ అడ్వొకేట్ వివేక్ జైన్ ​వాదనలు వినిపిస్తూ.. సిసోడియా పిటిషన్ ఫిబ్రవరి నుంచి కోర్టు ముందు ఉందన్నారు. ఈ పిటిషన్ పై విచారణ ముగించి, మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. 

సీబీఐ, ఈడీ అభ్యంతరం

సిసోడియా తరఫు లాయర్​ వాదనలపై సీబీఐ, ఈడీ తరపు అడ్వొకేట్లు అభ్యంతరం తెలిపారు. ‘అవినీతి.. సమాజానికి క్యాన్సర్ అని గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్’ చేసిన కామెంట్స్ ను కోట్ చేశారు. సిసోడియాకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేయవచ్చని, గతంలో కూడా సిసోడియా బెయిల్ పిటిషన్ కొట్టివేసినట్టు తెలిపారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం.. తీర్పును ఈ నెల 30వ తేదీకి రిజర్వ్ చేస్తున్నట్టు వెల్లడించింది. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిరుడు ఫిబ్రవరి 26న సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. సిసోడియా తీహార్ జైలు జ్యుడీషియల్ కస్టడీలో ఉండగానే.. నిరుడు మార్చి 9న ఈడీ ఆయన్ను అదుపులోకి తీసుకున్నది. దీంతో సిసోడియా 14 నెలలుగా తీహార్ జైల్లో ఉన్నారు.