- జంతర్ మంతర్‌లోకి చొరబడటంతో సౌరవ్ దాస్, అశుతోష్ రంకా అరెస్టు
న్యూఢిల్లీ, వెలుగు: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలకు ఢిల్లీ ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (ఎస్ఈఎం) కోర్టు ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్దకు నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై వీరిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం వీరిని కోర్టులో హాజరుపరచగా ఐదు రోజుల కస్టడీ విధిస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
అయితే, ఇదే కేసులో మరో నేత అజింక్య షిండే వ్యక్తిగత పూచీకత్తుపై రిలీజ్ అయ్యారు. జంతర్‌మంతర్‌ను నిరసన ప్రదర్శనల జాబితా నుంచి తొలగించిన మరుసటి రోజైన అక్టోబర్ 13న సీజేపీ నేతలు అక్కడికి వెళ్లేందుకు యత్నించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. జాతీయ జెండాలతో బారికేడ్లు దాటి జంతర్‌మంతర్‌కు చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న వారిని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు.
అనుమతి లేకుండా గుంపుగా సమావేశమవడం, ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించడం వంటి ఆరోపణలపై పోలీసులు వీరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం బుధవారం ఉదయం ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.
సీజేపీ రాహుల్ గాంధీ మద్దతు
సీజేపీ నేతల అరెస్ట్‌ను లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. సీజేపీకి బహిరంగంగా మద్దతు ప్రకటించారు. ఈమేరకు ‘ఎక్స్’లో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘జంతర్ మంతర్ వద్ద జాతీయ జెండాను చేతబూని శాంతియుతంగా నిరసన తెలపడం నేరం కాదు. ఆ కారణంతో యువతను జైళ్లలో పెట్టడం పిరికిపంద చర్య.
విద్యార్థులు, యువకులు, పాత్రికేయులు, ఇండియా కూటమిల జెండాలు వేర్వేరు కావచ్చు. కానీ గమ్యం ఒక్కటే. రాజ్యాంగ హక్కుల కోసం పౌరులందరూ చేస్తున్న పోరాటమే ఇది’’ అని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ మద్దతు ప్రకటించడంతో సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కృతజ్ఞతలు తెలిపారు.
