బ్లూడ్రమ్ మర్డర్ నిందితులకు ఉరి..మీరట్ జిల్లా కోర్టు సంచలన తీర్పు

బ్లూడ్రమ్ మర్డర్ నిందితులకు ఉరి..మీరట్ జిల్లా కోర్టు సంచలన తీర్పు
  •     తప్పుచేసిన వాళ్లను శిక్షించడమూ ధర్మమేనన్న మెజిస్ట్రేట్​

మీరట్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీరట్ బ్లూడ్రమ్ కేసులో నిందితులు ఇద్దరికీ జిల్లా మెజిస్ట్రేట్ కోర్టు మరణశిక్ష విధించింది. దీంతోపాటు హత్యా నేరం కింద రూ.50,000, సాక్ష్యాలను ధ్వంసం చేసినందుకు రూ.20,000 చొప్పున చెల్లించాలని కోర్టు ఆదేశించింది. దాదాపు 13 నెలల పాటు విచారణ జరిపిన న్యాయస్థానం.. 126 వాయిదాలలో 22 మంది సాక్షుల వాంగ్మూలాలను పరిగణలోకి తీసుకుంది. 

బలమైన ఫోరెన్సిక్ సాక్ష్యాల ఆధారంగా సెప్టెంబర్ 30వ తేదీనే ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాలను దోషులుగా తేల్చింది. తాజాగా బుధవారం తీర్పు వెలువరిస్తూ.. ఇది అత్యంత అరుదైన వాటిలోకెల్లా అరుదైన కేసు అన్న ప్రాసిక్యూషన్ వాదనతో ఏకీభవిస్తున్నట్లు జడ్జి పేర్కొన్నారు. ఇలాంటి కేసులు సమాజంలో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తాయని వ్యాఖ్యానించారు. భగవద్గీతను ఉదహరిస్తూ.. తప్పు చేసిన వారిని శిక్షించడమూ ధర్మమేనని పేర్కొన్నారు. సౌరవ్​ను హత్య చేసేందుకు నిందితులు ఇద్దరూ పక్కా ప్రణాళిక ప్రకారమే వ్యవహరించారని, శిక్ష నుంచి తప్పించుకునేందుకు మృతదేహాన్ని మాయం చేసే ప్రయత్నం చేశారని నిర్ధారణకు వచ్చినట్లు కోర్టు తెలిపింది.

ఏంటీ బ్లూడ్రమ్ మర్డర్..?

మీరట్​కు చెందిన మర్చెంట్ నేవీ ఆఫీసర్ సౌరవ్ రాజ్ పుత్ 2025 మార్చి 3న దారుణ హత్యకు గురయ్యారు. ఆయన భార్య ముస్కాన్ రస్తోగి తన ప్రియుడితో కలిసి ఈ దారుణానికి తెగబడింది. ఆహారంలో మత్తుమందు కలిపి పెట్టడంతో సౌరవ్ మత్తులోకి జారాడు.. అనంతరం రస్తోగి తన ప్రియుడు సాహిల్ శుక్లాతో కలిసి కత్తితో పొడిచి భర్తను చంపేసింది. మృతదేహాన్ని ముక్కలుగా నరికి బ్లూ డ్రమ్ములో పెట్టి సిమెంట్​తో కప్పేశారు. ఆపై భర్త ఊరెళ్లాడని చుట్టుపక్కల వాళ్లను నమ్మించిన రస్తోగి.. మరుసటి రోజే ప్రియుడితో కలిసి హిమాచల్ ప్రదేశ్​వెళ్లింది. సౌరవ్​ ఫోన్ చేయకపోవడం, తాము చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఆయన బంధువులు సందేహించారు. పోలీసులను ఆశ్రయించి మార్చి 17న తాళం పగలకొట్టి ఇంట్లోకి వెళ్లడంతో హత్య విషయం బయటపడింది. విచారణలో ముస్కాన్ రస్తోగి, సాహిల్ శుక్లాలే సౌరవ్ ను హత్య చేశారని గుర్తించిన పోలీసులు.. షిమ్లాలో దాక్కున్న నిందితులు ఇద్దరినీ అరెస్టు చేసి జైలుకు తరలించారు.