ఎయిర్ ఇండియా ప్లైట్‌‌‌‌కు హైజాక్ అలర్ట్..జైపూర్‌‌‌‌‌‌‌‌ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్

ఎయిర్ ఇండియా ప్లైట్‌‌‌‌కు హైజాక్ అలర్ట్..జైపూర్‌‌‌‌‌‌‌‌ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్

ఫ్రాంక్‌‌‌‌ఫర్ట్: జర్మనీలోని ఫ్రాంక్‌‌‌‌ఫర్ట్ నుంచి ఢిల్లీకి బయల్దేరిన ఎయిరిండియా విమానం (ఏఐ 2030) హైజాక్ హెచ్చరికల నేపథ్యంలో బుధవారం ఉదయం రాజస్తాన్‌‌‌‌లోని జైపూర్ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టుకు దారి మళ్లించారు. భారతీయ గగనతలంలోకి ప్రవేశించే సమయంలో విమాన పైలట్ ట్రాన్స్‌‌‌‌పాండర్ ద్వారా స్క్వాక్ కోడ్ 7500 (అంతర్జాతీయంగా హైజాక్ లేదా అపహరణ యత్నాన్ని సూచించే కోడ్)ను పంపడంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) తక్షణమే అప్రమత్తమైంది. భద్రతా చర్యల్లో భాగంగా విమానాన్ని జైపూర్‌‌‌‌కు మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేయించారు. 

ప్లైట్ ల్యాండ్ అయిన వెంటనే సీఐఎస్‌‌‌‌ఎఫ్ బలగాలు, బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగాయి. విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించి, ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించి తనిఖీలు చేపట్టారు. ప్లైట్‌‌‌‌తో పాటు ప్రయాణికుల లగేజీని కూడా సమగ్రంగా తనిఖీ చేసిన అనంతరం, అది పొరపాటుతో వచ్చిన హెచ్చరికగా భద్రతా దళాలు నిర్ధారించాయి. సాంకేతిక లోపం వల్ల లేదా పైలట్ పొరపాటున ఈ కోడ్ ప్రసారమై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా విమానాన్ని దారి మళ్లించినట్టు ఎయిర్ ఇండియా ప్రతినిధులు ఒక ప్రకటనలో వెల్లడించారు. భద్రతా ఏజెన్సీల నుంచి క్లియరెన్స్ లభించిన అనంతరం, ప్రయాణికులనుఅదే విమానంలో ఢిల్లీకి పంపించినట్టు చెప్పారు. ప్రస్తుతం ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ కొనసాగుతోంది.