న్యూఢిల్లీ, వెలుగు: దేశంలో కోట్లాది మంది ఓటర్ల పేర్లను అక్రమంగా తొలగించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ చేపట్టిన ‘ఓట్ చోరీ’ ఉద్యమాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్తామని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఫోరం కన్వీనర్ మల్లు రవి స్పష్టం చేశారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసేవరకు తమ ఉద్యమం ఆగదని తెలిపారు. సీఈసీ పదవి నుంచి దిగిపోతేనే తెరవెనుక ఉండి ఈ కుట్రకు పాల్పడిన అసలు వ్యక్తుల జాతకాలు బయటకొస్తాయన్నారు.
బుధవారం న్యూఢిల్లీ తెలంగాణ భవన్ లో మల్లు రవి మీడియాతో మాట్లాడారు. దేశంలో సుమారు 13 కోట్ల మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి అక్రమంగా తొలగించారని ఆరోపించారు. దీనివల్ల దేశంలో రెండు రకాల పౌరులు తయారయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ధర్నాచౌక్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలేనప్పుడు ఎందుకు రద్దు చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఆ ఒక్క వేదికను కూడా రద్దు చేస్తే, ఢిల్లీలో వందలాది జంతర్ మంతర్లు పుట్టుకొస్తాయని హెచ్చరించారు.
