
దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జూన్ 9న సాయంత్రం 7.15 గంటలకు ఆయనతో పాటు కేంద్ర మంత్రివర్గంలో మరికొందరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు, ప్రతిపక్ష సభ్యులు సహా పలువురు విదేశీ నేతలు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీస్ కమీషనర్ సంజయ్ అరోరా శుక్రవారం ఢిల్లీని నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించారు.
ఢిల్లీలో ఎలాంటి డ్రోన్, పారాగ్లైడింగ్, పారాజంపింగ్, రిమోట్ ఆపరేట్ చేసే ఏ రకమైన పరికరాలపైనా నిషేధం విధించారు. నేరస్థులు, సంఘవిద్రోహుల నుంచి సాధారణ ప్రజల భద్రతకు, ప్రముఖులకు ముప్పు కలిగించవచ్చని నివేదించబడిందని అరోరా ఉత్తర్వులో పేర్కొన్నారు.
పారా గ్లైడర్లు, పారా-మోటార్లు, హ్యాంగ్ గ్లైడర్లు, UAVలు, UASలు, మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్, రిమోట్‌గా పైలట్ చేయబడిన ఎయిర్‌క్రాఫ్ట్, హాట్ వంటి సబ్-కన్వెన్షనల్ ఏరియల్ ప్లాట్‌ఫారమ్‌లను ఎగురవేయడాన్ని ఢీల్లీలో నిషేధించారు. గాలి బుడగలు, చిన్న సైజుతో నడిచే విమానాలు, క్వాడ్‌కాప్టర్లు వంటివి నిషేధ సమయంలో ఢిల్లీ మీదుగా ఎగరడం భారత శిక్షాస్మృతిలోని 188 ప్రకారం శిక్షార్హమైనదని పేర్కొన్నారు. కాగా, న్యూఢిల్లీ ఇప్పటికే నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించింది. జూన్ 9, 10 తేదీల్లో రెండు రోజుల పాటు ఆంక్షలు విధించారు.
293 లోక్‌సభ స్థానాలు
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే, దాని మిత్ర పక్షాలు 293 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించాయి. ఇందులో బీజేపీ 240 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలవగా.. మిగిలిన సీట్లు మిత్రపక్షాలకు చెందినవి. దీంతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఎన్డీయే కూటమి 272 మార్జిన్‌ను సాధించింది.