ఫామ్​హౌస్​ లో డబ్బు దొరికిందన్న ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా

ఫామ్​హౌస్​ లో డబ్బు దొరికిందన్న ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా
  • ఫామ్​హౌస్​ ఎపిసోడ్​లో డబ్బు దొరికిందన్న ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా
  • మరి అంత భారీ మొత్తం ఎటుపోయింది..?
  • తెలంగాణ పోలీసులు ఎందుకు వెల్లడించలేదు..?
  • డబ్బు పట్టుబడిందని సిసోడియాకు చెప్పిందెవరు?
  • రాష్ట్రంలో రూ.కోట్ల కట్టలపైనే ఆసక్తికర చర్చ


హైదరాబాద్ / న్యూఢిల్లీ, వెలుగు: టీఆర్ఎస్‌‌ ఎమ్మెల్యేల ఫామ్‌‌హౌస్‌‌ ట్రాప్ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్​ సిసోడియా చేసిన కామెంట్లు సంచలనం రేపుతున్నాయి. తెలంగాణ ఎమ్మెల్యేలను కొంటూ బీజేపీ రెడ్ హ్యాండెడ్‌‌గా దొరికిందని, 100 కోట్ల రూపాయలతో ముగ్గురు బ్రోకర్లు హైదరాబాద్‌‌లో పట్టుబడ్డారని చెప్పారు. ఢిల్లీలో శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. పట్టుబడిన ముగ్గురికి బీజేపీ జాతీయ నేతలతో సంబంధాలున్నాయని, వీళ్లు మాట్లాడిన ఆడియో టేపులు కూడా బయటపడ్డాయని అన్నారు. ఢిల్లీలోనూ 43 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆడియోలు ఉన్నాయని చెప్పారు. సిసోడియా చెప్పినట్లుగా ఈ డీల్‌‌లో రూ.వంద కోట్లు పట్టుబడి ఉంటే.. ఆ డబ్బంతా ఏమైందనేది ఇప్పుడు హాట్​ టాపిక్‌‌గా మారింది. అంత భారీ మొత్తంలో నగదు దొరికితే తెలంగాణ పోలీసులు ఎందుకు వెల్లడించలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివరాలను కోర్టుకు ఎందుకు సమర్పించలేదనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. 

రూ.100 కోట్లు పట్టుబడ్డట్లు ఢిల్లీలో ఉన్న డిప్యూటీ సీఎంకు ఉప్పందించింది ఎవరనేది రాజకీయంగా ఆసక్తి రేపుతున్నది. ఆమ్ ఆద్మీ పార్టీలో సిసోడియా కీలక నేత. ఇటీవల ఢిల్లీలో సంచలనం రేపిన లిక్కర్ పాలసీ కేసులో ఆయన ప్రమేయముందనే ఆరోపణలున్నాయి. సీబీఐ, ఈడీ దర్యాప్తు కూడా జరుగుతోంది. ఇదే లిక్కర్ కేసులో తెలంగాణ లీడర్ల సంబంధాలతో పాటు ఎమ్మెల్సీ కవిత పేరు బయటపడింది. ఈ స్కామ్ తర్వాత ఢిల్లీ ప్రభుత్వానికి, టీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌కు సంబంధాలు బలపడ్డాయనే వాదనలు ఉన్నాయి.

డబ్బు ఎక్కడుంది?

సిసోడియా కామెంట్ల నేపథ్యంలో.. రెడ్​హ్యాండెడ్‌‌‌‌‌‌‌‌గా పట్టుబడ్డ రూ.100 కోట్లు ఏమయ్యాయి, ఎటు పోయాయనేది మిస్టరీగా మారింది. అసలు డబ్బు దొరికిందా లేదా అనే విషయాన్ని పోలీసు ఆఫీసర్లు ఇప్పటికీ రహస్యంగానే ఉంచారు. రూ.100 కోట్ల డీల్ జరిగిందని ఎఫ్ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నమోదు చేశారు. స్వామీజీ దగ్గర ఉన్న బ్యాగుల్లో పూజా సామాగ్రి, దుస్తులు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు హైకోర్టుకు నివేదించారు. కానీ ట్రాప్ జరిగిన రోజున రెండు కరెన్సీ కౌంటింగ్ మిషన్లను పోలీసు ఆఫీసర్లు ఫామ్ హౌస్‌‌‌‌‌‌‌‌కు తీసుకెళ్లారు. అక్కడ పెద్దమొత్తంలో దొరికిన నగదును లెక్కించేందుకు వీటిని తీసుకెళ్లి ఉంటారనే ప్రచారం జరిగింది. దీంతో ఆ డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకొని ఏదైనా రహస్య ప్రాంతానికి తరలించారా, లేదా ఆ నలుగురు ఎమ్మెల్యేల దగ్గర ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలేం దొరక్కపోతే.. ఇక్కడ డబ్బులు దొరికిన విషయాన్ని ఢిల్లీ డిప్యూటీ సీఎం ఎలా ధ్రువీకరించారనేది కొత్త సందేహాలకు తెరతీసింది. ఈ కేసులో ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని పోలీసులు తమ వెహికల్‌‌‌‌‌‌‌‌లో నేరుగా ప్రగతి భవన్‌‌‌‌‌‌‌‌కు తీసుకెళ్లారు. అదే వెహికల్‌‌‌‌‌‌‌‌లో క్యాష్ కూడా తరలించారా అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.కోట్ల కట్టలపైనే ఆసక్తికర చర్చ నడుస్తున్నది.