Delhi Excise policy case : కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

Delhi Excise policy case  :  కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్  విచారణను  రౌస్ ఎవెన్యూ కోర్టు (ట్రయల్)  వాయిదా వేసింది. ఆగస్టు 7 న తుది వాదనలు వింటానన్న ట్రయల్ కోర్టు జడ్జి కావేరి బవేజ తెలిపారు. సీనియర్ న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో మరో రోజు వాయిదా వేయాలని కవిత తరపు న్యాయవాది కోరారు. దీంతో కోర్టు ఆగస్టు 7 కు వాయిదా వేసింది. 

 లిక్కర్ స్కాం కేసులో కవిత గత ఐదు  నెలలుగా తీహార్  జైల్లోనే ఉన్నారు. ఈ క్రమంలో ఢిల్లీ పర్యటనలో ఉన్న మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, జగదీశ్వర్ రెడ్డి ఆగస్టు 6న జైల్లో కవితతో ములాఖత్ కానున్నారు.   జైల్లో కవితను కలిసి ధైర్యం చెప్పనున్నారు నేతలు. 

లిక్కర్ స్కామ్​ కేసులో కవితను మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సీబీఐ అరెస్టు చేశాయి. ఈ రెండు కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. ట్రయల్ కోర్టు, ఢిల్లీ హైకోర్టు ఆమె విజ్ఞప్తిని తిరస్కరించాయి.  

అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కవిత

గత కొంతకాలంగా కవిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో  జులై 22న హుటాహుటిన ఢిల్లీ వచ్చిన కేటీఆర్.. కవితతో ములాఖత్ అయ్యారు. సుమారు 15 నుంచి 20 నిమిషాలు ఆమెతో ముచ్చటించి, అరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. దీన్ దయాల్ ఆస్పత్రికి తరలించడం.. ఆ తర్వాత ఎయిమ్స్ లో వైద్య పరీక్షలు, తదితర వివరాలపై ఆరా తీశారు.