సుప్రీంకోర్టును తాకిన వరద.. నీట మునిగిన రాజ్​ఘాట్, ఐటీవో క్రాసింగ్

సుప్రీంకోర్టును తాకిన వరద..  నీట మునిగిన రాజ్​ఘాట్, ఐటీవో క్రాసింగ్

న్యూఢిల్లీ: ఢిల్లీలో యమునా నది ఉధృతి తగ్గుతున్నప్పటికీ లోతట్టు ప్రాంతాలు ఇంకా వరదలోనే చిక్కుకున్నాయి. ఇంద్రప్రస్థా డ్రెయిన్ రెగ్యులేటర్‌‌  పాడవడంతో ఎప్పుడూ రద్దీగా ఉండే ఐటీవో  క్రాసింగ్ ఏరియా శుక్రవారం నీట మునిగింది. సెంట్రల్ ఢిల్లీ వరకు వరద నీరు చేరుకుంది. రాజ్​ఘాట్​తో పాటు తిలక్​మార్గ్​లోని సుప్రీం కోర్టు ఎంట్రెన్స్​ను వరద తాకింది. 

దీంతో అప్రమత్తమైన సీఎం కేజ్రీవాల్.. ఆర్మీతో పాటు ఎన్​డీఆర్ఎఫ్ సహాయం కోరాలని సీఎస్​ను ఆదేశించారు. యమునా నది నీటి మట్టం 208.66 మీటర్ల ఆల్ టైం రికార్డు నుంచి తగ్గుముఖం పడుతున్నది. గురువారం రాత్రి 208.66 మీటర్లు ఉంటే.. శుక్రవారం ఉదయానికి 208.46 మీటర్లకు తగ్గింది. 10 గంటలకు 208.38 మీటర్లకు, మధ్యాహ్నానికి 208.27 మీటర్లకు, సాయంత్రానికి 208.20 మీటర్లకు తగ్గింది. ఐటీవో ఇంటర్​సెక్షన్​తో పాటు రెగ్యులేటర్ రిపేర్ వర్క్స్​ను ఎల్జీ వీకే సక్సేనా, సీఎం కేజ్రీవాల్ పరిశీలించారు. ఈస్ట్ ఢిల్లీ, లుటియన్స్ ఢిల్లీని కలిపే కీలకమైన ఐటీవో క్రాసింగ్ నీట  మునగడంతో ట్రాఫిక్​ను డైవర్ట్ చేశారు.

రెగ్యులేటర్ పాడవ్వడమే కారణం: కేజ్రీవాల్

ఇంద్రప్రస్థా వాటర్ రెగ్యులేటర్ రిపేరింగ్ వర్క్స్​ను పరిశీలించిన కేజ్రీవాల్ అక్కడి అధికారులతో మాట్లాడారు. డిజాస్టర్ మేనేజ్​మెంట్ డిపార్ట్​మెంట్ సాయం తీసుకుని రెగ్యులేటర్‌‌ను సరి చేసేందుకు ట్రై చేశామన్నారు. దీనికోసం ఇంజినీర్ టీమ్ రాత్రంతా ప్రయత్నించినా.. ప్రయోజనం లేకపోయిందని వివరించారు. అందుకే ఆర్మీ, ఎన్​డీఆర్ఎఫ్ సాయం కోరాల్సిందిగా సీఎస్​ను ఆదేశించానన్నారు. ఇంద్రప్రస్థ బస్ డిపో నుంచి డబ్ల్యూహెచ్‌‌వో బిల్డింగ్‌‌ మధ్య ఉండే డ్రెయిన్‌‌ రెగ్యులేటర్ పాడవ్వడంతోనే సెంట్రల్ ఢిల్లీలోకి వరద చేరిందన్నారు. రెగ్యులేటర్ రిపేర్​కే ప్రాధాన్యత ఇస్తున్నామని ఇరిగేషన్ మినిస్టర్ సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. ఎన్​డీఆర్ఎఫ్ టీమ్స్​ను ఇవ్వకపోవడంతోనే ఇలా జరిగిందని కేంద్రాన్ని విమర్శించారు. 

సిక్కింలో విరిగిపడిన కొండ చరియలు

నార్త్, ఈస్ట్ సిక్కింతో పాటు నాథులా పాస్‌‌లో కురుస్తున్న భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడుతున్నాయి. కొండ చరియలు విరిగిపడటంతో గ్యాంగ్​టక్ నుంచి త్సోమ్​గో లేక్, బాబా మందిర్​తో పాటు ఇండియా, చైనాను కలిపే నాథులా పాస్ బ్లాక్ అయింది. దీంతో బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్  (బీఆర్​వో) శిథిలాలు క్లియర్ చేస్తున్నది.

వరదలపై అమిత్​షాకు మోదీ ఫోన్

ఢిల్లీ వరదల నేపథ్యంలో ఫ్రాన్స్‌‌ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారు. పరిస్థితి తీవ్రతను సమీక్షించారు. యమునా ఉధృతి తగ్గుతున్నదని, సహాయ చర్యలు కొనసాగుతున్నాయని మోదీకి అమిత్ షా వివరించారు. కాగా, ఇరిగేషన్ మినిస్టర్ భరద్వాజ్ విమర్శలపై ఎల్జీ సక్సేనా స్పందిస్తూ..‘‘ఈ సమయం ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవాల్సింది కాదు. కలిసికట్టుగా పని చేసుకోవాలి. నేను కూడా చాలా మాట్లాడగలను.  కానీ.. ఇది టైం కాదు” అని అన్నారు.

వరదలో ఈతకు వెళ్లి ముగ్గురు పిల్లలు మృతి

వరద నీటిలో ఈతకి వెళ్లి 13 ఏండ్లలోపు ముగ్గురు పిల్లలు చనిపోయారు. ఢిల్లీలోని ముకుంద్​పూర్ ఏరియాలో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఆ ప్రాంతంలో మెట్రో పనులు జరుగుతున్నాయి. దీంతో గుంతల్లో నీళ్లు నిండాయి. పీయుశ్​(13), నిఖిల్ (10), ఆశీష్ (13) స్విమ్మింగ్ కోసం వరద నీళ్లలో డైవింగ్ కొట్టారు. ఎంతకీ బయటికి రాకపోవడంతో స్థానికులు వాళ్లని బయటికి తీసి బీజేఆర్ఎం హాస్పిటల్​కు తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు.