
న్యూఢిల్లీ: ఢిల్లీలో కాలం చెల్లిన (ఓవర్ ఏజ్డ్) వాహనాలకు ఇకపై ఫ్యుయెల్ పోయకూడదనే ఆదేశాలపై ఢిల్లీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. జులై1 నుంచి కొత్త విధానం అమల్లోకి వచ్చినప్పటికీ ఢిల్లీలో ప్రజల నుంచి ఈ విధానం అమలుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో.. ఈ ఆదేశాలను ఢిల్లీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఢిల్లీలో కాలుష్య నివారణకు పాత వాహనాలపై ఒక కొత్త విధానంతో ముందుకు రావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయాన్ని పర్యావరణ శాఖ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా వెల్లడించారు. ఈ మేరకు ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్కు ఆయన లేఖ రాశారు. డైరెక్షన్ నంబర్.89 (ఓల్డ్ వెహికల్స్కు ఇంధనం పోయకూడదనే రూల్) అమలును నిలిపివేయాలని ఈ లేఖలో మంత్రి కోరారు. ఈ రూల్ను అమలు చేయాలంటే చాలా చిక్కులు ఉన్నాయని ఈ లేఖలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ కు మంత్రి వివరించారు.
ఇంధనం కోసం రాష్ట్ర సరిహద్దులను దాటి వెళ్లే అవకాశం ఉందని మంత్రి గుర్తుచేశారు. కాలం చెల్లిన వాహనాలను గుర్తించడానికి ఏఎన్పీఆర్ సిస్టంలో కెమెరాలను సవ్యంగా అమర్చలేదని మంత్రి తెలిపారు. ఢిల్లీ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, మునిసిపల్ సిబ్బందిని పెట్రోల్ బంకులకు తరలించి.. ఓవర్ ఏజ్డ్ వెహికల్స్ బంకులకు వస్తే వారు ఇంధనం పోయకుండా చూడాలని ప్రభుత్వం భావించింది. ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్ కెమెరాల సాయంతో కాలం చెల్లిన వాహనాలను ఇప్పటికే గుర్తించారు. మొత్తం 498 బంకుల్లో అలాంటి కెమెరాలు అమర్చారు.
ALSO READ | ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం..సాంకేతిక లోపంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్
వాహన్ డేటాబేస్ కూడా అనుసంధానమై ఉన్న ఈ కెమెరాలు.. కాలం చెల్లిన వెహికల్స్ ప్యుయెల్ స్టేషన్కు వస్తే, వెంటనే ఆ స్టేషన్ ఆపరేషన్ను అలర్ట్ చేసేలా పక్కాగా ప్లాన్ సిద్ధం చేసినప్పటికీ ఢిల్లీ ప్రజల నుంచి ఈ నిషేధం అమలుపై తీవ్రంగా ఎదురుగాలి వీచింది. 15 ఏండ్లు దాటిన పెట్రోల్ వెహికల్స్, 10 ఏండ్లు దాటిన డీజిల్ వెహికల్స్కు ఢిల్లీ ప్రభుత్వం ‘ఫ్యుయెల్ బ్యాన్’ ను జులై 1 నుంచి అమలులోకి తెచ్చింది. ఢిల్లీలో కాలం చెల్లిన వాహనాలు విపరీతమైన వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయి. మొత్తం కర్బన ఉద్గారాల్లో 51 శాతం ఇలాంటి వాహనాల నుంచే వస్తోందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ (సీఎస్ఈ) 2024, నవంబరులో ఒక నివేదిక విడుదల చేసింది. ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో ప్రభుత్వం ఈ నిషేధం అమలుపై వెనక్కి తగ్గక తప్పలేదు.