
హైదరాబాద్, వెలుగు: అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినట్టుగానే.. గల్ఫ్ కార్మికులను సైతం కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. అభివృద్ధి, సంక్షేమం సమ ప్రాధాన్యంగా కేసీఆర్ పాలన సాగిందని.. అప్పుడు వలసలు వాపస్ అయ్యాయని.. సీఎం రేవంత్ రెడ్డి 22 నెలల పాలనలో వలసలు మళ్లా మొదలయ్యాయని గురువారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
జోర్డాన్ లో చిక్కుకున్న 12 మంది తెలంగాణ గల్ఫ్ కార్మికులను తిరిగి స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేసీఆర్ ఆదేశాలతో అన్ని రకాల ఏర్పాట్లు చేశామని హరీశ్ రావు చెప్పారు. వారం రోజుల్లో వారు ఇక్కడకు చేరుకుంటారని పేర్కొన్నారు. ఇది తనకెంతో సంతృప్తిని కలిగిస్తున్నదన్నారు. ‘‘అభయహస్తం మేనిఫెస్టోలో చెప్పిన గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల సంక్షేమ బోర్డుకు ఇప్పటికీ అతీగతీ లేదు.
కనీసం టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నాం” అని ఆయన పేర్కొన్నారు. కాగా, గల్ఫ్ కార్మికుల అంశాన్ని బీఆర్ఎస్ ఎంపీ సురేశ్ రెడ్డి ద్వారా విదేశీ వ్యవహారాల శాఖ అధికారుల దృష్టికి హరీశ్ రావు తీసుకెళ్లారు. సంబంధిత కంపెనీ ప్రతినిధులతోనూ చర్చలు జరిపారు.
పెనాల్టీ చెల్లించి వారిని తెలంగాణకు తీసుకువెళ్లవచ్చు అని కంపెనీ చెప్పడంతో.. ఆ మొత్తం కట్టేందుకు హరీశ్ అంగీకరించారు. గల్ఫ్ కార్మికుల ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా చెల్లించాల్సిన మొత్తంతో పాటు, స్వదేశానికి రావడానికి అయ్యే విమాన టికెట్లనూ హరీశ్‌రావు బుక్ చేశారు.